‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను…’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటితో మూడు నెలలు పూర్తయ్యాయి. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని, ఆ కుర్చీని అధిష్టించాలని ప్రతీ రాజకీయ నాయకుడూ కోరుకుంటాడు. కానీ, ఆ కలను నెరవేర్చుకోవడంలో కొందరే సఫలీకృతమైతే, ఇంకొందరు వెనుకబడిపోతారు.
Congress | ‘కాంగ్రెస్ పార్టీలో ‘భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుల తలలు పండుతున్నా, వారి కల మాత్రం ఇంకా పండటం లేదు. అలాంటి నాయకులు ఆ కుర్చీ అంచును కూడా తాకలేకపోతున్నారు. వారి సంగతి పక్కనపెడితే ‘ముఖ్యమంత్రి’ కుర్చీని దక్కించుకోవడంలో సఫలీకృతమైన కొందరు నాయకులు ప్రజలకు సంక్షేమ పాలనను అందించడంలో, ప్రజలు కోరుకున్న ‘మార్పు’ను చేసి చూపించడంలో విఫలమవుతున్నారు. అయి తే ఈ మూడు నెలల కాలంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రె డ్డి ఏం సాధించారో అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో భాగంగానే ఈ వ్యాసం…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ వేదికగా కొనియాడారు. వైఎస్ ప్రవేశపెట్టిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని తమ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని బల్లగుద్ది ప్రకటించారు. నిజానికి వైఎస్ఆర్ ప్రత్యేక తెలంగాణకు బద్ధ వ్యతిరేకి. అయినా ప్రత్యేక రాష్ట్రం గా తెలంగాణ ఆవిర్భావం ఆగలేదు. దీనివెనుక ఎవరి కృషి ఉన్నదో నాటి ఏ ఉద్యమ నాయకులనడిగినా చెప్తారు. వైఎస్‌ను కేసీఆర్ ఏనాడూ శత్రువుగా చూడలేదు. వైఎస్ ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కీర్తించారు. ఇతర నాయకులు ప్రవేశపెట్టిన మంచి పథకాలను అలాగే కొనసాగిస్తామని అసెంబ్లీలో ప్రకటించాలంటే ఏ నాయకుడికైనా గుండె నిండా దమ్ముండాలి. అన్నింటికి మించి మం చి మనస్సుండాలి. అది ఉంది కాబట్టే నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని కొనసాగించడమే కాదు, దానితో ప్రజలకు ఒనగూడే ప్రయోజనాలను విస్తృతపరిచి ప్రజల మెప్పు పొందారు. ఒక్క కేసీఆరే కాదు, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల బాగోగుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే ఏ నాయకుడైనా ఇదే చేస్తారు. ఒక్క రేవంత్‌రెడ్డి తప్ప. అవును, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఏం చేయకూడదో అదే చేసి ఆదిలోనే తప్పులో కాలేశారు.
శివుడి శిరస్సు నుంచి గంగ కిందకు దుంకుతున్నదనే విషయం అందరికీ విదితమే. కానీ ఆ బోళా శంకరుడి శిరస్సు మీదికే గంగను ఎత్తిపోయవచ్చని నిరూపించిన బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం. అలాంటి ప్రాజెక్టు మీదికి ఎన్నో అపప్రథలను మూటగట్టి విసిరేయజూస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
సీఎం రేవంత్ కుత్సిత బుద్ధి వెనుక అపర భగీరథుడైన కేసీఆర్‌ను ప్రజల్లో పలుచన చేయాలనే కుట్ర దాగి ఉన్నదనే విషయం ప్రస్ఫుటంగా కనపడుతున్నది. ఈ క్రమంలో ఏ ప్రజలైతే మార్పును కోరుకున్నారో ఆ ప్రజలనే ముఖ్యమంత్రి రేవంత్ మరిచిపోవడం బాధాకరం. గత ఐదారేండ్లుగా ఎండకాలంలోనూ మత్తళ్లు దుంకిన చెరువులు ఫిబ్రవరిలోనే నెర్రెలు బారాయి. ఇంకేముంది పాత రోజులు మళ్లీ వచ్చాయంటూ ప్రజలు ఏకరువు పెడుతున్నారు. ఎండిపోతున్న పంటలను చూడలేక ట్యాంకర్లతో పంటలకు నీరు పెడుతున్నారు. సాగునీటి సంగతి దేవుడెరుగు తాగునీటికీ కటకట మొదలైందంటూ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. మన ఆడబిడ్డలు బిందెలను పట్టుకొని రోడ్డెక్కుతున్నారు. నాడు ఎరువుల కరువు తీరిందని సంబురపడిన కర్షకులు మళ్లీ చెప్పులను క్యూలో పెడుతుండటం నిజంగా బాధాకరం.
‘ఏ దొడ్లో కడితే ఏమిటీ, మా దొడ్లో ఈనితే చాలు’ అనుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీచేసిన ఉద్యోగ నియామక పత్రాలందజేస్తుండటాన్ని చూసి యువత నవ్వుకుంటున్నది. మళ్లీ ‘గ్రూప్-1’ అని గొప్పలకు పోతున్నా… మెగా డీఎస్సీ అంటూ నీటిమీద రాతలు రాస్తున్నా… లక్షలాది మంది నిరుద్యోగుల్లో నిరాశా నిస్పృహలు ఇంకా కనపడుతున్నాయి. బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన దాదాపు మూడు లక్షల మంది నిరుద్యోగులు మాకు టెట్ రాసే అవకాశం ఇవ్వకుండా డీఎస్సీ ఎట్లా ప్రకటిస్తారని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండటం గమనార్హం. ఇక ‘రైతు భరోసా’గా మారిన రైతుబంధు విషయానికి వస్తే… ఎకరానికి ఏటా రూ.15 వేలేమో కానీ, పసలుకు పది రూపాయలు కూడా పడవనే నిరాశ రైతుల్లో అమాంతం పెరిగింది. అప్పటి ప్రభుత్వం కట్టిన ప్రీమియం కారణంగా ఎల్ఐసీ ద్వారా రైతు బీమా ప్రస్తుతానికి సజావుగానే నడుస్తున్నది. పాలసీ గడువు ముగిసిన తర్వాత వచ్చే ఆగస్టు నెల నుంచి ప్రస్తుత ప్రభుత్వం ‘రైతు బీమా’ కొనసాగించడం మీద రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి ఈసమెత్తు బంగారం గానీ కల్యాణలక్ష్మి డబ్బులు గానీ ఇవ్వడం లేదు.
ఇక్కడ ‘మార్పు’ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే రాష్ట్రంలో ‘మార్పు’ మొదలై మూడు నెలలు పూర్తయింది. అయినా ఇప్పుడు మా బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఏకరువు పెడుతున్నది పల్లె ప్రజానీకం.
అయితే ఎంతసేపూ కుర్చీ కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ, హైదరాబాద్ చుట్టూరా ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప మా పల్లెలకు మాత్రం రావడం లేదని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఏదేమైనా గత మూడు నెలల కాలంలోని రేవంత్ పాలన రాష్ట్ర ప్రజలకు మూడు చెరువుల నీళ్లు తాగించింది. రాష్ట్ర ప్రజలు ఈ మూడు నెలలు పయనించింది ముండ్లబాటలోనే అనడంలో అతిశయోక్తి లేదు.
– గడ్డం సతీష్
99590 59041