శివుడికైనా, బ్రహ్మకైనా భాగవతం తెలిసి చెప్పడం కష్టం. తెలిసిన వారినుంచి విన్నంత, కన్నంత నాకు తెలిసినంత చెప్తానన్నాడు పోతన. భాగవతం ఊరికే చదివితే తెలిసేది కాదు. విన్నంత- అంటే వినాలి. విబుధుల వల్ల, అనుభవజ్ఞుల వల్ల, సంప్రదాయజ్ఞుల వల్ల భక్తిశ్రద్ధలతో వీలున్నంత వరకు ఆలకించాలి. అంతేకాదు, కన్నంత- అంటే దర్శించాలి. సమాజంలో తిరుగుతూ, జనాలను పరిశీలిస్తూ వీలున్నంత మేరకు సరిచూసుకోవాలి. అప్పుడు కొంతలోకొంత విషయం తెలిసివస్తుంది. ‘అలా నేను తెలుసుకున్న దాన్ని మీకు తేటపరుస్తాన’న్నాడు పోతన. అంతేకానీ, నాకు అంతా తెలుసు, మీకు అంతా చెప్తాననలేదు. విన్నంత, కన్నంత అనడంలోనే మొత్తంకాదు అనీ, ఏదో కొంతలో కొంత అని అర్థం.
ఒక కోణం నుంచి ఇది నిజమే! తెలుసుకోవడం వేరు. ఇంకొకరికి తెలియజేయడం వేరు. తెలుసుకోవడం తనకోసం. ఇందు లో ఎవరి అభ్యంతరమూ ఉండదు. కానీ, తెలియజెప్పడమనే ది పరుల కోసం.. ఈ క్రమంలో ఎన్నో అభ్యంతరాలు ఎదురవ్వొచ్చు. భాగవతం పూర్తిగా తెలిసిందా ఇక పలకలేడు, మౌన ముద్ర దాలుస్తాడు. ఇక మాటపడవలసినవి లేవని భావం. ‘యథో వాచో నివర్తన్తే తద్ధామ పరమం మమ’- ఎక్కడికైతే వాక్కులు వెళ్లడానికి ప్రయత్నించి ఇక చేరుకోలేక వెనక్కి వస్తా యో అక్కడే పరతత్తం అన్నారు కదా! అందుకే భాగవతం తెలి సి పలుకుట చిత్రంబు అన్నాడు పోతన. అంటే ఇప్పుడు లోకం లో పలుకుతున్న వారంతా లేదా ప్రవర్తిస్తున్న వారంతా తెలిసి పలకడంలేదు-అని పోతన నిక్షేపించిన నిగూఢమైన అర్థం.
‘ఆఁ! భాగవతంలో ఏముందిలే?’ అని పలికినవాళ్లే.. భాగవత సుధను ఆస్వాదించిన తర్వాత ‘ఇక చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు’ అనేస్తారు. ఇదీ భాగవతంలో ఉన్న గొప్పదనం. అందుకని ఎంత గొప్పవాడైనా సరే నాకు భాగవతం అంతా తెలుసు- చెప్తాను’ అంటే అతనికి పూర్తిగా తెలియదనుకోవాలి. ఇది ఒప్పుకోవలసిన విషయం. ‘విద్యా భాగవతావధిః’ అన్నారు పెద్దలు. చదువుకున్న చదువుకు ఇంపైన ముగింపు ఏమంటే ‘భాగవత’ పఠనం. అది చదివినప్పుడే చదువంతా పూర్తయినట్టు అని పెద్దలమాట. జీవితాన్ని తరింపజేసేది కాబట్టి భాగవతాన్ని చేతనైనంతలో చదవాల్సిందే! చెప్పాల్సిందే! వినాల్సిందే!!
– డా॥ వెలుదండ సత్యనారాయణ, 94411 62863