K. Keshava Rao | కేకే వివరించని విషయాలు
రాజకీయాలలో విలువలు నానాటికీ మృగ్యమవుతూ అధికారం కోసం, డబ్బు కోసం ఎవరు ఎటైనా మారటం మరింత పెచ్చరిల్లుతున్న ఈ రోజుల్లో కనీసం కేశవరావు వంటి ప్రతిష్ట, విలువలు గల మేధావులు అయినా తమ పార్టీ మార్పిడికి తగిన కారణాలు చూపగలరని సాధారణ ప్రజలు ఆశిస్తారు. ఆయన బీఆర్ఎస్కు రాజీనామాను, కాంగ్రెస్లో ప్రవేశాన్ని ప్రకటించిన తర్వాత ఒక మీడియా సమావేశంలో, కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడారు.
రాజకీయాలలో విలువలు నానాటికీ మృగ్యమవుతూ అధికారం కోసం, డబ్బు కోసం ఎవరు ఎటైనా మారటం మరింత పెచ్చరిల్లుతున్న ఈ రోజుల్లో కనీసం కేశవరావు వంటి ప్రతిష్ట, విలువలు గల మేధావులు అయినా తమ పార్టీ మార్పిడికి తగిన కారణాలు చూపగలరని సాధారణ ప్రజలు ఆశిస్తారు. ఆయన బీఆర్ఎస్కు రాజీనామాను, కాంగ్రెస్లో ప్రవేశాన్ని ప్రకటించిన తర్వాత ఒక మీడియా సమావేశంలో, కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడారు. కానీ, పార్టీ మారటానికి ఆయన చెప్పిన కారణాలలో సూటిదనం గానీ, నిజాయితీ గానీ కనిపించలేదు. పార్టీ మారటం తన స్వేచ్ఛ. కానీ, అందుకు కారణాలను తన వంటి స్థాయిగల వారి నుంచి దాపరికం లేకుండా తెలుసుకోవాలనుకోవడం ప్రజల హక్కు. ఆ హక్కును ఆయన స్పష్టంగా ఉల్లంఘించారు. ఆ విధంగా ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాస, గౌరవాలను తన వైపు నుంచి తాను మరింత తగ్గించారు.
K. Keshava Rao | రాజకీయవాదులు పార్టీలు మారటం చాలాకాలంగా ఉన్నది. అది ఎంతగా పెరుగుతున్నదో ప్రజలకు తెలంగాణతో పాటు దేశమంతటా కనిపిస్తున్నది. ఒకవేళ ‘సాక్షి’ సంపుటాల రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావు ఇప్పుడు జీవించి ఉంటే తన రాజకీయ వ్యంగ్య వైభవ రచనలకు తగిన సరంజామా లభిస్తున్నదని ఆనందించేవారో లేక ఈ వేగాన్ని అందుకోలేక సొమ్మసిల్లి పోయేవారో చెప్పలేం. నిజానికి ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మామూలుగానైతే రాయవలసిన అవసరమే ఉండేది కాదు. మహా అయితే ఈ ధోరణి గురించి అందరినీ కలిపి ఒకసారి వ్యాఖ్యానించుకుంటే సరిపోయేది. కేశవరావును అందరితో జతగట్టలేం గనుకనే ఈ ప్రస్తుత రచన ఆయనకు జర్నలిస్టుగా, ఇతరత్రాగల అర్హతలను అటుంచి, ఒక విలువలు గల రాజకీయవాదిగా, సోషలిస్టు స్వాప్నికునిగా తనకు గల గుర్తింపు మూలంగా నాకు 1980లలో ఢిల్లీ రోజుల నుంచి తనతో మంచి పరిచయం. అది ఇప్పటివరకు చెక్కుచెదరలేదు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అకస్మాత్తుగా, ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల మధ్య మారినప్పటికీ ఆ గౌరవభావం తగ్గుతున్నదని కాదు. కానీ, అదే సమయంలో తనట్లా మారటానికి చెప్పిన కారణాలలో మాత్రం సూటిదనం, నిజాయితీ, స్పష్టత లోపించాయని మాత్రం అనక తప్పడం లేదు. అన్నీ ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదని, అది తన ప్రైవసీ అని ఇతర రాజకీయవాదుల వలెనే తను కూడా అనదలుచుకుంటే అది ఆయన హక్కు.
