ఒక అధ్యాపకుడు ఒకే విద్యాసంస్థలో పదకొండేండ్ల పాటు నిరంతరాయంగా పనిచేయడమనేది మామూలు విషయం కాదు. కుటుంబాలకు, పిల్లలకు దూరంగా ఉంటూ సొంతూళ్లకు వందల కిలోమీటర్ల దూరంలో ఉం టూ పనిచేయడం వల్ల మానసికంగా కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల అధ్యాపకులు ప్రస్తుతం ఈ బాధ ను అనుభవిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఉద్యోగంలో నియమితులైన చాలామంది అధ్యాపకులు ఇప్పటికీ ఒకేచోట పనిచేస్తుండటం గమనార్హం.
అదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లోని అధ్యాపకులకు రెండు, మూడుసార్లు బదిలీలు జరిగినట్టు సమాచారం. కోర్టు కేసుల కారణంగా బదిలీలు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. కానీ, కోర్టు కేసులు ఉండగానే.. ఇతర విభాగాల పరిధిలోకి వచ్చే ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయనే విషయాన్ని మరిచిపోరాదు. వారి బదిలీలు న్యాయస్థానాల తుది తీర్పులకు లోబడే జరిగాయి. కాబట్టి బదిలీల ప్రక్రియను ఇప్పటికైనా చేపట్టాలి.
మరోవైపు ఒకే ఉద్యోగ ప్రకటన ద్వారా నియామకమైన ఏపీలోని అధ్యాపకులకు బదిలీలతో పాటు 010 పద్దు కింద వేతనాలు పెరిగాయి. అంతేకాదు, పాఠశాల విద్యాశాఖలో విలీనం కూడా చేశారు. కానీ, తెలంగాణలో మాత్రం అలాందేమీ జరగలేదు. అధ్యాపక సంఘాల మధ్య సమన్వయం లేకపోవడమే సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడానికి ప్రధాన కారణం.
ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు సంఘాలు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పటికైనా ఆదర్శ పాఠశాలల అధ్యాపకులు కలిసికట్టుగా ఉంటూ సమస్యల సాధనకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా 010 పద్దు కింద వేతనాలు చెల్లింపుతో పాటు బదిలీలు లాంటి న్యాయమైన డిమాండ్లను సాధించుకోవచ్చు.
– డాక్టర్ కావలి చెన్నయ్య ముదిరాజ్
90004 81768