కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి రాహుల్‌గాంధీలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జోష్ కనిపిస్తున్నది. ఇది ఆత్మవంచనతో తెచ్చి పెట్టుకున్నదా? లేక నిజంగానే మనసుల్లోంచి వస్తున్నదా? అనేది దేవతా వస్త్రంలాంటిది. నిజం ఏమైనా త్వరలో ఎన్నికలున్న రాష్ర్టాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశల పల్లకీలెత్తుకొని పాదయాత్రలకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోనైతే ‘నేతలెక్కువ పాదయాత్రలకు రోడ్లు తక్కువ’ అన్నట్టు తయారైంది.
కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించటంలో కీలక పాత్ర పోషించారంటున్న డీకే శివకుమార్ తెలంగాణలో వ్యూహాలు రచిస్తారని ప్రకటించటంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే అధికారంలోకి వచ్చినట్టు ఊహించుకోవటం మొదలెట్టారు. ‘ఆలు లేదు చూలు లేదు… కొడుకు పేరు ఏదో’ అన్నట్టు మంత్రిపదవులు కూడా పంచుకుంటున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడైతే ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయినట్టు ఊహించుకొని తన రాజకీయ బాస్ బాబులా ఉచిత విద్యుత్తుపై తెలంగాణ ప్రజల మైండ్‌సెట్‌ను మార్చేయటానికి సిద్ధమైపోయారు. అధికారంలోకి రాకముందే ఇంత థాట్ పోలీసింగ్, బుల్డోజింగ్ ఉంటే ఒకవేళ వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ కాంగ్రెస్ కర్నాటకం తెలంగాణలోనూ పనిచేస్తుందా అనేది అసలైన ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకొనే ముందు కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలవగలిగిందనేది చూడాలి. కర్ణాటకలో బీజేపీ నాయకత్వం బలహీనమైంది. పూర్తిగా అధిష్ఠానం మీద ఆధారపడింది. నాలుగేండ్ల వారి పాలన అత్యంత అసమర్థంగా సాగింది. అవినీతి మయంగా మారింది. అది కాంగ్రెస్‌కు కలసి వచ్చింది. సిద్ధరామయ్య, డీకేల నాయకత్వ ప్రతిభను చూసో, వారు నిజాయితీ పరులనో, వారి హయాంలో అవినీతి అసలు ఉండదనో కర్ణాటక ప్రజలు వారిని గెలిపించలేదు. కర్ణాటక బీజేపీ అసమర్థ పాలనతో, అవినీతితో విసుగెత్తి ‘ఎవరైనా ఫర్వాలేదు… వీళ్లు మాత్రం వద్దు’ అనే నిర్ణయానికి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. అంతేగాని డీకే ఎత్తుగడలను చూసో, సెంథిల్ వ్యూహాలకు ముచ్చటపడో, సునీల్ కనుగోలు పేసీఎం పోస్టర్లకు మురిసిపోయో కాదు. కర్ణాటకలో ప్రజల తీర్పు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో వచ్చిందే తప్ప కాంగ్రెస్‌పై ప్రేమతో వచ్చింది కాదు. జేడీఎస్‌కు కొన్ని సీట్లు ఇస్తే దాంతో పొత్తుపెట్టుకుని బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందేమో అన్నభయంతో కాంగ్రెస్‌ను గెలిపించారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి ఏనాడో ఖరారై పోయింది.
కాబట్టి కర్ణాటక వాపును బలమనుకొని తెలంగాణలో హస్తవాసి పెరిగిందనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. కర్ణాటకలో బీజేపీ పాలనంత దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణలో ఏ మాత్రం లేనేలేవు. డబుల్ ఇంజిన్ పేరిట కేంద్రం లో మోదీ అండగా ఉన్నా కర్ణాటకలో బీజేపీ సర్కా రు పాలనలో, అభివృద్ధిలో దారుణంగా విఫలమైం ది. అవినీతిలో మునిగితేలింది. తెలంగాణకు కేం ద్రం మోకాలడ్డుతున్నా, మిషన్ కాకతీయ, భగీరథ, కాళేశ్వరంలాంటి ప్రజాప్రయోజన పథకాలకు నయాపైసా ఇవ్వకున్నా… ఈడీ, సీబీఐల పేరుతో రాజకీయంగా బెదిరిస్తున్నా… పక్కరాష్ట్రం నుంచి కుటిల రాజకీయాలు, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నా, అప్రమత్తంగా ఉంటూ కొత్త రాష్ట్రం తెలంగాణను కేసీఆర్ ఈ పదేండ్లలో యావద్దేశం ముందు తలెత్తుకునేలా నిలబెట్టారు. ఈ పదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, పథకాలను, ప్రాజెక్టులను, పాలనను చూసి సగటు తెలంగాణవాసి గర్వపడుతున్నాడు.
