దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారందరికీ స్పష్టంగానే తెలుస్తున్నది. పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించుకోవటం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అసాధారణమైన ఆపరేషన్లను ప్రాంతీయ పార్టీలపై ప్రయోగిస్తున్నది. బీజేపీ ఎత్తుగడలకు ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు సోదిలోకి లేకుండా పోయాయి. దేశంలోనే అత్యంత పటిష్ఠమైన పార్టీలు, జాతీయ స్థాయికీ ఎదిగే పార్టీలు అని అనుకొన్న ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కసారి అధికారం కోల్పోగానే కోలుకోలేని పరిస్థితిలోకి పడిపోతున్నాయి.
బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాటి నుంచే తృణమూల్ అధినేత్రి మీద, ఆమె మేనల్లుడి మీద తిరుగుబాటు మొదలైంది. దాదాపు ఇరువై మంది ఎంపీలు తమ దారి తాము చూసుకోవటానికి దారులు వెతుక్కున్నారు. వీరికి బీజేపీ పరోక్షంగా అండగా నిలిచింది. అంతకుముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధించిన శివసేనకు చెందిన లోక్‌సభ ఎంపీలకు బీజేపీ గాలం వేసింది. ఢిల్లీలో తిరుగుబాటు ఎంపీల వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఒక్కో ఎంపీకి రూ.15 కోట్ల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందే, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనను దారుణంగా చీల్చిన బీజేపీ, ఇప్పుడు ఆ కాస్త మనుగడను కూడా లేకుండా చేయటానికి కుయుక్తులు పన్నుతున్నది.
ఇంకోవైపు మహారాష్ట్రలోనే మరో బలమైన పార్టీగా ఎదిగిన ఎన్సీపీని ఆల్రెడీ చీల్చేశారు. ఇపుడున్న ముక్కను తమవైపు లాగటానికి ప్రయత్నిస్తున్నారు. శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే.. ప్రస్తుతానికి ఇండి కూటమితో కలిసి తిరుగుతున్నప్పటికీ, ఏ క్షణంలోనైనా ఏదైనా జరుగవచ్చునని భావిస్తున్నారు. ఇక పంజాబ్‌లో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ తమవైపు వచ్చే పరిస్థితిని బీజేపీయే కల్పిస్తున్నది. తమిళనాడులో అన్నాడీఎంకేను పూర్తిగా బలహీనం చేసేశారు. డీఎంకేకు కాంగ్రెస్ చేయి ఇవ్వడంతో ఆ పార్టీ తనకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఎన్డీఏలో లేనప్పటికీ ఉన్నట్టే.
ఉత్తర భారతంలో గట్టిగా నిలబడి ఉన్న ప్రాంతీయ పార్టీలు సమాజ్‌వాది, ఆర్జేడీ, జేడీయూ మాత్రమే. జేడీయూ ఎన్డీఏలో భాగస్వామే కనుక ఇబ్బంది లేదు. దక్షిణ భారతానికి వస్తే.. జేడీఎస్ ఎన్డీయేతో కలిసే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేన కూటమిగానే ఉన్నాయి. అయితే టీడీపీ జాతీయ స్థాయిలో ఏ కూటమికీ పర్మనెంట్‌గా విశ్వసనీయంగా ఉన్న పార్టీ కాదు.
రాజకీయ అవసరాన్ని బట్టి ఏ గోడ అయినా దూకే పార్టీ. జనసేన బీజేపీకి ఒక విభాగంగానే పనిచేస్తున్నది. ఇక వైఎస్సార్సీపీ బిల్లుల వారీగా బీజేపీకి మద్దతు ఇస్తున్నది. ఇదిలా ఉంటే, దేశంలో అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలబడింది బీఆరెస్సే అని చెప్పవచ్చు. పార్టీ ఏర్పాటైన 2001 నుంచి కూడా ఆ పార్టీ మనుగడను దెబ్బతీయటానికి పలు పార్టీలు చేయని ప్రయత్నం అంటూ లేదు. 2004 లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మరో చెన్నారెడ్డి మాదిరిగా చేయాలని కుట్ర పన్నా రు. మంత్రి పదవులు ఆశ చూపారు. కీలకమైన ప్రభుత్వ శాఖలు ఆఫర్ చేశారు. పార్టీని విలీనం చేయాలన్నారు. కానీ కేసీఆర్‌ను లొంగదీసుకోవటం సాధ్యం కాలేదు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం పది మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నది. ఎన్నికల దాకా నిర్ణయాలు చెప్పకుండా సాగదీసి..చివరకు అనర్హత వేటు వేసింది. ఫిరాయింపుదారుల రక్షణకు కాంగ్రెస్ వేసిన రాచబాట ఇదే. ఇప్పటికీ ఇదే మార్గాన్ని దేశంలోని అందరు స్పీకర్లు అనుసరిస్తున్నారు.
