తెలంగాణ గోస తెగించి కొట్లాడే దాకా వచ్చింది. తెలంగాణ ఆత్మకు మూలమైన అస్తిత్వకాంక్ష అన్నివైపుల నుంచి మోసకారి వెన్నుపోట్లకు గురవుతున్నది. అదొక సంధియుగం. నిరాశల చీకట్లను చీలుస్తూ విముక్తి ప్రదాత వెలుగుదారి చూపిన కీలక ఘట్టమది. మలిదశ ఉద్యమాన్ని వేలుపట్టి నడిపించిన నాయకుడు సర్వోన్నత త్యాగానికి సిద్ధమైన ఉద్విగ్న క్షణాలవి. కత్తుల వంతెనపై నడిచింది తెలంగాణ. గుండె నెత్తురులు ఒలికించింది. వివక్షలు, దురన్యాయాలు ఇంకానా ఇకపై సాగవు? అని గిరిగీసి బరిలో నిలిచింది. ఇంకెన్నాళ్లీ ద్రోహాలు, దోపిడులని తిరగబడుతున్న మలుపులో మహానేతకు గాంధేయమే గాండీవమైంది. అహింసతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన సత్యాన్వేషి మార్గంలో సమిధగా మారేందుకు ఉద్యమించారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలు పిట్టల్లా రాలుతుంటే ఆయన తల్లడిల్లిపోయారు. బలిదానాలు గతచరిత్ర కావాలని తపించారు. రేపటి వెలుగుల కోసం తనను తాను సమర్పించుకునేందుకు సమాయత్తమయ్యారు. తెలంగాణ సంకెళ్లు తెగటార్చేందుకు నిరశన దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి రణరంగంలోకి దూకారు. మృత్యువుకు ఎదురేగారు. ‘తెలంగాణ ఇచ్చుడో.. నేను సచ్చుడో’ అంటూ తుదిసమరం ప్రకటించారు.
శాంతియుత దీక్షపై మహాత్ముని అంతేవాసులమని చెప్పుకొని తిరిగే రాజకీయ ముఠా కత్తిగట్టింది. కుట్రలకు తెరలేపింది. పోలీసు బలగాలతో తెలంగాణను దిగ్బంధించింది. అయినా దీక్ష ఆగలేదు. నిలువెల్లా తెలంగాణను నింపుకొన్న నేతకు లేశమాత్రమైనా హాని కలిగితే జనాగ్రహం కట్టలు తెంచుకునే పరిస్థితి. తెలంగాణ భగభగమండే అగ్నిపర్వతమైంది. లావా ప్రవాహాలు ఉప్పొంగుతున్నాయి. ఇక కేంద్రం దిగిరాక తప్పలేదు. ఎందరెందరో మహామహులు, హింసాత్మక పోరాటాలు సాధించలేనిది ఒక వ్యక్తి సంకల్పం సాధించింది. ఆ సంకల్పం పేరే కేసీఆర్. ఆ విజయాన్ని సాధించిన మృత్యుంజయుని పేరే కేసీఆర్. ఆ దీక్ష తెలంగాణ పాలిట శ్రీరామరక్ష అయ్యింది. అంతిమ పోరాటపు పొలికేక మరపురాని మహోజ్వల ఘట్టంగా నిలిచింది. కేసీఆర్ దీక్షా దక్షతలు ఫలించి తెలంగాణ కల నిజమైంది. స్వరాష్ట్రమై, ఆత్మగౌరవ పతాకమై రెపరెపలాడింది.
స్వరాష్ట్ర సాధకుడే ప్రగతిపథ నిర్దేశకుడై చల్లని రాజ్యాన్ని స్థాపించడం ఘన చరిత్ర. సంక్షేమం, సమృద్ధి రెండు చక్రాలుగా నడిచాయి. బీటలువారిన తెలంగాణ తేటపడింది. నీరు పైపైకి పారింది. పొలం పచ్చబారింది. కరువు దరువులు మోగిన గడ్డ దేశానికే అన్నపూర్ణగా మారింది. అన్నిరంగాల్లో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలవడం మరో చరిత్ర. ఈనగాచి నక్కలపాలైనట్టు తెలంగాణ మళ్లీ గోస పాలైంది. తెలంగాణ సోయిలేని పాలకుల ఏలుబడిలో నిత్య నరకం అనుభవిస్తున్నది. ప్రభుత్వ దుష్పరిపాలనపై ప్రజలు బాహాటంగా తిరగబడుతున్నరు. సర్కారు మెడలు వంచుతున్నరు. ఆ పదేండ్ల పాలన నిమ్మళాన్నే పదేపదే యాది చేసుకుంటున్నరు. అందుకే ఈసారి దీక్షా దివస్ మరింతగా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మరో మహాపోరుకు పిలుపునిస్తున్నది. ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిని పొందిన నవంబర్ 29 దీక్షా దివస్ మరోమారు మారుమోగుతున్నది. ఇది పిదపబుద్ధులు చెరిపేస్తే చెరిగిపోయేందుకు నీటిమీద రాతకాదు.. సువర్ణాక్షరం. కేసీఆర్ అంటే తెలంగాణ ఆనవాలు. చెరగని చేవ్రాలు.