ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఏ పాలకుడైనా వారికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా గురించి శ్రద్ధ తీసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పాలకులు మెరుగైన ప్రజారోగ్య విధానాల పట్ల పెద్దగా దృష్టి పెట్టలేదు. దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అదృష్టవశాత్తు ఒక మేధ కలిగిన కార్యసాధకుడు, ప్రజల పట్ల నిబద్ధత కలిగిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 నుంచి తొమ్మిదిన్నరేండ్లు పాలించడంతో ప్రజలందరికీ శుద్ధమైన తాగునీటి సౌకర్యం అందింది. మిషన్ కాకతీయతో 45 వేల చెరువుల్లో 39 వేల చెరువులను పునరుద్ధరించడంతో, భూగర్భజలాల స్థాయితోపాటు వాటి శుభ్రత పెరిగింది.
ఇక అపర భగీరథ ప్రయత్నమైన మిషన్ భగీరథను రూపొందించి, కాళేశ్వరం నుంచి రాష్ట్రంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించారు కేసీఆర్. మరి దీని గురించి, ప్రపంచంలో ఐటీ పరిశ్రమ స్థాపించి మొబైల్ ఫోన్ కనుక్కుని సమాచార రంగాన్ని విస్తరింపజేసినట్టు చెప్పుకునే విజనరీ ఆలోచించలేదా? లేక ఆయనకు సిద్ధాంతాలే తప్ప ఆచరణ చేతకాదా? సామాన్య ప్రజల అవసరాలు పట్టవా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించని అతి ముఖ్యమైన వసతి గురించి ఆలోచించి, ఆచరణలో పెట్టిన కార్యసాధకుడు కేసీఆర్. అదీ దార్శనికతతో, ఆలోచనను సాకారం చేసుకోవడమంటే! దీనివల్ల నల్లగొండ జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాలను 1937 నుంచీ పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను సమూలంగా నిర్మూలించగలిగారు కేసీఆర్. కలలను కార్యరూపంలో పెట్టగలిగిన ప్రజ్ఞ ఉంటేనే అవి సాకారమవుతాయి.
ఉమ్మడి రాష్ట్రం కాకముందు నుంచి తెలంగాణలో నల్లగొండ ప్రాంతంలోని ఫ్లోరైడ్ సమస్య నాగార్జునసాగర్ డ్యామ్‌ను ఆనుకున్న ప్రదేశం నుంచి కిందికి దింపి కట్టడంతో మరింత ఎక్కువైంది. ఈ మోసానికి కారకుడు ఆంధ్ర ఇంజినీర్, నెహ్రూ క్యాబినెట్‌లోని మంత్రి కేఎల్ రావు. సు మారు 77 ఏండ్లు ప్రజలంతా వర్ణించనలవి కాని బాధపడ్డారు. సుదీర్ఘకాలం వేధించిన సమస్యను కొద్ది కాలంలోనే కేసీఆర్ అనే ఒకే ఒక్క మనిషి దార్శనికత, కార్యసాధక ప్రజ్ఞ వల్ల తీర్చగలిగారు.
ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీలో లక్ష ఉద్యోగాలు, అదీ ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయల జీతంతో ఇస్తానని చంద్రబాబులా గాలి మాటలు చెప్పడం కాదు. కేవలం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో 23 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సమకూర్చారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలల విజనరీ చంద్రబాబు తన 9 ఏండ్ల పాలనలో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 6 ఏండ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్తారా?
విద్యారంగం: అన్ని వనరుల్లోకి ఒక సమాజ అభివృద్ధికి మానవ వనరులు అత్యంత ముఖ్యమైనవి. వలస పాలకుల వివక్షతో మూలపడిన తెలంగాణ విద్యారంగాన్ని కేసీఆర్ తన మొదటి టర్మ్‌లోనే అభివృద్ధి చేశారు. పేద విద్యార్థుల కోసం దాదాపు 1,000 గురుకులాలు ఏర్పాటు చేశారు. 119 గురుకులాలను మైనారిటీ వర్గాల కోసం మొదలుపెట్టారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 30 డిగ్రీ కాలేజీలను ఆడపిల్లల కోసం ప్రారంభించారు. దేశంలో ఇతర రాష్ర్టాలకు 150 మెడికల్ కాలేజీలను ప్రసాదించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణపై వివక్షతో ఒక్కటి కూడా కేటాయించలేదు.
అయినప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌తో 30 మెడికల్ కాలేజీలను స్థాపించారు కేసీఆర్. 15 ఏండ్లు పైబడి ఇంకా తాత్కాలిక ఉద్యోగులుగా ఏకీకృత జీతాల (కన్సాలిడేటెడ్ పే)తో పనిచేస్తున్న డిగ్రీ, జూనియర్ కాలేజీ లెక్చరర్లను తగిన స్థాయి జీతంతో శాశ్వత ఉద్యోగులుగా మార్చారు. జూనియర్ కాలేజీల్లో ఉపాహారం, పౌష్టికాహారం అందించారు. ప్రభుత్వ విద్యావ్యవస్థ మెరుగుపడటంతో.. సామాన్య ప్రజలను దోచుకుంటున్న ఎన్నో ప్రైవేటు వ్యాపార సంస్థల్లాంటి కాలేజీలు, పాఠశాలలు మూతపడ్డాయి. ఇది కదా దార్శనికత!
2014 నుంచి 2019 వరకు విభజన అనంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు విద్యారంగంలో ఏమి అభివృద్ధి చేశారు? ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపార సంస్థల లాంటి నారాయణ, చైతన్య జూనియర్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. పోనీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏమైనా చేశారా అంటే అదీ లేదు. ఆయన ఒక కలల విజనరీ! కలలు కనడమే కానీ దానిని సాకారం చెయ్యలేని అసమర్థుడు. ఇప్పుడిప్పుడే చంద్రబాబు తత్వం అందరికీ బోధపడుతున్నది. విజనరీనన్న పేరుతో అలవికాని ప్రాజెక్టుల గురించి పదేపదే మాట్లాడి, ప్రజలను ప్రభావితం చేసే విజనరీ, ఇలలో మాత్రం ఫక్తు ఆచరణాత్మక ఆంధ్ర రాజకీయ నాయకుడు.
ఒక ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడి, నిధులు బాగా సేకరిస్తాడు. ఆ ధనం వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్లగానే ఆ ప్రాజెక్టు ఆగిపోతుంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పెద్ద నిదర్శనం కదా చంద్రబాబు పాలనకు! పోలవరం కోసం తెలంగాణ నుంచి 7 మండలాలు లాక్కుని, ఆ రైతులకు న్యాయం చేయలేదు, కేంద్రాన్ని తోసిరాజని పోలవరం తన చేతుల్లోకి తీసుకుని దాన్ని మూలపడేశారు. కాఫర్ డాం కూలిపోయాక అసలు అది అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు! ఇక అమరావతి ఇంద్రుడు దిగి వచ్చినా పూర్తి చేయలేరు. ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వనని తేల్చిచెప్పిన ప్రాజెక్టు అమరావతి. అమరావతి నిర్మాణ బాధ్యతను తానే మోస్తున్నట్టు భావించే ఏపీ మంత్రి నారాయణ నిర్వేదం, అమరావతి ప్రస్తుత పరిస్థితిని సూచిస్తున్నది.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 125 రోజులు మాత్రమే ఉపాధి పథకాన్ని ప్రకటించారు. కానీ చంద్రబాబు దాన్ని 365 రోజుల పథకంగా మార్చారు అమరావతిలో. వానలు వచ్చినప్పుడు నీళ్లు తోడిపోయడం, వర్షాలు వెలిశాక పెరిగిన తుమ్మచెట్లు కొట్టడం, కంపలు నిర్మూలించటం! ఇదే కదా ఏటా తంతు. మరి 2014 నుంచి 2019 వరకు 3డీ గ్రాఫిక్స్‌లో చూపించిన ఆకాశహర్మ్యాలు ఎప్పుడు పూర్తవుతాయి? అసలు ఈ రెండు ప్రాజెక్టుల గురించి తప్ప మిగతా రంగాల గురించి ఏమైనా వింటున్నామా? ఈ కలల విజనరీ పాలన, ప్రాజెక్టులు, అస్తవ్యస్త నిర్ణయాలు చూస్తున్న కొందరు ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన, అభిమానం కలిగిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటి వారు, మరికొందరు లోక్‌సభ, రాజ్యసభ మాజీ సభ్యులు చాలా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నిటికంటే విషాదకరమైన విషయం ఏంటంటే 2014కు ముందు వేల ఎకరాలు సాగుచేసి, పంటలు పండించిన అమరావతి రైతులు ఇప్పుడు తమకు కేటాయిస్తామని చెప్పిన కొన్ని గజాల స్థలం ఎక్కడుంది అని అడగడం! నిరాశతో కొందరు మంచానపడితే, మరికొందరు అకాల మరణానికి గురికావడం చూస్తున్నాం! ఇదేనా రాజధాని నిర్మిస్తారని నమ్మి భూములు ఇచ్చిన త్యాగానికి కలల విజనరీ ఇచ్చే ప్రతిఫలం? ఆ భూములే కాదు, ఇతర ప్రాంతాలలో లాక్కున్న భూములు కూడా బడా వ్యాపారస్తులకు ఎకరం 99 పైసలకు బాజప్త ఇస్తామని తెగేసి చెప్పడం చూస్తుంటే విజనరీ పాలన ప్రజల కోసమా? ధనవంతులైన వ్యాపారస్తుల కోసమా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రెండెకరాల ఆసామీ బిలియనీరయ్యాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ట్రిలియనీరో, ఇంకేదో అవుతాడేమో! ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మడం మానేసి, ఆయన తెలివితో అవినీతి ద్వారా అక్రమార్జనకు పాల్పడుతారని గ్రహించాలి. ఈ సత్యం గ్రహించడం వల్లనే తెలంగాణ ప్రజలు 2004లో ఆయన పార్టీని చిత్తుగా ఓడించి విముక్తి పొందారు.
