బీజేపీని భారతీయ జిమ్మిక్కుల పార్టీ అని పిలవడం సబబుగా ఉంటుందేమో! ఎందుకంటే నమ్మిన ప్రజలను నట్టేట ముంచి అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో వడ్డించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి. గడచిన ఎనిమిదేండ్లుగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏదో ఒక జిమ్మిక్కు ప్రదర్శించి నెగ్గుకు రావాలని చూస్తున్నది. మత విద్వేషాలను, భావోద్వేగాలను రెచ్చ గొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నది. మునుగోడు ఎన్నికల్లోనూ అదే పని చేస్తున్నది. ఓటర్లారా… బీజేపీతో జర జాగ్రత్త!
2014కు ముందు ఆయన భారతదేశంలోని ఒక రాష్ర్టానికి (గుజరాత్) ముఖ్యమంత్రి. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మతతత్వ పార్టీ అయిన ‘బీజేపీ’ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి. అంతే, అవకాశం దొరికింది, కాదు కాదు ఆయనే లాక్కున్నారు! అప్పటికే కేంద్రంలోని కాంగ్రెస్ పాలన తీరుతో విసిగి వేసారి ఉన్న ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీన్ని పసిగట్టిన ఆ 54 అంగుళాల ఛాతీ గల పెద్ద మనిషి ‘గుజరాత్ నమూనా’ పేరుతో దేశం ముందుకు వచ్చారు! దేశమంతా కలియదిరిగారు. తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు.
ఆ తియ్యని మాటలకు దేశ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆయన గారిని దేశానికి దొరికిన మహా పురుషుడు అనుకున్నారు (ఆయన మాటల్లో ఉన్న ‘మహిమ’ అలాంటిది మరి!). ఆ తియ్యని మాటలకు మోసపోయిన ప్రజలకు ఎనిమిదేండ్లు గడిస్తే కానీ ఆయన అసలు రూపం ఏమిటో అర్థం కాలేదు. ప్రధాని మోదీ అవతార పురుషుడేం కాదని, ఆయన మాటల్లో ఉన్న ఆదర్శాలు, ప్రణాళికలు చేతల్లో లేవని గుర్తించారు. కానీ, ఈ లోపు దేశానికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ఆ నష్టాన్ని ఆలస్యంగానైనా ఓటర్లు గుర్తించారు. దేశంలో ఎక్కడ ఎన్నికల రూపంలో అవకాశం దొరికినా తమదైన శైలిలో బీజేపీకి, ప్రధాని మోదీకి సురుకు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు మరోసారి ’మునుగోడు’ రూపంలో అ అవకాశం దొరికింది. ఇక్కడా బీజేపీకి సురుకు తప్పదని గత కొన్ని రోజులుగా ప్రజాభిప్రాయాలు వింటున్న నాకు అర్థమైంది.
నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి పార్లమెంటులో అడుగు పెట్టే ముందు సభా ద్వారానికి ప్రణమిల్లారు. ‘అబ్బో … రాజ్యాంగం పట్ల, భారత ప్రజాస్వామ్యం పట్ల ఇంతటి సంస్కారం, గౌరవం ఉన్న నాయకుడిని మేం ఇప్పటివరకు చూడలేదు’ అని బీజేపీ నాయకులూ, ఆ పార్టీ కార్యకర్తలు భజన కీర్తనలు అందుకున్నారు. కానీ ఆ తర్వాత అసలు కథ మొదలైంది. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను కమలం పార్టీ గాలికి వదిలేసింది. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. పైగా ధరలు పెరిగాయి. నిరుద్యోగం తాండవిస్తున్నది. మత విద్వేషాలు పెచ్చుమీరాయి. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింది. రాజకీయ క్షక్ష సాధింపులకు ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. రాజ్యాంగాన్నే మార్చేయాలని చూస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు దేశాన్ని అథ:పాతాళంలోకి నెట్టివేశాయి. 2016 నవంబర్ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేశారు. నోట్ల రద్దు వల్ల అవినీతి అంతం అవుతుందని, నల్ల ధనం బయటకు వస్తుందని ప్రగల్భాలు పలికారు. ఆయన మాటలు విని బీజేపీ నాయకులు జబ్బలు చరుచుకున్నారు. ఆహా మోదీ… ఓహో మోదీ అంటూ భజనలు చేశారు. ప్రజలు కూడా మోదీ మాటలు నమ్మారు. కానీ ప్రధాని చెప్పిన లక్ష్యాన్ని పెద్ద నోట్ల రద్దు సాధించలేదు. పైగా ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసింది.
ఏటీఎంల దగ్గర ప్రజలు క్యూ లైన్లలో నిలబడి కుప్పకూలిపోయారు. కానీ అపర కుబేరుల వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న నల్ల ధనం మాత్రం తెల్ల ధనంగా మారిపోయింది. ఇక జీఎస్టీ ప్రవేశ పెట్టడం వల్ల సూక్ష్మ, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు దెబ్బ తిన్నాయి. రాష్ర్టాల ఆదాయం తగ్గిపోయింది. మొత్తమ్మీద రాష్ర్టాలు తప్పకుండా కేంద్రంపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించలేకపోతున్నాయంటే, దానికి కేంద్రమే కారణం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
దేశ ప్రజల కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ కంటే ఎక్కువగా దేశంలోని ఒక్క శాతం అపర కుబేరులకు మోదీ సర్కారు దేశ సంపదను దోచి పెడుతున్నది. కార్పొరేట్ కంపెనీలకు అనేక రాయితీలు ఇస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ప్రైవేటీకరణను వేగవంతం చేసింది. ఆశ్రిత పెట్టుబడి దారీ విధానాలు అవలంబిస్తూ పేదలను మరింత పేదలుగా మారుస్తున్నది. ‘నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంద’ంటారు. అందుకే దేశానికి జరగాల్సిన నష్టం ఎన్నడో జరిగిపోయిందని ప్రజలను కొత్తగా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నాయకులు.
గత పాలకులతో పోలిస్తే మోదీ పాలనలో దేశం ఆవ గింజంత కూడా అభివృద్ధి చెందలేదు. ప్రధాని మోదీ అవలంబిస్తున్న అభివృద్ధి వ్యతిరేక విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్ల దేశం వందేండ్లు వెనక్కి వెళ్లిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పనితీరు పట్ల దేశమంతా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బీజేపీ అసత్యాలు పలుకుతూ విష ప్రచారాలు సాగిస్తున్నది. ప్రజల మధ్యన ప్రత్యేకంగా యువతలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ తమాషా చూస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ చేసే జిమ్మిక్కుల్లో మునుగోడు ప్రజలు చిక్కుకోవద్దని మరోసారి సవినయంగా మనవి చేస్తున్నా.
(వ్యాసకర్త: చొప్పదండి శాసనసభ్యులు)
బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తీసుకున్న అతి పెద్ద అనాలోచిత నిర్ణయం – రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు తీసుకురావడం. ఈ చట్టాలపై దేశమంతా నిరసన వ్యక్తమైంది. రైతులు సుమారు ఏడాదిన్నర పాటు తమ నిరసనలు తెలియజేశారు. ఈ నిరసనల్లో వందలాది రైతులు అమరులయ్యారు. దీంతో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరింది.
సుంకె రవిశంకర్