మన రాష్ట్ర స్పీకర్ మరో అడుగు ముందుకేసి..అసలు ఫిరాయింపే చేయలేదని ఢంకా బజాయించేశారు అది వేరే సంగతి. నైతికంగా పార్టీని బలహీనం చేయటానికి ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టీడీపీ అధినేత అయిదు కోట్లకు బేరం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చాలని చేసిన ఓటుకు నోటు ప్రయత్నం దారుణంగా నీరుగారింది. ఆ తరువాత దేశంలోని ఎనిమిది రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేసిన బీజేపీ..తెలంగాణలోనూ ఒక విఫల ప్రయత్నం చేసింది. రహస్య ఆపరేషన్ ద్వారా దేశం ఎదుట బీజేపీని కేసీఆర్ నిలబెట్టడంతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల కూల్చివేత పూర్తిగా ఆగిపోయింది.
2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను మూడింట రెండు వంతులు చీల్చడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. ఒక్కొక్కరుగా పది మంది ఎమ్మెల్యేలను, చిన్నాచితకా నాయకులను కాంగ్రెస్ లోకి లాక్కొని కొంతకాలం హడావుడి చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనని తెగ ప్రచారం చేశారు.
పది మంది కంటే ఎక్కువ మందిని ఆకర్షించటంలో ఫెయిల్ కావటంతో కాంగ్రెస్ చేతులెత్తేసింది. బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లటంతో స్పీకర్ మెడమీద కత్తిపడ్డట్టయింది. విచక్షణ పేరుతో ఫిరాయింపు జరుగలేదని తీర్పు చెప్పినా.. ఫిరాయించినవాళ్లూ.. ఫిరాయింపజేసినవా రూ ఇద్దరూ ప్రజల్లో బదనాం అయ్యారు. ఈ గూటి నుంచి ఆ గూటికి వెళ్లినవారు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా రాజకీయ కెరీర్‌నే పణంగా పెట్టుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిక వారి దృష్టి పార్టీ మూలస్తంభాలపై పడింది. పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా కేసీఆర్‌కు నీడగా నడుస్తున్న హరీశ్‌రా వు, పార్టీని అన్నీ తానై నడిపిస్తున్న కేటీఆర్ మ ధ్య గ్యాప్ పెంచితేనే బీఆర్ఎస్ను బలహీనం చేయటం తేలిక అని ప్రత్యర్థులు బలంగా విశ్వసిస్తున్నారు. కేసీఆర్ ప్రత్యర్థులకు మొదటి నుంచి కూడా హరీశ్ సాఫ్ట్ టార్గెట్‌గా మారారు.
తాజాగా హరీశ్‌రావుతో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారంటూ తెలంగాణ హిట్లర్, ఆయన అనుచరుడైన గోబెల్స్ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. మీడియాలో చర్చల మీద చర్చలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే.. కేసీఆర్‌తో హరీశ్‌రావు బంధాన్ని తెంచటం అంత తేలికైన విషయం కాదు. ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. అధికారంలో ఉంటేనే ప్రాభవం, అధికారం కోల్పోగానే విచ్ఛిన్నం అయ్యే బలహీనమైన పార్టీ కాదని ఆ పార్టీ ప్రస్థానమే చెప్తుంది. ఇది మిగతా పార్టీల మాదిరిగా వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీ కాదు. తన ప్రాంతం మీద ఎమోషన్ అనే పునాదుల మీద నడుస్తున్న పార్టీ. దేశంలోని మిగతా రాజకీయ పార్టీల మాదిరి వ్యవస్థీకృతమైన హైరార్కీ కూడా దీనికి అవసరం లేదు. తెలంగాణ అనే ఒక్క మాటే దీని ఉనికి.. ఇలాంటి పార్టీని ముట్టుకోవటం అంటే..తనను తాను కాల్చుకోవటమే అవుతుంది.
– కోవెల సంతోష్ కుమార్