రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మరొక నాలుగు రోజుల్లో ఏడాది కాలం పూర్తవుతుంది. అందువల్ల, ఈ కాలంలో జరిగిన పరిపాలనా తీరును సమీక్షించేందుకు ఇది తగిన సమయం. ఇప్పటికే కొన్ని మాసాలుగా పలు వ్యాఖ్యానాలు, పొగడ్తలు, విమర్శలు వస్తుండటం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి. అవి వారే స్వయంగా పెట్టుకున్న వంద రోజుల గడువు నాటికి అమలుకావటం లేదా కాకపోవటంపై చర్చ చాలా జరిగింది. ఆ చర్చ రోజులు గడిచే కొద్దీ తీవ్రమవుతూ ఇప్పటికీ సాగుతున్నది.
Congress Govt | ప్రభుత్వ పక్షం వారు, వంద రోజులంటే వందేనా, ఒక ఏడాది అయినా ఆగలేరా అంటూ వచ్చారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు దీనిపై ఏ మన్నాయన్నది అట్లుంచి ప్రజల దృష్టి నుంచి గమని స్తే, వారిలో విమర్శించినవారితో పాటు, అవును ఒక ఏడాది పాటు చూద్దామన్న వారూ కన్పించారు. ప్రజలెప్పుడూ ఉదార స్వభావులే. మొత్తానికి ఇప్పుడు ఆ ఏడాది కాలం కూడా పూర్తవుతున్నందున పరిశీలన అవసరం.
మొదట గుర్తించవలసిన విషయం ఒకటున్నది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమంతా ఆరు గ్యారెంటీల చుట్టు తిరిగింది. అటువంటి గ్యారెంటీలే కర్ణాటక విజయానికి కారణమయ్యాయనే నమ్మకంతో తెలంగాణలోనూ అదే ప్రకటన చేయటం, వాటిని మామూలు పద్ధతిలో కర పత్రాలుగా కాక బాండ్ పేపర్లపై ముద్రించి మరీ రాష్ట్రమంతా ఇంటింటికి తిరిగి ఇవ్వటం, వేర్వేరు సామాజిక వర్గాలకు, వృత్తుల వారికి విడిగా డిక్లరేషన్లు తయారుచేసి, వివిధ పట్టణాలలో ప్రత్యేకంగా విడుదల చేయటం, వాటి విడుదల సభలలో కాంగ్రెస్ అధినాయకులు సోనియా గాంధీ, రాహు ల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొనటం, హామీల అమలుకు బాధ్యత తమదని ప్రకటిస్తూ, ఒకవేళ ఫిర్యాదులు ఏమైనా ప్రజలకు ఉంటే తమ దృష్టికి తేవాలనటం, చిన్న పిల్లవాడు ఫిర్యాదు చేసినా తను వెంటనే హైదరాబాద్ రాగలనని రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా భరోసానివ్వటం, ఇవే అంశాలతో పత్రికలలో పూర్తి పేజీ అడ్వర్టయిజ్మెంట్లు వరుసగా వస్తుండటం వంటివన్నీ కలిసి ఆ రోజుల్లో, ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక భిన్నమైన వాతావరణాన్ని సృష్టించాయి.
అది కాంగ్రెస్ పార్టీ స్వయంగా సృష్టించిన వాతావరణం. దాని ఉధృతికి తక్కినవన్నీ చాలావరకు కొట్టుకుపోయాయి. దీనంతటి ఫలితమే కాంగ్రెస్‌కు లభించిన అనూహ్య విజయం. అందువల్ల, పరిపాలనకు సంబంధించిన చర్చ యావత్తూ వంద రోజుల గడువు పూర్తయిన వెంటనే గాని, ఇప్పుడు ఏడాది సమయం ముగుస్తుండగా గాని, గ్యారెంటీల అమలు చుట్టు మాత్రమే కేంద్రీకృతం కావటం సహజం. ఇదే కాలంలో, ఆరు గ్యారెంటీలలో భాగంగా గల పదమూడు అంశాలతో పాటు, డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సోనియాగాంధీ జన్మదినమైన 9వ తేదీన, రైతులందరికీ ఒకే విడతలో, రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయగలమని, చేసి తీరగలమని, చేసి చూపించగలమని ఇచ్చిన మాట పద్నాలుగవ గ్యారెంటీగా మారింది. ప్రజల దృష్టిలో తక్కిన పరిపాలనాంశాలన్నీ వీటిచుట్టే తిరగటానికి ఈ కారణాలు కూడా సహజంగానే దోహదం చేశాయి.
చివరగా మరొక కారణం ఉన్నది. ఒకసారి ఈ గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని మొత్తం అంశాలను ఒకవైపు, ప్రజల జీవితాలకు సంబంధించిన స్థితిగతులను మరొకవైపు పోల్చిచూసినపుడు, ఆయా అంశాల అమలుపై వారి ఆశలు ఒకేసారి ఆకాశం ఎత్తుకు లేవటం కూడా సహజమనిస్తుంది.