ఇప్పుడు కేకే చెప్పిన, లేదా చెప్పలేదని మనకు అనిపిస్తున్న విషయాలలోకి వెళదాం. ఎవరైనా ఈ మాట అంటే, ఆయన తన మేధావి ధోరణిలో ‘చెప్పలేదనిపించటం వాళ్ల పెర్సెప్షన్. చెప్పాననుకోవటం నా పెర్సెప్షన్. వాళ్ల పెర్సెప్షన్ను కూడా నేను గౌరవిస్తాను’ అని అనవచ్చు. ఈ రెండు రోజులలో ఇదే మాట తను మీడియాతో తరచూ అన్నారు కూడా. ఇది ఒక ఎడతెగని మేధో వివాదం కనుక దానిని అట్లుంచి, ఆయన ప్రజలకు వివరించకుండా వదిలివేసిన విషయాలలోకి వెళదాం. వాటి గురించి తెలంగాణ దృక్కోణం నుంచి, ప్రజల దృక్కోణం నుంచి అర్థం చేసుకోవలసిన విషయాలు ఉన్నాయి కనుక ఇదంతా రాసుకోవడం. ఒకవేళ ఈ చర్చ వల్ల ప్రశ్నలు మాత్రమే తలెత్తి, సమాధానాలు లభించనట్లయితే (అందుకే అవకాశాలు ఎక్కువ), ఆ పని చేయవలసిన బాధ్యత తిరిగి కేశవరావుపైనే ఉంటుంది.
కేకేకు ఎదురైన ప్రధానమైన ప్రశ్న.. ఈ దశలో బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నారన్నది. అందుకు ఆయన సమాధానాలు రెండు. కాంగ్రెస్ను వదిలి కొంతకాలం తీర్థయాత్రలు చేశాను. కాంగ్రెస్లో ఉండింది 50 ఏండ్లకు పైగా కాగా, బీఆర్ఎస్లో ఉన్నది పదేండ్లు. ఇప్పుడు ఈ వయసు (84)లో తీర్థయాత్ర ముగించుకుని తిరిగి సొంత ఇంటికి పోవాలనుకున్నాను. ఒకవైపు 50 ఏండ్లు, ఇంకోవైపు పదేండ్లు. ఇందులో 50 ఏండ్లది మొగ్గు అయింది, అనేది ఒక జవాబు. ప్రస్తుతం బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్న మాట నిజం. కానీ కాంగ్రెస్ ఇంకా పెద్ద కష్టాల్లో ఉందనేది రెండవ జవాబు. ఇందుకు సంబంధించి మరొక ప్రశ్న.. బీఆర్ఎస్లో అనేక పదవులు అనుభవించి పోవటమేమిటంటే కాంగ్రెస్లో అంతకన్నా ఎక్కువ అనుభవించానన్నది సమాధానం. మొదటిసారి రాజ్యసభకు కాంగ్రెస్ మద్దతు వల్లనే గెలిచానని, రెండోసారి మాత్రమే బీఆర్ఎస్ బలంతోనని వివరణ.
కేశవరావు కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లోకి వెళ్లడం తెలంగాణ ఉద్యమం అనే బలమైన కారణం వల్ల. దానిని తీర్థయాత్ర అంటున్నారు ఆయన ఇప్పుడు. రెండు పార్టీల మధ్య కాలాన్ని సంవత్సరాలలో కొలుస్తున్నారు. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ఎక్కువ కష్టాలలో ఉందని సమర్థించుకొన జూస్తున్నారు. తెలంగాణ పట్ల ప్రేమతో కాంగ్రెస్ను వదిలిన తర్వాత బీఆర్ఎస్లో కొనసాగింది ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుని. బీఆర్ఎస్ పాలనలో మంచి అభివృద్ధి జరిగినట్లు ఒప్పుకుంటున్నారు కూడా. అటువంటప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన నిర్ణయం, బీఆర్ఎస్తో ప్రయాణం కేవలం తీర్థయాత్ర వంటిది అవుతుందా? ఆ స్థితిలో ఎక్కడ ఉండాలనే నిర్ణయం ఏ పార్టీలో ఎన్నేళ్లు అనే లెక్కలను బట్టి జరుగుతుందా? పోతే కాంగ్రెస్ కష్టాలు ఆ పార్టీ 2014లో ఓడినప్పుడే మొదలై 2019 ఓటమితో తీవ్రమయ్యాయి. ఆ తర్వాత మరొక ఐదేండ్లు గడిచాయి. అయినా తనకు కాంగ్రెస్ మాతృసంస్థ అనుకుంటే ఈ పదేండ్ల కష్టకాలంలో గుర్తుకురాని పార్టీ ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు? తీర్థయాత్ర ఇంతకాలం ఎందుకు ముగించలేదు?
