తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి ఏపీలో ప్రపంచ దేశాల సదస్సు జరిగింది. కాప్ 11 పేరిట నిర్వహించిన బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్‌ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దాదాపు 190 దేశాల నుంచి పర్యావరణవేత్తలు, ప్రభుత్వాధినేతలు, విదేశీ రాయబారులు, శాస్త్రవేత్తలు మేధావులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 2012, అక్టోబర్ 1 నుంచి 19 వరకు ఈ సదస్సు జరిగింది. విదేశీ ప్రతినిధులను ఆకట్టుకునేందుకు రూ.350 కోట్లు వెచ్చించి హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అంతేకాదు, ‘ప్రతి జీవప్రాణిని కాపాడుకునే బాధ్యత మనది’, ‘వృక్షాలను పెంచండి’, ‘చెట్లను నరకొద్దు-జీవ హాని తలపెట్టవద్దు’, ‘ఇంకుడు గుంతలు తవ్వించి జీవధారను సొంతం చేసుకుందాం’ వంటి నినాదాలతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
సీన్ కట్ చేస్తే… 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తదనంతరం తొమ్మిదిన్నరేండ్ల పాటు కేసీఆర్ పాలన. 2023, డిసెంబర్ 7 నుంచి కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టింది. 16 నెలల కాంగ్రెస్ పాలనలో మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల ఇండ్లను కూల్చడాలు, హైడ్రా పేరుతో రాత్రికి రాత్రి కట్టడాలను నేలమట్టం చేయడాలు, ఇప్పుడు తాజాగా పచ్చని చెట్లను, జీవ వైవిధ్యతకు ఆలవాలంగా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను చెరపట్టడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది. హైడ్రా బాధితులకు నోరుండటం వల్ల రోడ్డెక్కి తమ ఆవేదనను వెళ్లగక్కారు, పాలకుల పాపాలను కడిగేశారు. కానీ, హెచ్‌సీయూలోని 400 ఎకరాల్లో ప్రాణ వాయువును అందిస్తున్న చెట్లకు నోరు లేదు. కిలకిల రావాలను తీసే పక్షులకు మాటలు రావు. జింకలు, తాబేళ్లు, ముళ్ల పంది, అడవి పందులకు తమ కష్టాన్ని చెప్పుకొనే అవకాశం లేదు. అందుకే.. మీకు మేమున్నామంటూ మూగ జీవాలకు రక్షణగా జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు హెచ్‌సీయూ విద్యార్థి లోకం రోడ్డెక్కి ఉద్యమబాట పట్టింది. స్వరాష్ట్ర సాధనలో చెలరేగిన ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు ఆరు సూత్రాల పథకంలో భాగంగా 2300 ఎకరాల్లో హెచ్‌సీయూను నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏర్పాటుచేశారు. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అందులో కొన్ని భూములను అభివృద్ధి పేరుతో చెరపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుండటం ఇందిరా గాంధీ ఆశయాన్ని నీరుగారుస్తుండటమే. కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌ను పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలి. వందల కోట్లు పెట్టినా సృష్టించలేని జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తే, తిరిగి సృష్టించడం మనిషితో సాధ్యమా? కాదనే విషయాన్ని 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్ తేటతెల్లం చేసింది. అందుబాటులో ఉన్న వనరులను కాపాడుకోవాలని సభ్య సమాజానికి కాప్ 11 సదస్సు చక్కని సందేశాన్నిచ్చింది. అంతర్జాతీయ స్థాయి బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్‌కు వేదికగా నిలిచిన హైదరాబాద్‌లో ఆ ఉద్దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొల్లగొడుతుండటం విడ్డూరం. జీవ వైవిధ్యత గొప్పతనం తెలియాలంటే గచ్చిబౌలిలో నిర్మించిన బయో డైవర్సిటీ పార్క్‌ను చూసైనా నేటి పాలకులు స్ఫూర్తిని పొందవచ్చు.