కొత్తగా రాష్ట్రమిస్తే ఏం చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇదిగో చూడండని తెలంగాణలో ఎవ్వరైనా దేశంలో ఎవ్వరినైనా గర్వంగా పిలిచి చూపించే పనులు బోలెడన్ని జరిగాయిక్కడ. యావద్దేశానికి మార్గదర్శకంగా నిలిచే పనులు, పథకాలు బోలెడన్ని జరుగుతున్నాయి. ఈ సంగతి కేసీఆర్‌ను విమర్శించేవారు సైతం అంగీకరించక తప్పని నిజం. ఏరకంగా చూసినా తెలంగాణలో కేసీఆర్ పాలనకు, కర్ణాటకలో బీజేపీ పాలనకు పొంతనలేదు. ఎవరైనా ఫర్వాలేదు కేసీఆర్ మాత్రం వద్దు అనే పరిస్థితి తెలంగాణలో లేదు. మాకు ఇంకెవరూ వద్దు కేసీఆరే కావాలన్న మాటే అన్ని చోట్లా!
పైగా కర్ణాటక, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, నేపథ్యాలే వేరు. ఇక్కడ ఇచ్చే తీర్పు తెలంగాణ అస్తిత్వంతో ముడిపడి ఉంటుంది. ఎన్నో అవమానాలను దాటుకొని.. ఎన్నో కుట్రలు కుతంత్రాలను ఛేదించుకొని ఎన్నో ఉద్యమాలను అల్లుకొని.. ఎంతోమంది అమరులను త్యాగం చేసుకొని అసాధ్యమనుకున్నదాన్ని సాధించుకున్న తెలంగాణ గడ్డ 2014లో అనుమానాల మధ్య పురుడుపోసుకున్నది. బతుకుతుందో బతుకదో అని యావద్దేశం అనుమానంగా చూసిన ఆ బిడ్డ… కేసీఆర్ సంరక్షణలో బోర్లవడి, అంబాడి నేడు ధైర్యంగా ఆరోగ్యంగా నిలబడింది. ఉత్సాహంగా ఉరకలెత్తుతున్నది. ఇలాంటి తరుణంలో ఆవేశంతో, అనాలోచితంగా, ఎవడో ఏదో చెబితే నమ్మో, సోషల్ మీడియాలో మీమ్స్‌ను చూసో, సినిమా డైలాగులకు మురిసో నిర్ణయాలు తీసుకుంటే నిలబడ్డ తెలంగాణ కుప్పకూలే అవకాశం ఉన్నది. వచ్చిన తెలంగాణ మాయమైపోయే ప్రమాదమూ ఉంది. ఆ సోయి పార్టీలకు, మీడియాకు, సోకాల్డ్ మేధావులకు లేకపోవచ్చు. తెలంగాణ ప్రజానీకానికి మాత్రం ఉన్నది.
తమకు రాష్ట్రం వస్తే సరిపోదు, అది నిలదొక్కుకోవాలి, ముందుకు దూసుకుపోవాలనే తపనా తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్నది. ఏ మాత్రం తప్పటడుగు వేసినా వచ్చిన తెలంగాణ చేజారుతుందన్న స్పృహ ఉన్నది. ఆ తపనను తీర్చగల నాయకత్వాన్ని ప్రజానీకం ఎంచుకుంటూ వస్తున్నది. అందుకే తెలంగాణ వచ్చిన అత్యంత భావోద్వేగ తరుణంలోనే కాంగ్రెస్‌ను కాదని తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌కు పట్టంగట్టింది. భావోద్వేగాల ఉచ్చులో పడకుండా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంలో ఆ సత్తా లేదని నమ్మి, ఎలాంటి మొహమాటం లేకుండా కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)కు ఓటేసింది తెలంగాణం. ఒకసారి కాదు రెండోసారి కూడా అదే తీర్పునిచ్చింది. రెండోసారైతే కాంగ్రెస్ సీట్లలో తెలంగాణ ప్రజలు ఇంకా కోత పెట్టడం గమనార్హం.
