‘అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ సంపూర్ణ శరణాగతిని సూచించే శక్తిమంతమైన శ్లోక పాదం ఇది’ దేవా! నీవు తప్ప నాకు వేరే దికు లేదు, నిన్ను మాత్రమే నేను శరణు వేడుతున్నాను అని దీని అర్థం. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన వెంట సగం మంత్రివర్గం కాళేశ్వరం వెళ్లినప్పుడు, గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతి నదుల త్రివేణి సంగమ తీర ఆలయంలోని కాళేశ్వర, ముక్తేశ్వర దేవుళ్లకు ప్రణమిల్లినప్పుడు, జలయుద్ధంలో గాయపడ్డ తల్లి మేడిగడ్డకు మోకరిల్లినప్పుడు, జనం మధ్య నిలబడి కాళేశ్వరం పునరుద్ధరణకు ఎలా ముందుకు వెళ్లాలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు ఈ శ్లోక పాదం నాకు పదే పదే గుర్తుకు వచ్చింది.
‘కట్టిన ఇల్లు, పెట్టిన పోయ్యి లెక్క రాష్ర్టాన్ని అప్పజెప్పితే ఇంత ఆగమాగం చేస్తరా! రైతుబంధు రాదు.. యూరియా ఇయ్య శాతగాదు. ఇయ్యాల కాకికి పెడుదామంటే కంకెడు లేవు.. పిట్టకు పెడదామంటే పిడికెడు లేవు అన్నట్టుంది తెలంగాణ పరిస్థితి. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతున్నరు. పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడుతుందా? నువ్వు వెయ్యి జన్మలెత్తినా.. నేను సావ… కొడక. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తా’ అని కేసీఆర్ అచంచల విశ్వాసం ప్రకటించినప్పుడు చాలా కాలం తర్వాత ఉద్యమ కేసీఆర్ సింహగర్జన మళ్లీ చెవుల నిండుగా వినిపించింది. వారి ప్రసంగంలో వీరం తొణికింది.. ఆర్తి విరిసింది.. కరుణ కురిసింది.. చతురం వొలికింది.. ఢమరుకం శబ్ధాలు ఉబికి ప్రవహించినట్టు కేసీఆర్ మాట్లాడుతుంటే జనం ఒగ్గుకథ విన్నట్టు ఊగిపోతూ చప్పట్లు చరుస్తున్నప్పుడు మళ్లీ పాత కేసీఆర్ పదేపదే గుర్తుకొచ్చారు.
ఒకే రోజు.. ఒకే ఘడియలో.. ఒకే యవనిక మీద సాక్షాత్కరించిన అపూర్వ సాదృశ్యాలు. వాటికి మలి సూర్యోదయం తోడయింది. కాళేశ్వరం కమిషన్ చెల్లదంటూ జల కుట్రలను నిట్ట నిలువునా చీల్చుకుంటూ హైకోర్టు తీర్పు వచ్చింది. ఈ మూడు దృగ్విషయాలు కలెగలిసి.. గూడు చెదిరి, గుండె పగిలిన బడుగు జీవులకు.. ఎరువు లేక, నీళ్లు రాక, ఎవుసం సాగక కునారిల్లిన అన్నదాతలకు.. పెంచుతామన్న పింఛన్ కోసం గాజు కళ్లతో ఎదురు చూస్తున్న అవ్వాతాతలకు దారీ దీపం దొరికినట్టయింది.
కొంపలు కూల్చిన ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులకు కాలం చెల్లి.. కేసీఆర్ జమానా నాటి బంగారు తెలంగాణకు తొవ్వ పడ్డట్టే అనే నమ్మకం కుదిరింది. రాబోయే సర్కారు ఎవరిదో.. భవిష్యత్తు తరం తలరాత ఏమిటో ఖరారు చేసింది. ‘దేశంలోఎల్నినో ముంచుకొస్తున్నది. జల సంరక్షణ చేసుకోకకుంటే 2002 నాటి కరువు మళ్లీ వస్తుంది. జాగ్రత్త’ అని వాతావరణశాఖ హెచ్చరికలు చేస్తున్న వేళ మేడిగడ్డ మూలాలను వెతుక్కుంటూ కాళేశ్వరం వరకు పరుగులు పెట్టడం పాలకులకు ఒక అనివార్యత. ఎందుకంటే.. తెలంగాణకు జలమే జవసత్వం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం. ఈ పునాదుల మీద కట్టిందే కాళేశ్వరం. ‘ఉద్యమ సమయంలో నీళ్ల కష్టాలు చెప్పాల్సి వచ్చినప్పుడు.. ‘రాసుకుంటే రామాయణమంత, చెప్పుకుంటే భాగవతమంత’ అని కేసీఆర్ ఒక్క వ్యాకంతో ఈ నేల ఆర్ద్రతను చెప్పేవారు. నీళ్లు లేక బీడువడ్డ తెలంగాణకు కేసీఆర్ చూపిన రూపం కాళేశ్వరం. ఉమ్మడి రాష్ట్రంలో 90 టీఎంసీల గోదావరి నీళ్లు తెలంగాణ భూములకు పారుతే అదో పెద్ద చరిత్ర. కానీ ఇప్పుడు అదే బేసిన్లో దాదాపు 350 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నది. మేడిగడ్డ దగ్గర ప్రాణహిత జలాల్ని ఒడిసిపట్టి ప్రధాన గోదావరి మీదుగా బేసిన్ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే శక్తియుక్తులు తెలంగాణ సొంతం. రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలన ఈ జలసత్యాన్ని కప్పిపెట్టాలని చూసింది. ప్రాజెక్టు కుప్ప కూలిందని, లక్ష కోట్లు ఆవిరి అయ్యాయని దబ్బర పూతలు పూసింది. ప్రాజెక్టును పండబెట్టి, నిర్దాక్షిణ్యంగా పంట పొలాలను ఎండబెట్టింది. నీళ్లను నిలువరించి కేసీఆర్ మీద నిందలు వేసింది. కానీ కాలం బలీయమైనదని తెలంగాణ హైకోర్టు తెల్చి చెప్పింది. రెండున్నర ఏండ్ల పాలకుల డ్రామాను ఆక్షేపించింది.
