‘రాజీ మాటకి మామూలే కానీ, చేతలకొచ్చేసరికి ఒక జీవితకాల యుద్ధమే దాగుంటుంది’ అన్నది ఓ తత్త్వవేత్త చెప్పిన సూక్తి. ఈ సూక్తి అర్థవంతంగానే ఉంది కానీ, దాన్ని పాలకులు ఒంట బట్టించుకున్నట్లు లేరు. రాజీపడి జీవించడమంటే ఏదో పెద్ద యుద్ధం చేసినట్టుగా భావించటమే ప్రపంచంలో ఇప్పుడున్న అసలైన సమస్య.
కళింగ యుద్ధం అశోకుడి జీవితాన్ని మార్చివేసింది. తర్వాత తన జీవితాంతం ఆయన మళ్లీ యుద్ధానికి పోలేదు. స్వయంగా తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రను బౌద్ధమత ప్రచారం కోసం దేశవిదేశాలకు పంపినట్టుగా చరిత్ర చెప్తున్నది. గొప్ప చరిత్రకు వేదికగా నిల్చింది నాటి కళింగ యుద్ధం. ఇలా చరిత్రలో జరిగిన యుద్ధాల గురించి చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప చారిత్రక సందర్భాలను ఉటంకించాల్సి ఉంటుంది. యుద్ధం ద్వారా పాలకుడిలో కలిగిన పరివర్తనకు నిదర్శనం ఆ సంఘటన. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొచ్చిన పలు విప్లవాలు రాజరిక పాలనలకు తెరదించి ప్రజాస్వామ్య పాలనకు, జాతీయ రాజ్యాలకు బీజం వేశాయి. ఫలితంగా రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయారు.
స్వతంత్ర దేశాలు ఏర్పడినప్పటికీ దేశాల మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు, భౌగోళిక, పాలనా, మతపరమైన వివాదాలు నేటికీ సద్దుమణగలేదు. కాగా తరచు ప్రపంచంలో ఏదో ఒక మూలన దేశా ల మధ్య లేదా ప్రజలకు, పాలకులకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఉదాహరణకు 200 1, సెప్టెంబర్ 11 నాటి సంఘటన ద్వారా ఏకంగా అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థను సమూలంగా అంతం చేయడానికి అమెరికా పూనుకున్న ది. ఫలితంగా జరిగిన పోరులో అమెరికా గెలిచిం దా? అల్ ఖైదా ఓడిందా? అన్నది పక్కనపెడితే అమెరికా దుశ్చర్య వల్ల అఫ్ఘాన్ నేటికీ రావణకాష్టంలా మండుతున్నది.
జీవరసాయన ఆయుధాలను తయారు చేస్తున్నారన్న నెపంతో యుద్ధ నేరాలకు సద్దాం హుస్సేన్‌ను బాధ్యుడిగా చేస్తూ అతడిని అమెరికా ఉరి తీయించింది. ఓ పాలకుడిని హత మార్చినంత మాత్రాన ప్రపంచమంతా శాంతి పవనాలు వీస్తాయని ఆశించటం అవివేకపు ఆలోచన. అలా అయితే జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని పాలన అంతమయ్యాక యావత్ ప్రపంచంలో ఎందుకు శాంతిసామరస్యాలు వెల్లివిరియలేదు? అదేవిధంగా ఐరాస స్థాపన తర్వాత ప్రపంచం శాంతియుత సమాజంగా ఎందుకు మారలేదు? నాటినుంచి నేటివరకు పలుదేశాల మధ్య జరిగిన యుద్ధాలను ఐరాస ఎందుకు నివారించలేకపోయింది?
గత రెండేండ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. రెండు దేశాల్లోనూ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నది. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన హమాస్-ఇజ్రాయెల్ పోరు క్రమంగా పశ్చిమాసియా అంతటా విస్తరిస్తున్నది. ఇప్పటికే వేలమంది పిల్లలు, మహిళలు, వృద్ధులు మరణించారు. వారంతా యుద్ధంతో సంబంధం లేనివారే.
ఓ పక్క ఆయుధాలు విక్రయిస్తూ, మరో పక్క ప్రపంచ శాంతి అంటూ నీతి వాక్యాలు వల్లిస్తున్న దేశాలు, ప్రపంచంపై ఆధిపత్యం కోసం స్వార్థపు ఆలోచనలు చేస్తున్నన్ని రోజులు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి దేశాలతో ప్రపంచానికి ఎప్పటికైనా ప్రమాదమే. యుద్ధం ఇంకా మిగిలే ఉంది. రాబందుల రెక్కల చప్పుడు మరుభూమిలో వినిపిస్తూనే ఉంది. ఈ రోజు పశ్చిమాసియా దేశాలు కావచ్చు, ఇంకో రోజు మరో దేశం కావచ్చు యుద్ధం కౌగిట్లో నలిగిపోవడానికి. బాధితులు మాత్రం ఎన్ని తరాలైనా సామాన్యులే. యుద్ధం అనేది నీలో నీ కోసం నిన్ను మార్చుకోవడానికి జరగాలి. అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది.
(2024, అక్టోబర్ 7తో ‘హమాస్-ఇజ్రాయెల్’ యుద్ధానికి ఏడాది)
– డాక్టర్ మహ్మద్ హసన్ 99080 59234