కేకే సమాధానాల వల్ల మనకు ఈ స్పష్టతలేవీ రాలేదు. అదీగాక తాను పదేండ్లుగా ఉన్న బీఆర్ఎస్ కష్టకాలంలో ఉందని అంగీకరిస్తున్నప్పుడు, ఆ పదేండ్ల క్రితం నుంచే కష్టాలలో ఉండిన కాంగ్రెస్ అనే ఒక బయటి పార్టీపై, ఇప్పటికీ కష్టాలలో ఉన్న పార్టీపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చిందనటం అసహజంగా, కృత్రిమంగా, తర్కవిరుద్ధంగా తోచడం లేదా?
ఈ సందర్భంగా మీడియా వారు కేశవరావు కుమార్తె తన జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కాపాడుకోవటం కోసం బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. అందుకు తాను కూడా అదే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడానికి సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. అందుకు ఆయన తడబడుతూ, మీడియాను మెప్పించగల సమాధానం కోసం ఆయన ఆలోచించడానికి సమయం లేకకావచ్చు, తన కుమార్తె నిర్ణయం గురించి తనకు అసలు తెలియనే తెలియదని, ఆమె స్వతంత్రురాలైన ఒక వ్యక్తి అని, తన నిర్ణయం తాను తీసుకుందని ప్రకటించారు. కేకే వివరణలలో సూటిదనం, నిజాయితీ, స్పష్టత లేదని దీనితో మరింతగా తేలిపోయింది. తమ నిర్ణయాలకు రెండు రోజుల ముందు కాంగ్రెస్ నాయకులు కేకే ఇంటికి వెళ్లి ఆయనను, తన కుమార్తెను కలిపి పార్టీలోకి ఆహ్వానించిన వివరాలు అప్పుడే మీడియాలో వెలువడ్డాయి. ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని ఇద్దరూ ఖండించలేదు. ఆహ్వానం గురించి తాను, తన కుమార్తె చర్చించుకోలేదన్నట్లు, ఆమె తనను సంప్రదించి తన అంగీకారం తీసుకోకుండానే, తన నిర్ణయం తాను తీసుకుందన్నట్లు, తర్వాత ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే సమయానికి పార్టీ మార్పిడి నిర్ణయం తీసుకున్నామన్నట్లు ఆయన ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ మనను తప్పుదారి పట్టించజూసే విఫల వివరణలు అవుతాయా, లేక నిజాయితీగల వివరణలా?
తన రాజ్యసభ గడువు ఇంకా రెండేళ్లు ఉందని, బీఆర్ఎస్ నుంచి ఎన్నికైనవాడిని గనుక ఒకవేళ రాజీనామా చేయవలసి వస్తే చేస్తానని కేకే చెప్పారు. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్కు మెజారిటీ ఉంది కనుక తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉన్నందున, ఆ పార్టీ మళ్లీ అవకాశం ఇస్తే తీసుకుంటామన్నారు. ఆయన వంటి మేధావి, తెలంగాణకు కట్టుబడిన వ్యక్తి రాజ్యసభలో కొనసాగితే పార్టీలకు అతీతంగా అందరం సంతోషిస్తాం. అయితే ఆయన విషయాలు స్పష్టంగా చెప్పకపోయినా లెక్కలు మాత్రం స్పష్టంగానే ఉన్నాయి. తన కుమార్తె ప్రస్తుత పదవికి, బహుశా రాజకీయ భవిష్యత్తుకు, ఒకవైపు స్వయంగా ఆయన పార్లమెంటు సభ్యత్వానికి పూర్తి భద్రత ఉండేట్లు లెక్కలన్నీ స్పష్టంగా సరిపోతున్నాయన్నమాట.
