రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న రెండో ఉప ఎన్నిక ఇది. జూబ్లీహిల్స్ కన్నా ముందు 2024, మే నెలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది. అయితే ప్రభుత్వ ధీమాలో రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం కనబడుతున్నది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి అప్పటికి ఆరు నెలలే అయినందున మొదటి ఉప ఎన్నికలో గెలిచేందుకు ఆ పార్టీ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆరు హామీలపై అప్పటికి జనంలో నమ్మకం సడలనందున ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కానీ, సుమారు రెండేండ్ల తర్వాత వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ ప్రభుత్వానికి అన్నివైపుల నుంచి ఒత్తిడి తప్పడం లేదు.
రాష్ట్ర ప్రజలకు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల విఫల బాణాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. ఓటర్లను ఒప్పించలేక మిగతా మంత్రులు కూడా అవ్వ ఏడిస్తే బిడ్డ ఏడ్చినట్టు ఆ నియోజకవర్గం వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఫలితం అనుభవించేది ముఖ్యమంత్రియే అన్నట్టుగా ఎన్నిక ప్రచారాన్ని వారు సీరియస్‌గా తీసుకున్నట్టుగా లేరు. నడమ కాంగ్రెస్‌లోకి వచ్చి మా అవకాశాలను దెబ్బ తీశావ్ అన్న బాధ వారి మనస్సుల్లో ఉన్నట్టు కనపడుతున్నది! మంత్రుల సహకారం కొరవడి రేవంత్ ఒంటరి యుద్ధం చేస్తున్నారు. మంత్రుల మధ్య అంతర్గత వివాదాల వల్ల కూడా వారిలో సఖ్యత కొరవడి సమష్టి ప్రయత్నం లేకుండాపోయింది. వార్తల్లోనూ రేవంత్ రెడ్డి ప్రచార సందడి తప్ప మిగతా బాధ్యుల ఊసే కనబడటం లేదు.
ఉప ఎన్నిక పట్ల మెతక వైఖరి పనికిరాదని ప్రతి ఎమ్మెల్యే, మంత్రికి రేవంత్ చెప్పుకోవలసివస్తున్నది. మీ సొంత ఎన్నికలా కృషి చేయమని తన నివాసంలో వారికి విందు ఏర్పాటుచేసి మరీ కోరవలసిన అగత్యం ఆయనకు వచ్చింది. అయితే, ఇదే సమయంలో పలు అంశాలపై రాష్ట్రంలోని పలువర్గాలు ఆందోళనలు చేపట్టడం వల్ల ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాల జోరు మరింత పెరిగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేయడం లేదని, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని బీసీ సంఘాలు ఉద్యమబాటను ఉధృతం చేస్తున్నాయి. వారిని శాంతపరిచేందుకు బీసీకి ఉప ముఖ్యమంత్రి అనే కొంగ్రొత్త ఆశను వారిలో కల్పించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.
ఒక బీసీని డిప్యూటీ చేస్తే రిజర్వేషన్ల డిమాండ్ చల్లబడే అవకాశమే లేదు. బీసీని సీఎం చేసినా రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రం అంగీకారం అవసరం. ముస్లింలను బీసీ జాబితాలోంచి తొలగిస్తే రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తాను కేంద్రాన్ని ఒప్పిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగంగా అన్నారు. ఆ రోజు ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అన్న కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసిందని బీసీలకు అర్థమైంది. అప్పుడు ఆశ పెట్టి ఇప్పుడు నిరాశపరిచిన కాంగ్రెస్ బీసీ సానుభూతిని కోల్పోయింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో బీసీ సంఘాలు చేపడుతున్న ఆందోళనల సెగ తప్పకుండా ఈ ఉప ఎన్నికపై పడుతుంది.
