తెలంగాణ తొలి ప్రభుత్వ పాలనాకాలంలో భగీరథ ప్రయత్న ఫలితంగా జలవనరుల వినియోగానికి సంబంధించి ప్రపంచస్థాయిలో ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించాం. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పిడి పర్యవసానంగా ఆ చరిత్రాత్మకమైన పరిణామాలు తలకిందులయ్యాయి. ఈ దుష్పరిణామాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2023 సాధారణ ఎన్నికల సమయంలో బహుళ ప్రజాదరణ పొందిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని గుర్తుతెలియని దుండగులు బాంబులతో పేల్చివేశారు. ఈ విధ్వంసకర ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినా గత రెండేండ్లుగా ఎలాంటి పురోగతి లేదు.
సాగునీటి వనరుల విధ్వంసాలకు సంబంధించి వెలుగులోకి వస్తున్న వరుస సంఘటనలు రాష్ట్రంలోని రైతాంగాన్ని తీవ్రమైన భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, ఓదెల మండలాల పరిధిలో ప్రవహిస్తున్న మానేరు ఉపనదిపై తనుగుల వద్ద నిర్మించిన ‘చెక్ డ్యాం’ను గుర్తుతెలియని దుండగులు ఇటీవల డిటోనేటర్లతో పేల్చివేశారు. ఈ సంఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి, రాష్టంలోని అధికార పార్టీకి చెందిన స్థానిక (పెద్దపెల్లి) శాసనసభ్యుడు చేసిన అసందర్భ ప్రకటనలు రాష్ట్ర ప్రజలను మరీ ముఖ్యంగా రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రమైన భయాందోళనకు గురిచేస్తున్నాయి.
రాష్ట్రంలో గత రెండేండ్లుగా వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తే జలవనరుల విధ్వంసమే ఈ ప్రభుత్వ విధానమా? అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నా యి. ఈ నేపథ్యంలో సాగునీటి రంగనిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులుతో కూడిన 11 మంది సభ్యు ల బృందం ఒక ‘నిజనిర్ధారణ కమిటీ’గా ఏర్పడింది. ఆ బృందం శుక్రవారం నాడు బాంబుపేలుడు సం ఘటనతో ధ్వంసమైన తనుగుల ‘చెక్ డ్యాం’ సందర్శించింది. దీంతోపాటు పరిసర గ్రామాలకు చెందిన రైతులతోనూ, ప్రజలతోనూ మాట్లాడింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తెలంగాణ తొలి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన నీటి వనరుల విధ్వంసం వెనక రాష్ట్రస్థాయిలోనే పకడ్బందీ పథకం ప్రకారమే ఒక భారీ కుట్ర అమలు జరుగుతున్నట్టు అనుమానించాల్సి వస్తున్నది. నిజ నిర్ధారణ కమిటీలో ఒక సభ్యునిగా ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను ప్రజలకు బహిరంగపరచాలనే లక్ష్యంతోనే ఆందోళనకర ఈ సంఘటలపై ‘నిజ నిర్ధారణ కమిటీ’ అభిప్రాయాలను ఈ వ్యాస రూపంలో పొందుపరుస్తున్నాను.
గత నవంబర్ 21న సుమారు రాత్రి 10 గంటల సమయంలో మానేరు నదీగర్భం నుంచి భారీ విస్ఫోటనానికి సంబంధించిన శబ్దం వినిపించినట్టు సమీప గ్రామస్థులు గుర్తించారు. ఉదయం 6 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్న రైతులు తనుగుల చెక్ డ్యాం హఠాత్తుగా ధ్వంసమైన విషయాన్ని గ్రహించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దాదాపు 770 మీటర్ల పొడవున్న ఈ చెక్‌డ్యాంలో ఒక వైపున సుమారు 90 మీటర్ల మేరకు అనేక పగుళ్లతో కాంక్రీటు నిర్మాణం పూర్తిగా ధ్వంసమైంది. చెక్ డ్యాంలో నిల్వ ఉన్న నీరంతా దిగువకు వెళ్లిపోయింది.
భారీ విస్ఫోటనం ధాటికి కాంక్రీటు నిర్మాణానికి సంబంధించిన దిమ్మెలు ఎగువవైపు ఎగిరిపడినట్టు అక్కడ శిథిలాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ విస్ఫోటనం ప్రభావ ఫలితంగా వందలాది చేపలు చనిపోయి సమీపంలోని ఇసుక తిన్నెలపై చెల్లాచెదురుగా పడిఉన్నాయి. నిర్మాణ నాణ్యతకు సంబంధించిన లోపాల కారణంగా చెక్‌డ్యాం కుంగిపోయి ఉంటే, కాంక్రీటు దిమ్మెలు ఎగువ ప్రాంతంలోకి ఎగిరిపడటం, వందల సంఖ్యలో చేపలు చనిపోవడం, సుమారు 8 చోట్ల చెక్‌డ్యాం పేలిపోయినట్టు ఆనవాళ్లు స్పష్టంగా కనిపించవని సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాదు, ఇది పూర్తిగా భారీ పేలుడు ఫలితంగానే కుప్పకూలిపోయినట్టు, ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగానే పకడ్బందీ ప్రణాళిక పథకం ప్రకారం చేసినట్టు అర్థమవుతున్నదని తేల్చిచెప్పారు. సాగునీటి శాఖకు సంబంధించిన అధికారుల ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు ఈ సంఘటనపై నవంబర్ 22న కేసు నమోదుచేశారు. అయినప్పటికీ, తదుపరి చర్య గా కనీస విచారణ జరిపిన దాఖలాలు కనిపించడం లేదు. సంఘటనా స్థలంలో తెల్లవారుజామున పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆధారాలను తదుపరి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపినట్టు చెప్తున్నారు. సంఘటనా స్థలంలో పేలుడులో ఉపయోగించే పలురకాలైన శిథిలాలు, వైర్లు, తదితర ఆధారాలు కూడా లభించినట్టు ఆ ప్రాంతాలకు చెందిన ప్రజలు చెప్తున్నారు.
సరిగ్గా రెండు నెలల కిందట ఈ ప్రాంతానికి సమీపంలోని హుస్సేన్ మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను కూడా ఇదే పద్ధతిలో పేల్చివేసేందుకు దుండగులు (ఇసుక మాఫియా) చేసిన ప్రయత్నాలను స్థానిక ప్రజలు అప్రమత్తమై అడ్డుకున్నట్టు చెప్తున్నారు. హుస్సేన్ మియావాగు చెక్ డ్యాంను పేల్చివేయడానికి దుండగులు ఉపయోగించిన 8 డిటోనేటర్లు, 11 జిలెటిన్ స్టిక్స్, వైర్లు, 6 కంప్రెషర్ యంత్రాలు, తదితర వస్తువులన్నింటినీ దుండగులు ఘటనా స్థలం వద్దనే వదిలివెళ్లారని, వాటిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రజలు చెప్తున్నారు.
ఈ సంఘటనపై సాగునీటి శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నెలరోజుల వ్యవధిలోనే జరిగిన ఈ సంఘటనపై ఇంతవరకూ ఎలాంటి విచారణ జరగలేదు. భారీ విస్ఫోటనానికి సంబంధించిన డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ లాంటి పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున లభ్యమైనప్పటికీ, అక్రమ పేలుడు పదార్థాల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసును నమోదు చేసినప్పటికీ దోషులను గుర్తించడంగాని, శిక్షించడంగాని ఇంతవరకూ జరగలేదు. ఇట్లాంటి సంఘటనే మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు చెక్‌డ్యాం విషయంలోనూ చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్లను పేల్చివేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో కూడా సమీప గ్రామాల ప్రజలకు, రైతులకు భారీ శబ్దాలు వినిపించినట్టు కథనాలు స్థానికంగా బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఈ సంఘటనపై స్థానిక మహదేవపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేండ్లు గడిచినప్పటికీ పోలీసుల విచారణ ఏమైందనే అంశం మిస్టరీగానే మిగిలిపోయింది.
పై సంఘటలకు సంబంధించిన పరిస్థితులను, పర్యవసానాలను, కేసుల విచారణలో జరుగుతున్న పోలీసుల నిర్లిప్తతను చూస్తుంటే ఒక కుట్రపూరిత పథకంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నట్టుగా అనుమానించాల్సి వస్తున్నది. అందువల్ల తమ అక్రమ విధానాలను యథేచ్ఛగా పునరుద్ధరించుకోవడానికి, కొనసాగించుకోవడానికి ప్రభుత్వ పెద్దల సహాయ, సహకారాలతో చెక్‌డ్యాంల రూపం లో అడ్డునిలుస్తున్న నిర్మాణాలను సమూలంగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు. ఆ లక్ష్యం లో భాగంగానే యథేచ్ఛగా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు.
తద్వారా చెక్‌డ్యాంలను పేల్చివేసి, ఇసుక అక్రమ రవాణాను చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదాలు లేకుండా ఇట్లాంటి విధ్వంసకరమైన భారీ విస్ఫోటనాలకు సాహసిస్తారని ఊహించలేం. వరుసగా జరుగుతున్న చెక్‌డ్యాంల పేల్చివేత సంఘటనల నేపథ్యంలో సాధారణ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ల కుంగివేత వెనుక కూడా తనుగుల ‘చెక్‌డ్యాం’ పేల్చివేత తరహా కుట్ర జరిగి ఉంటుందనేది అబద్ధం ఎలా అవుతుంది?
(వ్యాసకర్త: పూర్వపు తెలంగాణ జేఏసీ సమన్వయకర్త, ఫ్రీలాన్స్ జర్నలిస్టు)
-పిట్టల రవీందర్