బీహార్ ఓటర్ల జాబితాను సవరించడానికి ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కసరత్తుపై రాజకీయ దుమారం చెలరేగిన విషయం విదితమే. నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజెన్‌ను (ఎన్ఆర్సీ) ఎన్నికల సంఘం దొడ్డిదారిన అమలు చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్.శ్రీనివాసన్ ‘టాకింగ్ సెన్స్ విత్ శ్రీని’ పేరిట ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల తొలగింపు, సమాఖ్యవాదం, పారదర్శకత, పౌరసత్వం పట్ల ఈ కసరత్తు లేవనెత్తుతున్న ఆందోళనలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు తరలిపోయినవారు, నకిలీ ఓట్లను తొలగించడానికి సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితాలో సవరణలు చేస్తుంటుంది. ఇది నిరంతరంగా లేదా ఎన్నికల సమయంలో జరిగే సర్వసాధారణ ప్రక్రియ. అయితే బీహార్‌లో జరుగుతున్నది ఇందుకు భిన్నంగా ఉన్నది. ఇది ఓటర్ల జాబితాను సవరించే సాధారణ ప్రక్రియ కాదు, ఎస్ఐఆర్ పేరిట జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన. ఇది కొత్త ప్రక్రియ, ఆందోళనకరమైనది కూడా.
చివరిసారిగా 2023లో ఓటర్ల జాబితాలో సవరణలు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఒక సంవత్సరం తర్వాత, అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా ప్రత్యేక కసరత్తును ఈసీ ప్రారంభించింది. అంతేకాదు, ఒక్క నెలలోనే పూర్తి చేస్తామంటున్నది. అంటే దాదాపు ఎనిమిది కోట్ల మంది ఓటర్లు అతి తక్కువ సమయంలో తమను తాము ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అందువల్లే ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం ఓటర్ల జాబితా సవరణ కాదని, ఓటర్ల జాబితా పునర్నిర్మాణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ ఇచ్చిన సమయం విడ్డూరంగా ఉన్నది. సీమాంచల్ ప్రాంతంలోని అనేక జిల్లాలు వరదలో మునిగిపోయాయి. చాలామంది నిరాశ్రయులయ్యారు. అక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అందుబాటులో ఉంటారని, సహకరిస్తారని ఆశించడం అత్యాశే.
బీహార్‌కు చెందిన సుమారు రెండు కోట్ల మంది ప్రజలు దేశంలోని ఇతర రాష్ర్టాల్లో వలస కూలీలుగా పని చేస్తున్నారు. అలాంటివారు ఎక్కడికక్కడ తమ వివరాలను సమర్పించాలని ఈసీ ప్రకటించింది. అయితే ఆ ప్రకటనలను వలస కార్మికులు చూశారా, లేదా? ఒకవేళ చూసినా అర్థం చేసుకున్నారా? ఎలాంటి పత్రాలు కావాలో వారికి తెలుసా? అనేది సందేహమే.
2003 తర్వాత ఓటరుగా నమోదు చేసుకున్నవారు తమ జనన, తల్లిదండ్రుల పౌరసత్వ రుజువును కూడా సమర్పించాలనడం అతిపెద్ద సమస్య. ఇది సాధారణ ఓటరు జాబితా సవరణను పౌరసత్వ ధ్రువీకరణ ప్రక్రియగా మారుస్తున్నది. ఈ కసరత్తు ఓటర్లను చేర్చడానికా, లేదా మినహాయించడానికా అన్నది అసలు ప్రశ్న. ఒకసారి భారత ఎన్నికల ప్రాథమిక సూత్రాన్ని చూద్దాం. భారతదేశంలో జన్మించి, 21 ఏండ్లు పైబడిన (ఇప్పుడు 18 ఏండ్లు) ఎవరైనా ఓటు వేసే అవకాశం 1950లలో ఉండేది. 1987లో అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1987 జూలై 1 తర్వాత జన్మించినవారు ఓటరుగా అర్హత సాధించాలంటే, తమ తల్లిదండ్రుల్లో ఒకరైనా భారతీయులై ఉండాలని చట్టాన్ని సవరించింది. తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై, మరొకరు అక్రమ వలసదారులు కాకూడదని వాజపేయి ప్రభుత్వం మరో సవరణ చేసింది. దానివల్ల 2003లో ఖరారు చేసిన జాబితా ఇప్పుడు బెంచ్‌మార్క్‌గా మారింది. అందువల్ల 2003కి ముందు ఓటరుగా నమోదు చేసుకున్నవారు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, ఆ తర్వాత నమోదు చేసుకున్నవారు 11 పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాంటి ఓటర్లు బీహార్‌లో సుమారు 3.8 కోట్ల మంది ఉండొచ్చని అంచనా.
ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను గుర్తింపు పత్రాల జాబితా నుంచి మొదట మినహాయించడం చర్చనీయాంశం. పేదలు, శ్రామికులు, వలస కార్మికుల వద్ద ఉండే గుర్తింపు పత్రాలు ఇవే. బీహార్‌లో చాలా తక్కువ మంది వద్ద జనన ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, పైన పేర్కొన్న పత్రాలను ఈసీ పరిగణించాలని న్యాయస్థానం సూచించిందే తప్ప, ఆదేశించకపోవడం గమనార్హం. ఈ కసరత్తును అత్యంత వేగంగా చేయడంపై కూడా అనేక సందేహాలున్నాయి. జర్నలిస్టు అజిత్ అంజుమ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అందులో బూత్ స్థాయి అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని ఓటర్ల తరఫున ఫామ్స్ నింపుతున్నట్టు కనిపించింది. వారు ఇంటింటికి వెళ్లి ధ్రువీకరించడం లేదు. వారి వద్ద ఉన్న పాత జాబితాలోని వివరాలను ఫామ్స్‌లో నింపుతున్నారు.
