సమస్యను మూలాల్నించి అర్థం చేసుకోవటం, సమస్యను శాశ్వతంగా పరిష్కరించటం ముఖ్యమంత్రి కేసీఆర్ ైస్టెల్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ఆయన చేసిన ప్రకటన మరోమారు దీనిని రుజువుచేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 80,039 ఉద్యోగాల్లో నియామకం కోసం వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని, 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగ యువతీ యువకులను సంతోషంలో ముంచెత్తింది. ఇది చాలా గొప్ప నిర్ణయం. దీనికన్నా కీలకమైన విషయం.. ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలో అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకే 95 శాతం అవకాశాలు లభించేలా రాజ్యాంగబద్ధ ఏర్పాటును సాధించుకోవటం. దీనికోసం తాను స్వయంగా ఢిల్లీలో రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసిందీ, ఇది తెలంగాణ యువతరం భవిష్యత్తుకు ఎంత కీలకమైనదీ ముఖ్యమంత్రి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నియామకాల విషయంలో దశాబ్దాల పాటు ఎదుర్కొన్న వివక్షను శాశ్వతంగా రూపుమాపే మహత్తర విజయమిది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. వాస్తవానికి ఇది కొత్తగా, ఇప్పుడే ప్రారంభమైంది కూడా కాదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచీ ఖాళీల భర్తీ.. క్రమం తప్పకుండా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటివరకూ 1,56,254 ఖాళీలను గుర్తించగా వీటిలో 1,33,942 నియామకాలు పూర్తయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఉద్యోగ నియామకాల
విషయంలో తెలంగాణ దరిదాపుల్లో లేదు. ఆరేండ్ల వ్యవధిలో కల్పించిన సర్కారీ కొలువులను పరిశీలిస్తే.. తెలంగాణ తర్వాత రెండోస్థానంలో ఉన్న హర్యానాలో 85 వేల పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 55,863 ఉద్యోగాలతో మూడో స్థానంలో తమిళనాడు, 40,009 ఉద్యోగాలతో నాలుగో స్థానంలో కర్ణాటక ఉన్నాయి. కేం ద్రం సహాయ నిరాకరణ, ఏపీతో అనేక న్యాయపరమైన
చిక్కులు, ప్రతిపక్షపార్టీల కోర్టు కేసులు, అన్నింటికీ మించి కొత్తరాష్ట్రం.. ఇన్ని సమస్యల మధ్య తెలంగాణ సాధించిన విజయమిది.
భూమిపుత్రుడే పాలకుడైతే ఎంత ప్రేమతో, ఎంత పదిలంగా తన మాతృభూమిని అభివృద్ధి చేసుకుంటాడో కేసీఆర్ పాలన తెలుపుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలలో తరతరాలుగా దోపిడీకి గురై, తన ప్రారబ్ధానికి తానే కారణమనే ఆత్మన్యూనతలో ఉండేది నాటి తెలంగాణ. ఇక్కడి పొలాలకు సాగునీళ్లు ఎందుకు రావు అని ఎవరైనా అడిగితే.. ఎత్తున ఉన్నాం కదా! ఎలా వస్తాయి! అని మనమే చెప్పుకొనేంత భావదారిద్య్రం. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఎందుకు రావు అని అడిగితే.. మనవాళ్లకు చొరవ తక్కువ కదా అని అనుకునేంత అమాయకత్వం. పరాయి పాలకులు తమ దోపిడీని స్థిరపర్చుకోవటానికి పాలితుల మనసులను కూడా ఎలా పాలిస్తారు అనేదానికి ఇదొక సజీవ ఉదాహరణ. అటువంటి తెలంగాణ నేడు కాలరెగరేస్తున్నది. మన పొలాలకు నీళ్లు
పరవళ్లు తొక్కుతున్నాయి. మన నిధులు మన ఊళ్లకు, మన పట్టణాలకు ప్రవహిస్తున్నాయి. మన ఉద్యోగాలు మన బిడ్డలకే లభిస్తున్నాయి. తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకోసమే కదా!