తాము ఆశిస్తున్న అర్హత లేకే కాంగ్రెస్‌ను ప్రజానీకం అధికారానికి దూరం పెడుతున్నది. అంతటి చైతన్యవంతమైన ఓటర్లున్న తెలంగాణలో ప్రజలను మాయ చేయటం కాంగ్రెస్‌కు అంత సులభం కాదు. కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ డొల్ల నాయకత్వం లేదు. పనులు చేయని ప్రభుత్వమూ కాదు. ఉబుసుపోక అవినీతి ఆరోపణలు, ఉచిత పథకాలపై విమర్శలు చేస్తూ కర్నాటకం ఆడితే నమ్మి మళ్లీ చీకటి రోజుల్లోకి పోవటానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉందనుకుంటే అంతకంటే వెర్రివెంగళప్పలు మరొకరు ఉండరు. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వం ఉన్నదా? అనేది బేరీజు వేసుకోకుండా కర్ణాటక వ్యూహాలకు పడిపోయే స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్‌కు అతిపెద్ద బలహీనత ఆ పార్టీ అధ్యక్షుడే. తన రాజకీయ బాస్ చంద్రబాబుతో కలసి తెలంగాణను కంసుడిలా పురిట్లోనే చంపాలని చూసిన సంగతిని తెలంగాణ ప్రజలు మరచిపోయారనుకుంటే పొరపాటు. కేసీఆర్ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ తలెత్తుకొని నిలదొక్కుకున్నది. లేదంటే యావద్దేశం ముందు అవకాశం ఇచ్చినా విఫలమైన రాష్ట్రంగా తలదించుకోవాల్సి వచ్చేది. నోటుకు ఓటు కేసులో ఇరుక్కొని జైలుకెళ్లి, టీడీపీకి భవిష్యత్తు లేదని గుర్తించి తన బాస్ వ్యూహాల మేరకు కాంగ్రెస్‌లో దుంకారు. ఢిల్లీలో ఆయన చక్రం తిప్పిన ఫలితంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. బలహీనంగా ఉన్న ఆ పార్టీ అధిష్ఠానాన్ని, ఆ బలహీనానికే గులాములైన రాష్ట్రంలోని సీనియర్లను బుల్డోజ్ చేసుకుంటూ ఆంధ్ర మీడియా సాయంతో తెలంగాణ ప్రజల మనసులను మలినం చేసే ప్రయత్నం మొదలెట్టారు.
మొదట కాళేశ్వరం వద్దన్నారు.తర్వాత ప్రగతిభవన్ కూల్చేస్తానన్నారు. ఆ తర్వాత సెక్రటేరియెట్ ఎందుకన్నారు. ఇప్పుడు కొత్తగా ఉచిత కరెంటు ఎందుకంటున్నారు. మున్ముందూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీయరనే గ్యారెంటీ ఏముంది?
ఈ ప్రశ్నలు తలెత్తటానికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ నాయకత్వం కేంద్రంలో, రాష్ట్రంలో బలహీనంగా ఉన్నది. బీజేపీ కేంద్రంలో బలంగా ఉన్నా, రాష్ట్రంలో ఆ పార్టీ నాయకత్వం బలహీనం. అధిష్ఠానం ఏం చెబితే అదే. మోదీ, షాల అడుగులకు మడుగులు ఒత్తేవారే తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం ధిక్కరించేంత సాహసం చేసేవారు లేరన్నది ప్రత్యక్షంగా కనపడుతున్నదే. ఈ రెండు పార్టీల అధిష్ఠానాలను లాబీయింగ్ చేసి ఒప్పించే సత్తా ఏ విషయంలోనైనా ఆంధ్ర రాజకీయనాయకులకున్నది. పైగా రాజధానులు తేలక, రాజకీయ సమీకరణాల్లో కొట్టుమిట్టాడుతున్నారు కూడా! ఆ సంక్షోభాన్ని తేల్చుకోలేక మళ్లీ తెలంగాణపై కన్నేసినా వేయొచ్చు.
జాతీయ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ అధిష్ఠానాలు ఏ నిర్ణయానికైనా తెగిస్తాయి. రాష్ర్టాల్లోని పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి వెనుకాడవు. తెలంగాణలో రాజకీయ మార్పుల ప్రభావాన్ని కర్ణాటకలోనో మరో రాష్ట్రంలోనో ఫలితంగా తేలిగ్గా తీసుకోవటానికి లేదు. ఐదేండ్ల తర్వాత మళ్లీ చూసుకుందాం కావాలంటే అనుకునే అవకాశం ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఒకసారి చేజారితే తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడవచ్చు! కాబట్టి తెలంగాణ ప్రజానీకం అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది.