తెలంగాణ చరిత్రలో కాకతీయ గణపతి దేవుడిది ఒక ప్రత్యేక స్థానం. ఎవరూ సాధించని విశిష్టతలు ఆయన సాధించాడు. సువిశాల కాకతీయ రాజ్యాన్ని స్థాపించడం, తాను స్వయంగా 60 ఏండ్లకుపైగా పాలించటం వంటి రాజకీయ విజయాలు ఆయనకున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది బలమైన పితృస్వామ్య విలువలున్న మధ్యయుగ భూస్వామ్యాన్ని కాదని, కూతురైన రుద్రమదేవిని పాలకురాలిగా ప్రకటించి తన కాలాన్ని, సమకాలీన సమాజాన్ని ధిక్కరించి నిలవటం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని శాసనాలలో గణపతి దేవుడి చరిత్ర విస్తృతంగా ఆవిష్కారం అవుతున్నది. స్వతంత్ర కాకతీయ రాజ్యానికి రుద్రదేవుడు బీజం వేస్తే దానిని మహావృక్షంగా పెంచినవాడు గణపతి దేవుడు.
చరిత్రలో కయ్యం, వియ్యం రెండూ రాజకీయాల్లో భాగమే. మహా జనపదాల నుండి వస్తున్నదే. మహదేవుడిని యుద్ధంలో చంపిన దేవగిరి యాదవ రాజు జైతుగి, బాలుడైన గణపతి దేవుడిని చెరలో పెట్టాడు. అయితే ఈ భవిష్యత్తు చక్రవర్తి బందీఖానా నుంచి బయటపడడం మాత్రం రేచర్ల రుద్రుడి దౌత్యం వల్ల సాధ్యమైంది. జైతుగి తన కూతురైన సోమలదేవిని గణపతిదేవుడికి ఇచ్చి పెళ్లి చేసినట్టు చింతలూరు తామ్ర శాసనం చెపుతుంది. ఇది దౌత్యం ఫలితమే. అయితే యాదవ శాసనాల్లో మాత్రం జైతుగి దయ వల్లనే గణపతికి విడుదల లభించినట్టు ఉంది. రుద్రదేవుడిని, ఆ తర్వాత మహదేవుడిని ఓడించి చంపిన తర్వాత కూడా కాకతీయ రాజ్యాన్ని యాదవులు ఎందుకు స్వాధీనం చేసుకోలేక పోయారు?
తమ వద్ద బందీగా ఉన్న గణపతినే విడుదల చేసి మళ్ళీ రాజుగా ఎందుకు కూర్చోపెట్టాల్సి వచ్చిందనేది ఆలోచించాల్సిన విషయం. ఇందుకు ముఖ్యమైన కారణం, రుద్రదేవుడి కాలం నుంచి కాకతీయులకు విధేయులుగా ఉన్న సామంతులను యాదవులు లొంగదీసుకోలేకపోవడం కావచ్చు. కాకతీయుల బలం వాళ్ళ నాయకులు, సామంతులే. రుద్రదేవుడి మరణం తర్వాత మళ్ళీ విసురునాడు అంటే నేటి మహబూబాబాద్ జిల్లా కురవి ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించిన చివరి ముదిగొండ చాళుక్యరాజైన నాగతి రాజును రేచర్ల రుద్రుడు ఓడించి కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టాడు. రేచర్ల రుద్రుడి పాలంపేట (రామప్ప గుడి) శాసనం దీనికి సాక్ష్యం.
భారత ఉపఖండంలో ఆరు దశాబ్దాలకు పైగా పాలించిన రాజులు ఇద్దరే కనిపిస్తారు. ఒకరు రాష్ట్రకూట అమోఘవర్షుడు, రెండవ వారు కాకతీయ గణపతి దేవుడు. ఇద్దరూ 64 ఏండ్లు పాలించారు. ఈ అరుదైన ఘనత దక్కిన వీరిద్దరూ దక్కను ప్రాంతానికి చెందిన వారే కావటం విశేషం. గణపతి దేవుడి పాలన గురించి చెప్పే తొలి శాసనం క్రీ.శ.1199 నాటిది. ఇది మంత్రకూటం (మంతెన లేక మంథని)లో దొరికింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో తుమ్మచెరువు పక్కన ఉన్న హనుమాన్ గుడిలోని ఒక స్తంభంపై గణపతి దేవుడి నాయకుడైన అల్లుం ప్రోలరాజు జారీ చేసిన శాసనం ఇది. ఇప్పటివరకు దొరికిన శాసనాల్లో చివరిదైన క్రీ.శ.1260 నాటి శాసనం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో దొరికింది. ఈ శాసనంలో స్పష్టంగా ‘దివ్య రాజ్య సంవత్సరములు 62 అగు’ అని రాయడంతో 1260 నాటికి గణపతి దేవుడి 62 ఏండ్ల పాలన పూర్తి అయిందని భావించాలి. గణపతి దేవుడి పాలనా కాలం క్రీ.శ.1262 వరకు అని ఆధారాలు తెలుపుతున్నందున ఈయన కనీసం 64 ఏండ్లు పాలించాడని భావించాలి. అంతే కాదు క్రీ.శ.1262 తర్వాత కూడా ఇంకా కొన్నేండ్లు రుద్రమదేవి పట్టోధృతి (అంటే పాలనకు నియమించబడిన వ్యక్తి, ఇంకా పట్టాభిషేకం జరగలేదని అర్థం -Ruler designate)గా శాసనాల్లో ఉంది. ఇంకా గణపతి దేవుడు బతికే ఉన్నాడు. అంటే ఈయన పాలన ఇప్పటి దాకా రాస్తున్నట్టు కేవలం 64 ఏండ్లా లేక ఇంకా ఎక్కువా పరిశీలించాల్సి ఉంది.
గణపతి దేవుడి కాలంలోనే కాకతీయ రాజ్య విస్తృతి పెరిగింది. యావత్ తెలంగాణనే కాదు సముద్రతీరం, నేటి ఆంధ్ర ప్రాంతం కాకతీయరాజ్యంలో భాగమైంది. యుద్ధాలు రాజ్యాన్ని విస్తృతం చేస్తే, పరిపాలన కొత్త పుంతలు తొక్కి రాజ్యాన్ని సుస్థిరం చేసింది. పాకాల చెరువు శాసనంలో ఆ శాసనాన్ని రాసిన కవి చక్రవర్తి అనే శాసన రచయిత గణపతి దేవుడిని ‘మదించు మహీపతులనెడి గజములకు కేసరి వంటి వాడు’ అని కీర్తించాడు. గణపతి దేవుడికి ఉన్న బిరుదు ‘రాయగజకేసరి’కి అర్థం ఇదే.
కాకతీయ రాజ్య బలం, వాళ్ళ కింద ఉన్న సామంత వంశాలు, మాండలికులు, నాయకులు. వాళ్ళు కాకతీయ రాజ్యానికి దన్నుగా నిలవటానికి కారణం కాకతీయుల పాలనలో పరిమితమైన కేంద్ర అధికారాలతో కూడిన వికేంద్రీకృత పాలనా పద్ధతి. స్వతంత్ర భారత రాజ్యాంగంలో రాసుకున్న ఫెడరల్ స్ఫూర్తి ఇదే. నేటి భారత రాజ్యం కాకతీయుల నుంచి దీనిని నేర్చుకుంటే కేంద్రానికీ, రాష్ర్టాలకూ మధ్య సుహృద్భావ సంబంధాలు ఏర్పడుతాయి. రుద్రదేవుడి నుంచి చివరి రాజైన ప్రతాపరుద్రుడి వరకు ఎన్నో వంశాలు, నాయకులు కాకతీయులకు బలమైన పునాదిగా నిలిచారు. రేచర్ల రెడ్ల వంశం వాళ్ళు వారిలో ముఖ్యంగా రేచర్ల రుద్ర, మల్యాల వంశం నుండి చౌండ, గుండ సేనాని, విరియాల వంశంలో రుద్ర, వెలమ నాయకుడు ప్రసాదిత్య, గోన వంశ పాలకులు- వంటి వాళ్లు లేకుంటే కాకతీయ చరిత్ర ఇలా ఉండేది కాదనడం అసత్యం కాదు.
మహదేవుడి సంతానంలో గణపతి దేవుడితో పాటు ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు సోదరులు ఉన్నారు. మైలాంబ, కుందమాంబలు చెరువు తవ్వించి, గుళ్లు కట్టించి పేరు నిలుపుకొన్నారు. సోదరుల పేర్లు బయ్యారం శాసనంలో భద్ర, రురద అని తెలుస్తుంది కానీ ఇంకేమీ వివరాలు తెలియవు.
డాక్టర్ ఎం.ఎ. శ్రీనివాసన్: 81069 35000