అటవీ, జంతుజాలం రక్షణకు బ్రిటిష్ కాలం నుంచే భారత్‌లో అనేక చట్టాలు అమలవుతున్నాయి. అందులో స్వాతంత్య్రానంతరం 1972లో తీసుకువచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం చాలా గొప్పది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 (ఏ) ప్రకారం… ఈ చట్టంలో మొత్తం 6 షెడ్యూళ్లను పొందుపర్చి వృక్ష సంపద, జంతుజాలం రక్షణకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ అనేక చర్యలు చేపట్టారు. మాట మాటకు ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకొనే కాంగ్రెస్ పాలకులు ప్రస్తుతం తెలంగాణలో జీవ జాలానికి ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడుతూ ఇందిరాగాంధీ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. తెలంగాణ ప్రాంతం సురక్షితమైన పరిధిలోనే ఉన్నప్పటికీ మున్ముందు ఎదురయ్యే సవాళ్లు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. ఏడాదిన్నర కిందట నాందేడ్ కేంద్రంగా వెలుగు చూసిన భూకంపం ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని కాసింత వణికించింది. దేశంలో ఎంతో సురక్షితమైన తెలంగాణ ప్రాంతాన్ని రక్షించుకోవాలంటే ప్రకృతిని, సహజ వనరులను కాపాడుకోవడం ఎంతో అవసరం. భవిష్యత్తు తరాల బాగు కోసం పాలకులు ఆలోచనలు చేయాలి. తమ స్వార్థం కోసం వందల ఏండ్ల నాటి అటవీ సంపదను కొల్లగొట్టడం అమానవీయం.
హెచ్‌సీయూలో జరిగిన ఉద్యమం నాటి చిప్కో ఉద్యమాన్ని గుర్తుచేసింది. చిప్కో ఉద్యమంలో చెట్లను కాపాడుకునేందుకు సామాన్యులే సమిధలై నాడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. నేడు జీవ వైవిధ్యత కోసం అరుదైన జంతుజాలం, వృక్ష జాతులను కాపాడుకునేందుకు హెచ్‌సీయూ విద్యార్థులు భూముల రక్షణకై పోరుబాట పట్టారు. 734కి పైగా పూల మొక్కలు, పది రకాల క్షీరదాలు, 15 రకాల సరిసృపాలు, 220 జాతుల పక్షులకు కేంద్రంగా ఉన్న హెచ్‌సీయూ క్షేత్రం విభిన్న వృక్ష, జంతుజాలానికి పెట్టింది పేరు. చరిత్ర మూలాలకు వెళ్తే ఆది మానవ ఆనవాళ్లు సైతం ఇక్కడున్నాయి. హెచ్‌సీయూ క్యాంపస్‌లో మెగాలిథిక్ సైట్ కూడా ఉన్నది. మచ్చల జింకలు, కుందేళ్లు, నెమళ్లు, ముళ్ల పందులు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు అనేకం జీవం కొనసాగిస్తున్న అద్భుతమైన ప్రాంతం హెచ్‌సీయూ. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్‌లో 801, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో 850, ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో 17, స్కోపస్ పబ్లికేషన్ 2023లో 1097 ర్యాంకింగ్‌తో పరిశోధనల పరంగా హెచ్‌సీయూ ఉన్నత స్థాయిలో నిలిచింది. విద్యాభివృద్ధి, పరిశోధన అంశాల్లో ఇప్పటివరకు 79 ఒప్పందాలను కుదుర్చుకున్నది. 183 ప్రాజెక్టులు రూపకల్పన జరుగుతున్నది. 46 పరిశోధనలకు పేటెంట్ హక్కులు ప్రసాదించబడ్డాయి. దేశంలో ఎంతో ప్రముఖ విద్యాసంస్థగా పేరొందిన హెచ్‌సీయూతో తెలంగాణ రాష్ర్టానికి కీర్తి, ప్రతిష్టలు దక్కుతున్నాయి. అలాంటి విద్యాక్షేత్రాన్ని నేడు రణరంగంగా మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది.