కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యం, దాని వల్ల ఒనగూడే ప్రయోజనాలు, దాని ఉద్దేశాన్ని గుర్తించడంలో తెలంగాణ సమాజం విఫలమైతే.. అది కేవలం ఇంజినీరింగ్‌ను తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు, తన సొంత భవిష్యత్తును అర్థం చేసుకోవడంలో విఫలమైనట్టే. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, అదొక నాగరికతకు చిహ్నం. నాయకత్వం, దూరదృష్టి, ధార్మిక బాధ్యతల నిర్వచనం. కాళేశ్వరం నీళ్లతో 45 లక్షల ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయి. తెలంగాణలోని అనేక జిల్లాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గోదావరి నది నుంచి వందల టీఎంసీల నీటిని ఎత్తిపోసిన కాళేశ్వరం ప్రాజెక్టు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చేసింది. తద్వారా గ్రామాల్లో జీవనోపాధి మెరుగుపడి వ్యవసాయ సంపద పెరిగింది. భారతదేశంలో ఒక దశాబ్దకాలంలో ఈ స్థాయిలో సాగునీటి పరివర్తనను ఏ రాష్ట్రమూ అమలు చేయలేదు.
కాళేశ్వరం ఇంజినీరింగ్ అద్భుతం. ప్రపంచంలోని ముఖ్యమైన ఆనకట్టలు, సాగునీటి ప్రాజెక్టుల్లోనూ చిన్న చిన్న లోపాలు తలెత్తాయి. మన దేశంలోని భాక్రా నంగల్, చైనాలోని త్రీ గోర్జెస్, అమెరికాలోని హూవర్ డ్యామ్ ఇలాంటి లోపాలు, సవాళ్లను ఎదుర్కొన్నవే. చిన్న మరమ్మతుకు గురైనప్పటికీ వరదను, రాష్ట్రం, కేంద్రంలోని అధికార పక్షాలు చల్లే బురదను తట్టుకొని కాళేశ్వరం ఇప్పటికీ స్థిరంగా, దృఢంగా నిలిచి ఉంది. ఎందుకంటే, ఇది ఒక విజన్‌తో నిర్మితమైంది, అహంకారంతో కాదు.
నిస్సారమైన మనస్తత్వం గలవారు నిజమైన విలువను గ్రహించలేరు. కొన్ని పార్టీలు చిన్న చిన్న సమస్యలను సైతం రాజకీయం చేస్తుంటాయి. తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ ఉంటాయి. విజన్ లేని వ్యక్తి వెయ్యి ఏండ్లు అయినా సరే ప్రవహించే నదిని అర్థం చేసుకోలేడు. కాళేశ్వరం ఇంజినీరింగ్ ప్రతిభ, దాని సామాజిక ప్రభావం, ఆర్థిక సామర్థ్యాన్ని నిజంగా అర్థం చేసుకునేవారు ఈ సమాజంలో ఒక శాతం కూడా లేరనే చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు బోర్డు రూముల నుంచి పుట్టలేదు, ప్రజల జీవితాల పట్ల స్పృహతో కూడిన నిబద్ధత నుంచి పుట్టింది. దూరదృష్టితో కూడిన కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకున్నది, కార్యరూపం దాల్చింది. స్వయం సమృద్ధి, కరువు రహిత తెలంగాణను సృష్టించడమే కాళేశ్వరం లక్ష్యం. ప్రజల జీవనాన్ని స్థిరంగా ఉంచే మౌలిక సదుపాయాలను గౌరవించలేని విద్య, రాజకీయాల వల్ల ఉపయోగం ఏమిటి? పౌరులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, యువత ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. కాళేశ్వరం వెనుక ఉన్న అంకెలను, సంఖ్యలను అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల జీవనాడి అయిన కాళేశ్వరాన్ని రాజకీయ క్రీడ నుంచి కాపాడుకోవాలి. కాళేశ్వరం పైకి కనిపించే ఒక పైప్‌లైన్ మాత్రమే కాదు, ఇది తెలంగాణ పునర్జన్మ ధమని. మన మౌనం, అజ్ఞానంతో తెలంగాణ ప్రజల జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ద్రోహం చేయడం సబబు కాదు.