ఘన కాళేశ్వరముక్తిధామమున సంకాశించు గోదావరీ
జననీ దివ్య దయామృతమ్ము ఝరియై సాగంగ మున్ముందుకున్
వినిపించున్ సిరి కాలియందియల సంవేద్యమ్ముతా రావముల్
జనతా క్షేత్రములన్ పసిండి వెలుగుల్ జాల్వారగా నిత్యమున్!
బసవైశ్వర్యము సంగమేశ్వరముతో పారించు నీరమ్ములన్
కొసల్ దాకగ బీడుభూములు కళల్ గూర్పంగ రత్నమ్ములై
దెసలెల్లన్ కడుపచ్చనై కనబడన్ దీరెన్ తెలంగాణయే
ప్రసరింపన్ నవకాంతులే గృహములన్ రాజిల్లు కోశమ్ములై!
అపరభగీరథోద్యమములంతములేని ప్రయత్న దీక్షలే
యపజయమింతలేని గతి నభ్యుదయమ్ము సాగుచుండగా
నపరిమితాశయప్రభలకాశ్రయమైనది రాష్ట్రమంతయున్
సుపథమునందు సాగుచు నశోకములన్ నిలుపంగజూడమే?
గుణములు పుట్టునేలయని కూర్మిని పేర్మిని నిల్చునంచు, వా
ఙ్మణులు వెలుంగుచుండ జనమాన్యత నిల్చిన చంద్రశేఖర
ప్రణయనదీక్ష శాంతి సుఖరాగములే విలసిల్లుచుండగా
నణువణువందునన్ ప్రగతి హాసముజేయుచునుండె భవ్యమై!
– డా॥ అయాచితం
నటేశ్వరశర్మ
94404 68557