పాండవులకు విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు.. చెట్టు చివరన పక్షి బొమ్మను కట్టి, దాని కన్నును ఛేదించమని అర్జునుడికి పరీక్ష పెడతాడు. ‘నీకేం కనిపిస్తుంది అర్జునా!’ అని ద్రోణుడు అడిగితే.. ‘పక్షి కన్ను తప్ప ఏదీ కనిపించడం లేదు’ అని అర్జునుడు అన్నాడని భారతంలో ఉంది. హైడ్రా కూల్చివేతలో ముఖ్యమంత్రి గురువైతే, కమిషనర్ గాండీవధారి. అక్రమ నిర్మాణాల కూల్చివేతే తప్ప దాని పూర్వాపరాలు, పర్యవసానాలు, ప్రజల లాభనష్టాలు హైడ్రా సారథికి అవసరం లేదు. పోలీసులది ఎప్పుడూ పెద్దపులి చూపే. పైగా వారికి కోర్టులు, తీర్పులు అంటే ఒక రకమైన అసహనం. ఎంతో కష్టపడి పట్టుకున్న నేరగాళ్లకు జడ్జీలు బెయిల్ ఇస్తారని కినుక కూడా. అదే సూత్రం హైడ్రా కమిషనర్ పాటిస్తున్నట్టుంది. కోర్టుకు వెళ్తే స్టే వస్తుందనే ఉద్దేశంతో కూల్చివేతల సమాచారం రహస్యంగా ఉంచుతున్నారు. ఏమైనా లీకులు ఇస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని సిబ్బందిని హెచ్చరిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఇలా న్యాయవ్యవస్థను విశ్వసించకుండా ఒంటెత్తు పోకడలతో ముందుకెళ్లడమంటే కోర్టులు, న్యాయశాస్ర్తాల విలువను తగ్గించినట్టే అవుతుంది. ఇది పసిగట్టే హైడ్రాకు న్యాయస్థానం బిగింపులు తెచ్చింది.
HYDRA | హైడ్రా కొత్త కూల్చివేతల కథలను రోజువారీగా పత్రికలు, టీవీలు సీరియల్లా చెప్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసే వీలు లేనందున ప్రజా దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం హైడ్రాను సృష్టించిందనే విపక్షాల మాటల్లో కూడా నిజం ఉంది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో చెరువుల చుట్టూ ఉన్న నిర్మాణాలను ఫటాఫట్ కూల్చివేస్తామని ఎన్నికలప్పుడే చెప్తే ప్రజల తీర్పు మరోలా ఉండేది. ఇక కాంగ్రెస్ హమీల విషయానికొస్తే.. సగం మంది రైతులు రుణమాఫీ అవ్వక ఆగమై రోడ్లెక్కుతున్నారు. రైతుబంధు ఊసే లేదు. కొత్తగా ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా రాలేదు. ఆసరా పింఛన్లు పెరగలేదు. తులం బంగారం లేకున్నా అసలు లక్ష రూపాయలు అందక కల్యాణలక్ష్మికి కంట నీరే మిగిలింది.
ఇక హైడ్రా విషయానికి వస్తే ఈ కూల్చివేతలు ఇప్పట్లో ఆగేలా లేవు. వీటివల్ల చెరువుల పరిధిలోని అక్రమ నిర్మాణాలు తొలగిపోయి, వరద ప్రభావానికి గురవుతున్న ప్రజల కష్టాలు గట్టెక్కుతాయి. చెరువులు బాగుపడి, నిల్వ సామర్థ్యం పెరిగి, నీటి సమస్య తీరవచ్చు. హైదరాబాద్ వీధులు చెరువులను తలపించే రోజులు పోతాయి. వర్షాకాలం ట్రాఫిక్‌జామ్ పీడ వదులుతుంది. నగరం పూర్వకళను సంతరించుకోవచ్చని నగరవాసుల ఆశ. అయితే ప్రస్తుతం కూలుస్తున్న కట్టడాల్లో ఎక్కువగా ఫంక్షన్ హాళ్లు, ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయి. అవన్నీ ధనవంతులవే. వారికి ఈ నిర్మాణాలు కూలిపోవడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు. పైగా కన్వెన్షన్ల అద్దెల రూపంలో పెట్టుబడికి మించి రాబడి వచ్చి ఉండవచ్చు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తమ కబ్జాల గురించి నోరు మెదపడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుండటంతో అక్రమ నిర్మాణాలు కొన్ని బయటపడుతున్నాయి.