వృత్తి, డిగ్రీ కళాశాలల విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం యాజమాన్యాలు విద్యాసంస్థలను మూసివేశాయి. విద్యార్థులు రోడ్లపైకి రావడంతో వారి తల్లిదండ్రులు ప్రభుత్వంపై కినుక వహించడం సహజమే. కాలేజీల లక్ష మంది సిబ్బందితో ఎల్బీ స్టేడియంలో 8వ తేదీన తలపెట్టిన అధ్యాపకుల సాంత్వన సభకు ముందు అనుమతిని ఇచ్చిన పోలీసులు రద్దు చేశారు. ఎల్బీ స్టేడియం అసెంబ్లీకి దగ్గరగా ఉన్నదని రద్దుచేసిన పోలీసులు సభను అదే రోజు మరో మైదానంలో జరుపుకోవడానికి కూడా ఒప్పుకోలేదు.
ఉప ఎన్నిక రోజైన 11న 11 లక్షల మంది విద్యార్థులతో తలపెట్టిన లాంగ్‌మార్చ్ కూడా ఫాతీ వాయిదా వేసుకోక తప్పలేదు. వీరి సెగను చల్లబరచడానికి ముఖ్యమంత్రి కాలేజీల సమ్మె మొదలైన రెండో రోజున ఫీజు సిఫారసుల కమిటీని ప్రకటించారు. మూడు నెలల్లో ఆ కమిటీ నివేదికను ఇవ్వాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది.
7వ తేదీన జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన తనను ఖాతరు చేయని ఫాతిపై ఆక్రోశం వెళ్లగక్కారు. తమ ప్రభుత్వం కాలేజీలకు బాకీ పడింది రూ.3600 కోట్లు మాత్రమే, మిగతాది గత ప్రభుత్వం నాటిది. ఆ సొమ్మును పాత ప్రభుత్వం దగ్గరే వసూలు చేసుకోండన్నారు. కాంగ్రెస్ కొత్త హామీలు ప్రకటించినప్పుడే గత ప్రభుత్వ బకాయిలతో మాకు సంబంధం ఉండదని చెప్తే బాగుండేది. కాలేజీ యాజమాన్యాలతో చర్చలు కొనసాగుతుండగా సమ్మెను విమర్శించడంలో అర్థం లేదు.
ముఖ్యమంత్రి డబ్బులే లేవంటున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి రూ.900 కోట్లు త్వరలో విడుదల చేస్తామని కాలేజీ సమ్మెను విరమింపజేశారు. ఎన్నికల కోసం చెప్పిన ఈ మాటపై ప్రభుత్వం నిలబడుతుందన్న ఆశ లేదు. పెండింగ్ బిల్లుల కోసం వేచి చూస్తున్న కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు, రిటైర్డ్ ఉద్యోగులు విసిగి వేసారి న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. రూ.3,366 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఉత్పత్తిని ఆపివేస్తామని లిక్కర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి.
ప్రచార సభల్లో రేవంత్ తన పాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను చెప్పకుండా విపక్ష బీఆర్ఎస్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి నోట ఒక కుటుంబ వ్యవహారాలపై గౌరవం లేని మాటలు రావడం ప్రజలు హర్షించే విషయం కాదు. అలాంటి దిగజారుడు మాటల వల్ల సీఎం హుందాతనం తగ్గుతుంది తప్ప ఓట్లు రాలవు. ఈ అగమ్య స్థితిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాడిని దించేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు తెలిపిన ఆయన ‘జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ఓడిపోతే నాకు సంబంధం లేదు’ అని ఒక సభలో అన్నట్టు పత్రికలో వచ్చింది. సోషల్ మీడియాలో కూడా రేవంత్ పాలన, ఆయన ప్రచారశైలిపై విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక సందర్భంగా పలు రూపాల్లో ప్రజల అసహనం వ్యక్తమవుతున్నది. రెండేండ్ల కాంగ్రెస్ హుకుమత్ ఎలా ఉందో తేల్చే బాధ్యత మాత్రం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఓటర్లపై ఉన్నది.
– బద్రి నర్సన్