అద్దెగర్భం లేదా సరొగసి అనేది వైద్యరంగంలో ఒక విప్లవం. అనారోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల సంతానం కలగని దంపతులకు ఇదొక వరం. కానీ, కొందరి ధనాశ మూలంగా సరొగసి విధానం ఒక వ్యాపారంగా మారిపోవడం బాధాకరం. కమర్షియల్ ఫెర్టిలిటీ సెంటర్లు రోజురోజుకు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటం ఈ పరిస్థితికి అద్దం పడుతున్నది.
ధనవంతులు, గ్లామర్ ఫీల్డ్‌లో పనిచేసే మహిళలు అద్దెగర్భాలతో పిల్లల్ని కనడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. వారి అవసరాన్ని, పిల్లలు లేని దంపతుల నిస్సహాయతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కొన్ని కమర్షియల్ ఫెర్టిలిటీ సెంటర్లు డబ్బులను ఎరగా చూపి నిరుపేద మహిళలను బిడ్డలను కనే యంత్రాలుగా మారుస్తున్నాయి. మన దేశంలోని మహిళల అమాయకత్వం, పేదరికం, చట్టాల్లోని లొసుగుల మూలంగా దేశ, విదేశీ జంటలు మన దేశాన్ని సరొగసి కోసం ఎంచుకుంటున్నాయి. దీన్ని నియంత్రించడానికి 2015లో సరొగసి రెగ్యులేషన్ బిల్లును తీసుకురాగా, అనేక సవరణలు, మార్పుల తర్వాత 2021లో ఇది ఆమోదం పొందింది.
ఈ చట్టం ప్రకారం వివాహితులైన దంపతులు మాత్రమే సరొగసి ద్వారా సంతానాన్ని పొందడానికి అర్హులు. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ ఆ దంపతులకు బంధువై ఉండాలి. శుక్రకణం, అండం ఎవరిదో వారే చట్టబద్ధమై తల్లిదండ్రులు అవుతారు. వైద్య ఖర్చులు, పోషణ సౌకర్యాలు తప్ప మరే విధమైన ఆర్థిక లావాదేవీలు ఈ ఒప్పందంలో ఉండకూడదు. సరొగసి ద్వారా బిడ్డను కన్న మహిళకు ఆ సంతానం మీద ఎలాంటి హక్కులు ఉండవు.ఒకవేళ సరొగసి తల్లి అండ ప్రదాత అయి ఉంటే, కోర్టు ద్వారా ఆమె విజిటింగ్ హక్కును పొందవచ్చు. జన్మించిన బిడ్డకు అంగవైకల్యం లేక మానసిక వైకల్యం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే వారి బాధ్యత తల్లిదండ్రులదే అవుతుంది తప్ప, గర్భాన్ని ఇచ్చిన తల్లిది కాదు.
గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ వయసు 23-35 ఏండ్ల మధ్య ఉండాలి. వివాహిత అయి ఉండాలి. అంతకుముందు కనీసం ఒక బిడ్డకు తల్లి అయి ఉండాలి. ఆమె తన జీవిత కాలంలో ఒకసారి మాత్రమే గర్భాన్ని అద్దెకు ఇవ్వాలి. సరొగసి నియంత్రణ చట్టం-2021 ప్రకారం అద్దె గర్భాన్ని ఆశించే దంపతులు పురుషులకు 25-55 ఏండ్లు, స్త్రీలకు 25-50 ఏండ్లలోపు ఉండాలి. అవివాహితులు, ట్రాన్స్‌జెండర్స్ అనర్హులు. 2025 చట్ట సవరణ ద్వారా వితంతువులు అర్హులవుతారు. వారికి అంతకుముందు సహజమైన, దత్తత లేక సరొగసి బిడ్డలు ఉండకూడదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులకు రూ.10 లక్షల జరిమానా, పదేండ్ల శిక్ష పడుతుంది.
భారతదేశంలో అత్యధిక జనాభా ఉండటమే కాదు, నిరక్షరాస్యత, పేదరికం, వెనుకబాటుతనం, మత విశ్వాసాలు, కుల కట్టుబాట్లు కూడా ఇక్కడ ఎక్కువే. పై కారణాల వల్ల చిన్న వయసులోనే మన దేశంలో వివాహాలు జరుగుతాయి. వివాహ వయస్సు స్త్రీలకు 18 ఏండ్లు, పురుషులకు 21 ఏండ్లు అని చట్టం చెప్తున్నప్పటికీ, 40 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తున్నది. అందుకే చిన్న వయసులోనే పిల్లల్ని కనడం సర్వసాధారణం. సంతానోత్పత్తికి అనుకూలమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నప్పటికీ మన దేశంలో సంతానలేమి సమస్యలతో ఉన్న వారి సంఖ్య 10-15 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా 15-20 శాతంగా ఉంది. 2.75 కోట్ల మంది సంతానలేమితో బాధపడుతున్నట్టు ఓ అంచనా. తెలంగాణలో ఈ సంఖ్య 25.7 శాతంగా ఉన్నది.
మానవ సహజ స్వభావాన్ని, బలహీనతలను, కోరికలను లాభాలుగా మార్చుకునే పెట్టుబడిదారీ సంస్కృతిలో సరొగసి ఒక వ్యాపారంగా మారింది. మన దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధిక ఫెర్టిలిటీ కేంద్రాలున్న నగరం హైదరాబాదే. ఐవీఎఫ్, ఐయూఐ తదితర ప్రయత్నాల తర్వాత దంపతులను సరొగసి వైపు మళ్లించి రూ.20-30 లక్షల వరకు వసూళ్లు చేస్తూ ఈ వ్యాపారాన్ని లాభసాటిగా నడిపిస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాలెన్నో ఉన్నాయి. అయితే, బాధితుల ఫిర్యాదుల మేరకు విచారణ జరపడం, నిందితులను అరెస్టు చేయడం తప్ప, పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు.
ఆయా కేంద్రాల చట్టబద్ధత గురించి, ఫెర్టిలిటీ పేరుతో జరుగుతున్న చైల్డ్, ఉమెన్ ట్రాఫికింగ్‌పై నియంత్రణ లేకపోవడంతో ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నది. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంతో దీనిపై మళ్లీ అందరి దృష్టి మళ్లింది. గతంలో కూడా కరీంనగర్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లోనూ ఇలాంటి ఉదంతాలు వెలుగు చూశాయి. ఈ అద్దెగర్భాల వ్యాపారాన్ని అరికట్టకపోతే అనేక సామాజిక, నైతిక, కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, సంబంధిత అధికారులు, పోలీసులు ఇప్పటికైనా అప్రమత్తమై ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి.
– జి.అనసూయ 94901 28259