చెరువు పరిధిలో కట్టిన ఫామ్‌హౌజ్‌లు, వ్యాపార కేంద్రాలు కూల్చేశాక హైడ్రా దూకుడు నివాసిత ఇళ్లపై, అపార్ట్మెంట్లపై మొదలవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. అదే కనుక జరిగితే వాటిలో ఉంటున్న సామాన్యుల పరిస్థితి ఏమిటి? అధికారికంగా అన్ని రకాల అనుమతులు ఉన్నాయనే కారణంగా ఫ్లాట్లు కొన్నవారి గతేమిటి? గూడు కండ్లముందే కూలుతుంటే వారి గుండెలు ఆగిపోవా? నగరంలో చెరువులను ఆనుకొని వందల వెంచర్లున్నాయి. లక్షల జనాభా వాటిలో నివసిస్తున్నారు. చాలామంది 10-20 ఏండ్ల కిందటే వాటిని కొనుగోలు చేశారు. ప్రశాంతంగా ఉన్నవారి జీవితాల్లోకి ఇలా చొరబడితే వారిని కాపాడేదెవరు? ఇప్పటికే ఏ అర్ధరాత్రి, ఏ ముప్పు ముంచుకొస్తుందోనని వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అదీకాకుండా చాలామంది ఇలాంటి ఇండ్లను బ్యాంకు లోన్ల ద్వారా కొనుక్కున్నారు. కూల్చివేతతో బ్యాంకు రుణం తీరిపోదు. అప్పుదారులు, హమీదారుల్లో చాలామంది ఉద్యోగులే అయి ఉంటారు. వారి శాలరీల్లో కోతలు ఆగవు. మరో ఇంటి కిరాయి తప్పదు. ఈ కబ్జా సామ్రాజ్యంలో వారి పాత్ర లేకున్నా శిక్షను భరించాల్సి వస్తుంది. దీనిపై ప్రభుత్వం సమాధానమేమిటి?
అక్రమ కట్టడాల్లో స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు కూడా ఉంటాయి. వాటిలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? కట్టిన ఫీజులు ఎవరు వెనక్కి ఇస్తారు? హాస్పిటళ్లలోని రోగులు ఎటు వెళ్తారు? ఇలా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం కావాలి. కూల్చేశాక ఎంత మాట్లాడినా ప్రయోజనం శూన్యం. ముందు వెనుక ఆలోచన లేకుండా ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వీటికి సమాధానం ముందు ఇవ్వాలి. నివాసాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇవ్వాలి. విద్యాలయాలు, దవాఖానలకు సమయమివ్వాలి.
అక్రమ కట్టడాల్లో పాఠశాలలు, కళాశాలలు, దవఖానలూ ఉన్నాయి. వాటిలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమిటి? కట్టిన ఫీజులు ఎవరు వెనక్కి ఇస్తారు? దవాఖానల్లోని రోగులు ఎటు వెళ్తారు? ఇలా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం కావాలి. కూల్చేశాక ఎంత మాట్లాడినా ప్రయోజనం శూన్యం.