వాస్తవానికి మన రాజకీయాలలో, అందులోనూ పరిస్థితులు ఇట్లా అనిశ్చయంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఓడిపోయి కనీసం వచ్చే ఐదేండ్ల వరకు గానీ, ఆ తర్వాత గానీ ఏమయ్యేది ఎవరూ చెప్పలేనప్పుడు ఈ విధంగా లెక్కలు వేసుకోవడం చాలామంది చేసే పనే. కేశవరావు కుమార్తెకు ఆయన వంటి విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. తనవలె తెలంగాణ ఉద్యమ భాగస్వామ్యం ఉన్నట్లయితే నేను వినలేదు. అటువంటి స్థితిలో ఆమె ఒకవేళ తన లెక్కలు తాను వేసుకొని ఉంటే పట్టించుకోవాల్సింది ఏమీ లేదు. తండ్రుల లక్షణాలు పిల్లలకు రావాలని ఏమీ లేదు. కానీ కేశవరావు కూడా లెక్కలేమైనా వేసుకున్నారా? అయితే ఏమిటవి అన్నది ఆయన చెప్పిన మాటలను బట్టి మనకు స్పష్టత రావటం లేదు. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే (పాపం శమించు గాక) ఆయన తన తీర్థయాత్ర చివరన మూటగట్టుకుంటున్న పాపపుణ్యాలు ఏమిటో తననే ఆలోచించుకోనివ్వాలి. అట్లాగే క్రమక్రమంగా తిరుగులేని విధంగా క్షీణించిపోతున్న కాంగ్రెస్ పార్టీని కేశవరావు తన చేరికతో ఏమాత్రం సముద్ధరించగలిగినా అది సంతోషించవలసిన విషయమే అవుతుంది. దేశానికి నిజంగానే ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అవసరం. కాంగ్రెస్కు అటువంటి ఆరోగ్యం లేదన్నది వేరే విషయం.
కేశవరావు అసంపూర్తి వివరణల వల్ల తలెత్తుతున్న అయోమయం మరొకటి ఉంది. కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని ఆయన అనేక మాటలలో పొగిడారు. తెలంగాణను మాత్రమే గాక, ఇతర రాష్ర్టాలను చూసినా అది మరెవరు చేయని పని అన్నారు. ఇందుకు ఎటువంటి షరతులు విధించలేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఓడటం పట్ల ఆశ్చర్యం ప్రకటిస్తూ, అందుకు కారణాలు ఏమిటో శోధించడం అవసరమన్నారు.
ఒక మేధావికి, అనుభవజ్ఞునికి, సోషలిస్టు భావజాలం ఉన్న వ్యక్తికి, తెలంగాణ వలె పీడనకు గురైన ప్రాంతపు అభివృద్ధికి కట్టుబడిన నాయకునికి ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు చేయవలసింది ఏమిటి? జరిగిన అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు, ఇంత చేసినా అనూహ్యంగా ఎదురైన ఓటమికి కారణాలను వెతికేందుకు, ఈ అభివృద్ధిని సాధించిన పార్టీకి, నాయకత్వానికి ఈ కష్టకాలంలో చేదోడువాదోడుగా నిలిచేందుకు మరింత పట్టుదలతో పూనుకోవాలి. అటువంటి వారి అవసరం తెలంగాణకు ఎంతైనా ఉంది. ప్రజలు గానీ, చరిత్ర గానీ గుర్తించి, కీర్తించేది అటువంటివారినే. కేశవరావుకు ఈ విషయాలు మనకన్నా అనేక రెట్లు ఎక్కువ తెలుసు.
చర్చిస్తూ పోవాలంటే విషయాలు ఇంకా ఉన్నాయి. కానీ అక్కరలేదు. తాను వివరణలు దేని గురించి ఏమిచ్చినా, అందులో స్పష్టత, అంతకన్నా ముఖ్యంగా నిజాయితీ లోపించటం వల్ల కేకే ఈరోజున అనూహ్యమైన విధంగా, ఇంకా చెప్పాలంటే విచారకరమైన విధంగా తెలంగాణ ప్రజల దృష్టిలో అనుమానితునిగా నిలబడ్డారు. కేసీఆర్ను, ఆయన పాలనను, సాధించిన అభివృద్ధిని ఎటువంటి సంకోచాలు లేకుండా బాగానే ప్రశంసించారు. అందులో చాకచక్యమైన దౌత్యనీతి ఏదో ఉన్నట్లు ఏమీ అనిపించటం లేదు. కానీ తన నిర్ణయమే అర్థం కాకుండా మిగిలిపోతున్నది. కేశవరావుకు ఇష్టమైన సబ్జెక్టులలో ఫిలాసఫీ ఒకటి. అందులో మిస్టిసిజం తగినంత ఉంటుంది. అది ఇందులోనూ ఏమైనా ఉంటే ఆ చిక్కులను ప్రజల కోసం ఆయనే విడదీయాలి.
– టంకశాల అశోక్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