ప్రగతి సాధించిన దేశాలకు, ఇంకా అభివృద్ధి బాటలోనే ప్రయాణిస్తున్న దేశాలకు ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో తప్పనిసరిగా పాఠశాల విద్య ఉంటుంది. మరో తేడా ఏంటంటే ఆయా దేశాల్లో ఏదైనా రంగానికి చెందిన కొత్త అంశం, పథకం, బీదవారి వరకు చేరుతుంది. ఉదాహరణకు ఒక కొత్త ఔషధం కనుక్కుంటే, అది ప్రభుత్వ దవాఖానల ద్వారా పేదవారికి అందుబాటులోకి వస్తుంది. అదే ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని దేశాల్లో విద్య, వైద్యం, ఆటలు, పాటలు- ఏ రంగంలో అయినా ప్రయోజనకరమైనవి అన్నీ ధనవంతుల వరకు మాత్రమే పరిమితమవుతాయి. పేదవారి చెంతకు చేరవు. పేదవాళ్లలో చాలామంది నిరక్షరాస్యులై ఉంటారు. కాబట్టి తమ పట్ల జరుగుతున్న వివక్ష, అన్యాయం, కనీసం తెలుసుకోలేరు. సింగపూర్‌ను ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయిలో నిలబెట్టిన నాయకుడు లీ క్వాన్ యూ, మలేషియాను అభివృద్ధి చేసిన మహథీర్ మహమ్మద్ తమ ప్రజల హితం కోసం మౌలిక వసతులు, విద్య, వైద్య రంగంలో ప్రతీ పథకాన్ని అందరికీ అందేటట్టు నిజాయతీగా రచించారు, సాధించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి, సాంకేతిక రంగంలో ప్రపంచంతో పోటీ పడేటట్టు ప్రజలను తీర్చిదిద్దారు.
భారతీయ రాజకీయ నాయకులు చాలామంది అవినీతిలో కూరుకుపోవడం వల్ల, 78 ఏండ్లలో దేశం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదు. ఇక 2014లో సమైక్య పాలకుల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి విడిపడిన తెలంగాణ, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అత్యద్భుత ప్రగతి సాధించింది. కేసీఆర్ ప్రజల అవసరాలు, ఆకాంక్షలు గ్రహించిన, ప్రజల పట్ల ప్రేమ, నిబద్ధత కలిగిన నాయకుడు కావడంతో రాష్ట్రం అత్యంత తక్కువ కాలంలోనే దేశంలో ప్రప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర సంపద, ప్రజల జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి.
కేంద్రం ఇచ్చే 16 రంగాల అవార్డులలో 13 అవార్డులు తెలంగాణకు దక్కాయి. తెలంగాణలో ఏయే రంగాలు ఎంతగా అభివృద్ధి చెందాయో చెప్పేందుకు ఇదొక నిదర్శనం. పేద, మధ్య తరగతి వారి అత్యవసరాల్లో ఒకటైన విద్యా వసతి, ప్రజలకు సంపూర్ణంగా అందింది. 15 ఏండ్ల పైబడి అడ్హాక్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, కాలేజీ లెక్చరర్లకు శాశ్వత భద్రత కల్పించారు కేసీఆర్. రూ.15 వేలు సంపాదించే డిగ్రీ లెక్చరర్‌కు స్కేలు వచ్చి రూ.76,000 సంపాదన అయింది. అందరికీ జీతాలు పెంచారు. హైర్ అండ్ ఫైర్ అనే చంద్రబాబు సిద్ధాంతానికి కేసీఆర్ విధానం పూర్తిగా భిన్నమైన మానవీయ విధానం. వేల మందికి ఉద్యోగ భరోసా, విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య కంటే అధిక సంఖ్యలో ఉన్న మధ్య తరగతికి, వెనుకబడిన జాతుల వారికి ఉపకారం ఇంకేముంటుంది? అదీ నిజమైన మానవీయ విలువలు, ప్రజల పట్ల ప్రేమ, రాష్ట్ర భవిష్యత్తు పట్ల దార్శనికత కలిగిన నాయకుడిగా కేసీఆర్ సాధించిన ప్రగతి ఘనత!
-కనకదుర్గ దంటు ,89772 43484