మనది వర్ధమాన సమాజం. సుదీర్ఘమైన ఫ్యూడ ల్ వ్యవస్థల నుంచి, దశాబ్దాల అంతర్గత వలస పాలన నుంచి బయటపడినప్పుడు ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి నూటొక్క సమస్యలుంటాయి. అటువంటి స్థితిలో, ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వాలు చేయనన్ని చేసిందని చెప్పుకుంటూనే, కుప్పతెప్పలుగా వచ్చిపడిన గ్యారెంటీలతో మరింత ఆకర్షితులు కావటం సహజమైనరీతిలో జరిగింది.
ఈ రకరకాల పరిస్థితులన్నింటి కారణంగానే ప్రజలకు మొదటి వందరోజుల కాలానికి సంబంధించి గాని, ఇపుడు మొత్తం ఏడాది గురించి గాని, గ్యారెంటీలన్నవే అన్నింటికన్న ప్రధానంగా మారి దృష్టిలో నిలిచాయి. మరొక విధంగా చెప్పాలంటే తమ దైనందిన జీవితాలలో, వృత్తి వ్యాపకాలలో ప్రధానమయ్యాయి. ఇప్పుడు ఏడాది కూడా ముగుస్తున్నందున, ఏడాదిలో కొత్తగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మొదటి ఏడాదిలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17లోపు నియామకాల పూర్తి, నిరుద్యోగ యువతకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పించేవరకు ప్రతి నెల రూ.4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 సహాయం, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం, పింఛన్ల పెంపు వంటివి వంద రోజులలో ఆరు గ్యారెంటీల అమలు హామీకి అదనంగా ప్రజల చర్చలోకి వస్తున్నాయి. ఇవేవీ అమలు కావటం లేదన్నది విషయం. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం జవాబివ్వటం లేదన్నది సమస్య. భరో సాలిచ్చినా రాహుల్ గాంధీ తదితరులు ఇటు ఒక్క సారైనా తొంగిచూడకపోవటం మరొక సమస్య.
గ్యారెంటీలను పరిశీలిస్తే, గ్యారెంటీ కార్డులో పేర్కొన్న 13 అంశాలలో మహిళలకు ఉచిత బస్సు పూర్తిగా, రూ.500కు గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అనే నాలుగు అరకొరగా అమలవుతున్నాయి. వరికి సంబంధించి మొదట అన్ని వడ్లూ అని చెప్పి ఇప్పుడు సన్నాలు మాత్రమేనంటూ మాట తప్పారు. వరి కాకుండా మరొక 9 రకాల పంటలకు మద్దతు ధర పెంపును కొత్త రేట్లతో సహా ప్రకటించి మరిచిపోయారు. ఇట్లా ఒక పూర్తి, నాలుగు అరకొర కలిపి ఐదింటిని మినహాయిస్తే తక్కిన తొమ్మిదింటి అసలు ఊసే లేదు. ఈ జాబితాకు రుణమాఫీ, ఉద్యోగాల వంటివి కలిపి చూసినట్టయితే, వైఫల్యాల తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది.
వీటితోనే బాధపడుతున్న ప్రజలకు రుణమాఫీపై అబద్ధాలు, గత ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను తమవిగా చెప్పుకోవటం, ఇంకా ఇతర అబద్ధాలు, రోజుకో మాట మార్చటం, కేసీఆర్ ఆనవాళ్లన్నీ తుడిచివేస్తాననటం, మంత్రులు తలో విధంగా మాట్లాడటం, సీఎం రేవంత్ భాష, గత ప్రభుత్వ పనులను తనవి అనటం, రోజుకో దర్యాప్తు ప్రకటనల వంటివి ప్రజలకు పుండు మీద కారం చల్లినట్టు అవుతున్నాయి. ఇటీవలకి వస్తే చెరువులు, మూసీ ప్రక్షాళన పేరిట పేదలపై జరిగినవి, లగచర్ల మొదలైన ఘటనలు, ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లల మరణాలు, ప్రజాస్వామిక నిరసనలపై పోలీసుల అణచివేతలు అన్నివర్గాల వ్యతిరేకతలకు కారణమవుతున్నాయి. వీటన్నింటి మధ్య ఏమైనా మంచి జరిగినా ప్రజల దృష్టిలో విలువ ఉండటం లేదు. కాని అది ప్రభుత్వ స్వయంకృతం.
ఈ విధంగా ముగుస్తున్న రేవంత్ ప్రభుత్వ ఏడాది కాలం, మున్ముందు అయినా మెరుగు ప డగలదనే ఆశ కన్పించటం లేదు. ఆర్థిక పరిస్థితి తనకు బాగా తెలుసునన్నట్టు ఎన్నికల ప్రచారం లో చెప్పిన ఆయన, అధికారం కోసం అసాధ్యపు హామీలివ్వటం ఇందుకు ఒక కారణమైతే, అవగాహనాలోపం, అనుభవ లేమి, వ్యక్తిగతంగా అపసవ్యపు ధోరణి ఇతర కారణాలవుతున్నాయి. కనీసం రాగల కాలంలోనైనా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి తమ మ్యానిఫెస్టోను, గ్యారెంటీలను అమలుపరచగల నాయకత్వ సమర్థత గాని, వ్యక్తిగత లక్షణాలను మార్చుకొని, ప్రజల దృష్టిలో గౌరవాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకోగల తీరు గాని ఆయనలో కన్పించటం లేదు. ఏడాది పాలనను ఆడిటింగ్ చేస్తే తేలుతున్న బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా ఉంది.
– టంకశాల అశోక్