Old is gold అన్న పాత సామెతను నిజం చేస్తూ ఈ పాత అంగీ ఇంతకాలం వదలకుండా నన్నంటిపెట్టుకునే వున్నది తాను వదలకుండా వున్నదా, నేను వదలకుండా వున్నానా? అదొక పెద్ద ప్రశ్న? కాలేజీ రోజుల్లోనే మా మధ్య అల్లుకున్న బంధం చదువు పూర్తయి ఉద్యోగం దొరికినా, పెళ్లయి పిల్లల తండ్రినయ్యాక కూడా వదలక నా ఒంటిని అంటిపెట్టుకునే వుంది! సంవత్సరాలు దాటినా ఒక్క చిరుగు లేదని, కాంతి తగ్గ లేదని నా వాదన సమయాన్ని బట్టి పొట్టిగా, పొడవుగా మారుతుంది నాలాగే ఒదిగి వుండే గుణం ‘ఇంకెంతకాలం వుంచుకుంటావ్, వదిలెయ్యి దాన్ని’ అని ఇంటావిడ మందలించినపుడో, అరచినపుడో, విసుగుతో చిరాకు పడుతున్నపుడో నాకనాలనిపిస్తుంది ‘నీకంటే ముందే దీన్ని కట్టుకున్నాను, దీన్ని వదిలేస్తే, తరువాత నీ వంతు వస్తుందేమోనని భయం’ అన్నాను. అర్థం కాని చూపులతో నన్నొక పాత అంగీలా తీసి పారేస్తుంది ఐనా కొక్కానికి పాత అంగీ, మంచానికి నేను అతుక్కుపోయే వుంటాము! ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాటలా అవసరానికి ఒక్కటవుతాం అడవులు తిరిగినా, కొండలు, గుట్టలెక్కినా పాత అంగీ నా తోడుగానే ఉండాలి నా వొంటి మీదున్నంత సేపు ఎంతో ధైర్యం. అడవిలో ముళ్లపొదల నుంచి, నగరంలో ధూళి, మురికి నుంచి కాపాడే రక్షణ కవచం అది…