కేసీఆర్ జగిత్యాల జైత్రయాత్రకు వెళ్తున్నారని తెలిసి, పరుగో పరుగున కాళేశ్వరం వెళ్లిన పాలకులు ‘కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో పిల్లర్లకు మరమ్మతులు చేసి, పునరుద్ధరిస్తాం, ఎలా ముందుకు వెళ్లాలో ఒక స్పష్టత వచ్చింది’ అని ప్రకటించారు. పునరుద్ధరణలో భాగస్వాములు అయ్యే ఏజెన్సీలు, నిపుణులు సమస్యను అర్థం చేసుకొంటే సగం సమస్యకు పరిష్కారం దొరికినట్టేనని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం నీళ్లు మళ్లీ పారిస్తామని ప్రజలకు వివరించారు. అంతకు కొన్ని రోజుల ముందే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ మరమ్మతుల కోసం పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీర్లు, నిపుణులతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. రుతుపవనాలు రాకముందే జియోటెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని ఆదేశించింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తిచేయాలని డెడ్‌లైన్ పెట్టింది. సీడబ్ల్యూసీ-ఎన్డీఎస్ఏ అనుమతులతో పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఇదే తెలివి అధికారంలోకి వచ్చిన రోజున ఏమైంది? ఇదే పని అప్పుడే చేయాలని మొదటి నుంచి కేసీఆర్ మొత్తుకుంటనే ఉన్నరు కదా? అని తెలంగాణ రైతులు అడుగుతున్నరు. తెలంగాణ వచ్చే నాటికి నదులు, వాగులు, చెరువులు, కుంటలు, బావులు, బోర్లు సకల జలవనరులన్నీ కలిపితే 1.31 కోట్ల ఎకరాల సాగు విస్తీరణం మాత్రమే ఉండేదని, 45 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యేది. అది కూడా కాలమైతేనే పంట. లేకుంటే తంట. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపం ఇచ్చి, కృష్ణా నది మీది భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కేఎల్ఐ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చిన తర్వాత 2.2 కోట్ల ఎకరాల మాగాణి సాగులోకి వచ్చింది. 3 కోట్ల టన్నుల ధాన్యం చేతికి అందింది.
ఎప్పుడూ ఎడారి బతుకుల తీరు కరువుతో పోటీపడి కాలం ఎళ్లదీసే పాటిగడ్డ మీది మా సూర్యాపేట జిల్లా కోనసీనమను తలపించింది. మా సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో 1.25 లక్షల ఎకరాలు, సూర్యాపేట, కోదాడలో కలిసి మరో 1.35 లక్షల ఎకరాలతో మొత్తంగా 2.60 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. కాళేశ్వరం తెచ్చిన జలవిప్లవంతో పల్లె బతుకులో జీవకళ వచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డది. రైతు రూపం రాజసాన్ని సంతరించుకున్నది. ఫ్యాక్షన్ తరహా హత్యలతో నెత్తురు పారిన తుంగతుర్తి రాజకీయ ముఖచిత్రం.. గోదావరి జల స్పర్శతో శాంతివనం అయింది.
ఇట్లా తెలంగాణ తెప్పరిల్లుతున్న తరుణంలో ఓ కుదుపు వచ్చి మీద పడింది. మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు స్వల్పంగా కుంగిపోయాయి. దాన్ని రాజకీయ ఎజెండా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె మీద కూర్చోవటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. కాళేశ్వరం అంటే మూడు బారాజ్‌లు, 8 బ్లాకులు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు, 203 కిలో మీటర్ల సొరంగాలు, 1531 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 227 పిల్లర్లతో ఉన్న బహుళ దశల, బహుళ ప్రయోజనాలు సమకూర్చే జల ప్రాజెక్టు అని శాసనసభలో, శాసనసభ బయట అవకాశం ఉన్న ప్రతిసారీ నీటిపారుదలశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు ఎప్పుడూ చెప్తుంటరు.