బీఎల్వోలకు అసాధ్యమైన పనిని అప్పగించారు. ఒక్క నెలలోనే దాదాపు 8 కోట్ల మంది ఓటర్లను ధ్రువీకరించడం చాలా కష్టం. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఈ ఫామ్స్ వేటికి సంబంధించినవో కూడా తెలియదు. ఇప్పటికే 30 లక్షల మంది పేర్లను తొలగించినట్టు ఈసీ చెప్తున్నది. ఫామ్స్ ముద్రణ, పంపిణీ, మళ్లీ సేకరణ, వివరాల అప్లోడ్.. ఇదంతా చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రక్రియ లోపభూయిష్ఠంగా, మోసపూరితంగా జరిగి ఉండవచ్చని ఎస్ఐఆర్ వేగం మనకు సూచిస్తున్నది. భారతదేశంలో ఆధార్‌ను గుర్తింపు పొందిన ధ్రువపత్రంగా ప్రభుత్వం మొదటినుంచీ చెప్తూ వస్తున్నది. పాన్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్లు, ఫోన్ నెంబర్లు, ఓటర్ల జాబితాతో కూడా దీన్ని లింకు చేశారు. ఓటర్ ఐడీకి ఆధార్‌ను లింకు చేయాలని గతంలో ఈసీ పట్టుబట్టింది కూడా. అయినప్పటికీ ఈ కసరత్తులో ఆధార్‌ను మినహాయించారు. ఆధార్‌ను ఇప్పుడు నమ్మదగనిదిగా భావిస్తే.. మన దైనందిన జీవితంలోని అనేక అంశాల్లో దాన్ని ఎందుకు తప్పనిసరి చేశారు?
వలసదారులను గుర్తించడం ఎన్ఆర్సీ ఉద్దేశం. ప్రస్తుతం అది అసోంలో మాత్రమే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించినప్పటికీ, తీవ్ర వ్యతిరేకత కారణంగా దాన్ని ఇంకా నోటిఫై చేయలేదు. వాస్తవానికి ఈసీకి పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం లేదు. ఓటర్లను నమోదు చేయడమే దాని పని. జనన ధ్రువీకరణ, తల్లిదండ్రుల పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను అడగడం ద్వారా తనకు సంబంధం లేని అంశంలో ఈసీ వేలు పెడుతున్నది. అందుకే, మరొక పేరుతో ఈసీ పరోక్షంగా ఎన్ఆర్సీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నదనే భయాందోళనలు కలుగుతున్నాయి.
బీహార్‌లో జరుగుతున్నది ఎస్ఐఆర్ పైలట్ ప్రాజెక్టు అని ఈసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తమిళనాడు వంటి రాష్ర్టాలు తర్వాతి స్థానంలో ఉండొచ్చు. ఇది ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’కు నాంది కావచ్చనే చర్చ కూడా జరుగుతున్నది. వాస్తవానికి ఓటర్ల జాబితాలను సాధారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్లు రూపొందిస్తాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సమాఖ్యవాదం పట్ల కూడా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రక్రియపై తమ అభిప్రాయాలను చెప్పడానికి రాష్ర్టాలకు అవకాశం ఉంటుందా? రాష్ర్టాల అభ్యంతరాలను వింటారా? అన్నది ప్రశ్నార్థకమే.
ఓటర్ల జాబితా నుంచి ఎవరూ మినహాయించకుండా చూసుకోవడం ఈసీ విధి. మన దేశంలో ఒక వ్యక్తి ఓటరుగా అర్హుడా, కాదా? అన్నది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మొదటినుంచీ పౌరులది కాదు. కానీ, ఇప్పుడు పౌరులే నిరూపించుకోవాల్సి వస్తున్నది. ఇది ప్రజాస్వామ్య సూత్రాల ప్రమాదకరమైన విలోమ పరిణామం. ఇది సార్వత్రిక ఓటుహక్కు తత్వాన్ని బలహీనపరుస్తుంది. మనల్ని అనుమానం, బహిష్కరణ వైపునకు నడిపిస్తుంది.
నిష్పాక్షికత, అందర్నీ కలుపుకొనిపోయే విధానం గురించి ఈసీ ఇప్పటివరకు గర్వంగా చెప్పుకొనేది. కానీ, కొన్నేండ్లుగా ఈసీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఎన్నికల కమిషనర్ల ఎంపిక మొదలుకొని చిహ్నాల కేటాయింపు, ప్రచార సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలపై చర్యల వరకు అన్ని నిర్ణయాలు వివాదాస్పదమే. తాజాగా చేపట్టిన ఎస్ఐఆర్ కసరత్తుతో దాని ఇమేజ్ మరోసారి దెబ్బతిన్నది. గతంలో ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఈసీ సభ్యులను ఎంపిక చేసేది. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి స్థానాన్ని కేంద్ర హోం మంత్రి భర్తీ చేశారు. ప్రతిపక్షానికి బదులుగా ఇద్దరు కార్యనిర్వాహక సభ్యులతో ప్యానెల్‌ను నింపేశారు. ఇది ఈసీ పట్ల ప్రజా విశ్వాసాన్ని తగ్గించింది. తాజా కసరత్తు ఈసీకి నిజమైన అగ్నిపరీక్ష. ఈసీ తన విశ్వసనీయతను పునరుద్ధరించుకోవాలంటే పారదర్శకత దిశగా సాహసోపేత చర్యలు తీసుకోవాలి.