18 ప్రాంతాల్లోని 166 అక్రమ కట్టడాలను హైడ్రా ఇప్పటికే నేలమట్టం చేసినట్టు తెలుస్తున్నది. ఆ శిథిలాలతో పాత యజమానికి సంబంధం ఉండదు. వాటి తొలగింపు ఎవరు చేపట్టాలి? వాటిని ఎక్కడికి తరలించాలి? వాటి కోసం ఎన్ని ఎకరాల స్థలం అవసరం? అందుకు అవసరమైన ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి? తరలింపునకు అయ్యే రూ.కోట్ల ఖర్చును ఎవరు భరిస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వాలి. ఖర్చును భరించడమెందుకని ఆ శిథిలాలను అలాగే వదిలేస్తే హైడ్రా లక్ష్యం నెరవేరదు. చెరువుల దురాక్రమణదారుల భరతం పట్టాల్సిందే. కానీ, పద్ధతి మాత్రం ఇది కాదు. ఒక పరిష్కారం కొత్త సమస్యలను తెచ్చి పెట్టకూడదు. దీని కార్యాచరణలో కమిషనర్ పాత్ర కీలకమైనది. ఈ వ్యవహారం న్యాయబద్ధంగా, ప్రశాంతంగా జరగాలంటే రాత్రికే రాత్రి చేపట్టే కూల్చివేతలను నిలిపివేసి ప్రజలను కలుపుకొని పోవాలి. వీలైతే ఒకరిద్దరు నిపుణులను సలహాదారులుగా నియమించాలి. వారితో ప్రాంతీయ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి, తీర్మానాలు చేయించాలి. భూసేకరణ కోసం పత్రికా ప్రకటన ఇచ్చినట్టు.. ఎక్కడెక్కడ, ఎవరెవరివి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఇండ్లు ఉన్నాయో సవివరంగా తెలియజేయాలి. వారంతా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారనుకుంటే అది తప్పే. జడ్జీలు గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటారనుకుంటే వారిని అవమానించడమే. న్యాయవ్యవస్థ మద్దతు కోరాలి తప్ప దాని కన్ను కప్పకూడదు.
హైదరాబాద్ చెరువుల్లో సగానికి పైగా కబ్జాకు గురైనట్టు పలు నివేదికలు చెప్తున్నాయి. రిమోట్ సెన్సింగ్ సమాచారం ప్రకారం.. నగరం చుట్టుపక్కల 56 చెరువుల్లో 10,417 ఎకరాల విస్తీర్ణం 3,974 ఎకరాలకు కుదించుకుపోయింది. అంటే 60 శాతం దురాక్రమణ జరిగిందన్నమాట. మరి వీటన్నిటిని కూల్చుకుంటూపోతే పూర్తయేదెన్నడు? నష్టపోయే అమాయకులకు ప్రత్యామ్నాయమేమిటి? చాలా నిర్ణయాలు హైడ్రా కమిషనర్ వైపు నుంచి ప్రజలకు తెలుస్తున్నాయి. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలుంటాయని ఆయన ఎప్పుడో అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, రిజిస్ట్రేషన్ అధికారులపై చర్యలు తీసుకొనే అధికారాలు హైడ్రాకు ఉన్నాయా? చెరువుల పరిధిలో స్థలాలు, ఇల్లు కొన్నవాళ్లు బిల్డర్లపై కేసులు పెట్టాలని కమిషనర్ అంటున్నారు. పెడితే ప్రయోజనమేమిటి? ప్రభుత్వ స్థలాలను పూడ్చేసిన వాహనాలను స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. ఇది అన్యాయం కాదా! ఇలాంటి విషయాలపై ప్రభుత్వమే మాట్లాడాలి. అధికారి శాసనకర్త కాదు. ఒక పెన్ను పోటుతో ఆయన ఉన్నపళంగా కేంద్ర సర్వీసులోకి వెళ్లవచ్చు. మిగిలేది కాంక్రీట్ గుట్టలు, నిర్వాసిత ప్రజలే. సమయానికి స్పందించకపోతే జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది.
– బి. నర్సన్
9440128169