కలవరపాటుకు గురవుతున్న తెలంగాణ గుండెను జగిత్యాల జనప్రభంజన వేదిక దిటవుపర్చింది. లక్షలాదిగా గుమిగూడిన జనసందోహానికి, టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది కుటుంబాలకు మహానేత ప్రసంగం మండేఎండల్లో మలయమారుతంలా తాకింది. కాంగ్రెస్ పాలనలో మోసపోయి గోసపడుతున్న జన హృదయానికి ఊరటనిచ్చింది. కేసీఆర్ ప్రసంగం రణన్నినాదమై బీఆర్ఎస్ శ్రేణులను సమరానికి సర్వసన్నద్ధం చేసింది. దుష్కర ముష్కర పాలనపై దుందుభి మోగించింది.
రెండున్నరేండ్ల కర్కశ పాలనలో ఆగమాగమైన తెలంగాణకు ‘నేనున్నాను’ అని ధైర్యమిచ్చింది కేసీఆర్ ప్రసంగం. తెలంగాణ అస్తిత్వ పోరాటానికి మరోసారి పొలికేకగా మారింది. గెలిచి నిలిచిన తెలంగాణను అడ్డగోలు హామీలతో ఆగమాగం చేసిన పాలకులపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రజల గోసను ప్రళయఘోషగా ప్రతిధ్వనించారు కేసీఆర్. మూటలు మోసే కమీషన్ల పాలనను ఎండగట్టారు. పేద ప్రజలకు ఉపశమనాన్ని సమకూర్చే సంక్షేమ ఫలాలను దూరం చేసిన దుర్మార్గాన్ని ఆవేదనతో తూర్పారబట్టారు.
రాష్ట్ర సాధకుడు, ఆపై ప్రగతి రథసారథి అయిన కేసీఆర్ జగిత్యాలలో జనాక్షౌహిణుల సాక్షిగా మరో యుద్ధం మొదలవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న కడగండ్లను తలచుకుని ఆయన చలించారు. ప్రజలు తన నుంచి కోరుకుంటున్న భరోసాను సూటిగా, గుండెలను తాకేలా అందించారు. ‘సావును కోరే కావురం’ వ్యాఖ్యలను ఎండగట్టారు. చివరిశ్వాస వరకు తెలంగాణ కోసమే సేవచేస్తా నని పునరుద్ఘాటించారు. చేతగాని, చేవలేని పాలనలో తెర్లు అయిపోతున్న తెలంగాణను మళ్లీ సమున్నతంగా నిలబెట్టి తీరుతానని ప్రతిజ్ఞ పూనారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల ఉజ్వల పాలనలో వెలుగులీనిన రాష్ట్రంలో ప్రస్తుతం చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి.
జలకళతో తెలంగాణను పచ్చలహారంగా మలచిన ప్రాజెక్టులను పండబెట్టి సాగును ఎండబెడుతున్నారు.ఒకటా రెండా ఘాతుకాలు! భూముల దోపిడీతో పాలకులు ప్రజలకు నిత్యనరకం చూపిస్తున్నారు..పోలీసు దాడులతో కునుకు లేకుండా చేస్తున్నారు. సాగు సమస్యలు రైతన్నలకు మంటపెడుతున్నాయి. సర్కారీ నిర్లక్ష్యం ఉరితాళ్లు పేనుతున్నది. అవ్వలు, తాతలు మొదలుకుని అప్పుడే పుట్టిన పసిగుడ్డు దాకా తాను అందించిన సంక్షేమ ఫలాలు కనుమరుగై పోవడం గురించి కలత చెందారు కేసీఆర్. అందుకే దుర్మార్గ పాలన ఇంకానా, ఇకపై సాగదని గర్జించారు. ఆ గర్జన ప్రత్యర్థుల గుండెల్లో మరఫిరంగిలా పేలింది. లూటీల సర్కార్ పోటీ సభలతో ఎగిరెగిరి పడితేనేం..జగిత్యాల జనసూర్యుని కిరణాల ధాటిని అరచేయి అడ్డుపెట్టి ఆపాలని ఎంతగా ప్రయాసపడితేనేం.. కేసీఆర్ జైత్రయాత్రను ఆపలేక చతికిలబడింది.
ఒక్కో సభతో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఒడుపు కేసీఆర్ సొంతం. మలిదశ ఉద్యమంలో కరీంనగర్ సభ, వరంగల్ సభ.. నల్లగొండ సభ ఒక్కో మెట్టులా నిలిచిన సంగతి తెలిసిందే. గత ఏడాది వరంగల్ జిల్లా, ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. తాజాగా జరిగిన జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ మాత్రం కాంగ్రెస్ అంతానికి పంతం పూని, మరో యుద్ధానికి తొడగొట్టిన సభగా చరిత్రలో నిలిచిపోతుంది. కేసీఆర్ సభల పరంపరలో ప్రత్యేకమైన సభగా జగిత్యాల సభ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘రెండేండ్లలో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, చెరువుల పేరిట పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న హైడ్రాను తీసేసి, చెరువులోనే కలిపేస్తామనే’ సంకల్పం ఇటు ప్రజలు, పార్టీ శ్రేణులకు నిండైన, మెండైన కర్తవ్య బోధ నెరిపింది. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్, గుండెచప్పుడు కేసీఆర్ అని మరోసారి చాటిచెప్పిన సభ అది. ప్రజాభిమానంలో కేసీఆర్ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని ఢంకా బజాయించిన సభగా గుర్తుండిపోతుంది. ఈ సభ అక్రమ పాలకులకు ఒక హెచ్చరిక. మరో ప్రజోద్యమానికి నాందీగీతం.