ఇక బహుళ సాధక ప్రాజెక్టు 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ కుంగిపోయింది. ఆ పిల్లర్ బరువు పక్కన ఉన్న రెండు పిల్లర్ల మీద పడ్డది. పిల్లర్ కుంగుబాటు కారణాలను ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ), ఐఐటీ రూరీ సంస్థ, పాజెక్టు నిర్మాణ ఏజెన్సీలు అధ్యయనం చేశాయి. సాంకేతిక పరీక్షలు నిర్వహించాయి. కుంగిన పిల్లర్, దాని ప్రభావం పడిన రెండు పిల్లర్లను మాత్రమే కాకుండా మొత్తం 227 పిల్లర్లను ఆనాడే పరీక్షించారు. 7 వ బ్లాక్‌లోని ఈ మూడు పిల్లర్లు మినహా అన్నీ భద్రంగానే ఉన్నాయని తేల్చి చెప్పారు. 7వ బ్లాక్‌కు మరమ్మతులు చేసి మళ్లీ ప్రాజెక్టును భేషుగ్గా వినియోగంలోకి తేవచ్చని స్పష్టంచేశారు. కానీ రేవంత్ సరార్ ఘోష్ కమిషన్ వేసింది. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టింది. ఆయన ప్రతిష్టకు మలినం పూసే ఎత్తులు వేసింది. కానీ అంతిమంగా న్యాయం గెలిచింది. కేసీఆర్ కడిగిన ముత్యం తీరు నిలబడ్డరు. ఘోష్ కమిషన్ విచారణ , ఆయన నివేదిక సహజ న్యాయ సూత్రాలకే విరుద్ధం అని హైకోర్టు తేల్చి చెప్పింది. పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నదని హైకోర్టు ఆక్షేపించింది.
ప్రపంచ రాజకీయ చరిత్రలోనే కేసీఆర్‌కు ఎదురైనన్ని శల్య శోధనలు, శీలపరీక్షలు ఎవరికీ తారసపడి ఉండకపోవచ్చు. ఆయన భాష మీద దాడి చేశారరు, వ్యక్తిత్వంపై దాడి చేశారు. నిబద్ధత మీద దాడి చేశారు. నడవడికపై మీద దాడి చేశారు. 2001 జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరేసిన నాటి నుంచి మొన్నటి జగిత్యాల సభ వరకు కేసీఆర్‌ను తెలంగాణ ద్రోహులు తిట్టని పొద్దే లేదు. అపర భగీరథుడై కాళేశ్వరం యజ్ఞం తలపెట్టిననాడు ఎన్ని ఆటంకాలు? ఎన్ని నీలాపనిందలు? ఎన్ని కుట్రలు? ఎన్ని కేసులు? ఆఖరికి చనిపోయిన వారి పేర్లతో కూడా కేసులు పెట్టారంటే ప్రజాకంటకులు ఏ స్థాయిలో బురదజల్లారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర సంస్థలపై ఒత్తిళ్లు తీసుకొచ్చి ఎంత ఇబ్బంది పెట్టారు!
కేసీఆర్‌ది ఉక్కు గుండె కాబట్టి తట్టుకున్నరు. ఎదురుదెబ్బ తిన్న ప్రతిసారీ ప్రత్యర్థి కూడా అబ్బురపడేలా నిబ్బరం కనబరిచారు. కేసీఆర్ తాత్వికతను, సాత్వికతను అర్థం చేససుకోలేని ప్రత్యర్థులు ‘అడవిలో చెట్టుకు ఉరి తీసి చంపుతా.. ఘోరీ కడుతా.. బొంద పెడుతా.. పేగులు మెడలేసుకుం టా’ అని పేలినప్పుడు భౌతిక రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా నిర్గుణ చైతన్యం, అంతకు మించిన స్థితప్రజ్ఞత ప్రదర్శించారు. కాబట్టే అద్భుత జలదృశ్యం కాళేశ్వరం నిర్మించి, బంగారు తెలంగాణను నిలబెట్టి జాతికి ఇవ్వగలిగారు.
ఉద్యమంలో వెనకి తగ్గితే తనను రాళ్లతో కొట్టి చంపండని పిలుపునిచ్చిన సంచలన చరిత్ర కేసీఆర్‌ది.‘60 ఏండ్ల ఆకాంక్ష సాధన కోసం అవసరమైతే బొంత పురుగునైనా ముద్దాడుత’ అని తేల్చిచెప్పిన తెగింపు ఆయనది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో ఇప్పటికీ ఆయనది అదే ఉన్నతమైన, ఉదాత్తమైన లక్ష్యం. మేడిగడ్డ ఆనకట్టన గాయపడ్డ పిల్లర్‌ను అడ్డంపెట్టి ఆడిన డ్రామాలు ఇక చాలు. కేసీఆర్ భగీరథ సంకల్పాన్ని.. ఆయన సృష్టించిన జల విప్లవ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. ఇప్పటికైనా సూర్యుని మీద ఉమ్మి వేయాలని ఆరాటం మానుకొని కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్దరించాలని తెలంగాణ రైతాంగం అడుగుతున్నది.