‘చొరబాటుదారులు నా దేశ యువత జీవనోపాధిని లాక్కుంటున్నారు’ అని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. తద్వారా ఆయన చొరబాట్ల అంశాన్ని మరోసారి జాతీయ చర్చాంశంగా మార్చేశారు. అయితే, ఈ ఆరోపణలు కఠిన వాస్తవాల కంటే ఊహాజనిత అభూత కల్పనపైనే ఆధారపడి ఉన్నాయని చాలా మంది జనాభా లెక్కల డేటా విశ్లేషకులు అంటున్నారు.
బంగ్లా నుంచి వచ్చే వలసదారులు, రోహింగ్యాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జరిపే అణచివేతల్లో కొందరు భారతీయులు కూడా బాధితులుగా మారినట్టు పలు నివేదికలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చొరబాటుదారుల గుర్తింపు పేరిట అట్టడుగు వర్గాలపై వేధింపులు మరింత ఎక్కువవుతాయని సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల నేతలు భయపడుతున్నారు. ప్రధాని మోదీ ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయని, ఆయన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎలాంటి ఆధారాలు లేవని ‘ప్రతీచి’ ట్రస్ట్ సీనియర్ కోఆర్డినేటర్ సబీర్ అహ్మద్ చెప్పడం గమనార్హం. ఈ ట్రస్ట్‌ను 1999లో నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ స్థాపించారు.
పశ్చిమ బెంగాల్లో భారీగా చొరబాట్లు జరిగినట్టు బీజేపీ ఆరోపిస్తుండగా, ఆ రాష్ట్ర జనాభా స్థిరంగా పెరిగినట్టు జనగణన డేటా విశ్లేషణల ద్వారా తెలుస్తున్నది. 1951లో దేశంలో జరిగిన మొట్టమొదటి జనగణనలో బెంగాల్ రాష్ట్ర జనాభా 2.63 కోట్లు కాగా, వారిలో ముస్లింలు 52 లక్షల మంది. ఇది ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో 19.85 శాతం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్రంలో 9.13 కోట్ల మంది ఉండగా, ముస్లింల జనాభా 27.01 శాతానికి పెరిగి, మొత్తం 2.47 కోట్లకు జనాభా చేరింది. 1951 నుంచి 2011 వరకు ముస్లింల జనాభా సగటు వార్షిక పెరుగుదల రేటు 2.52 శాతం. 2011 జనగణన ప్రకారం ఆ రాష్ట్రంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు ఒక్కో మహిళకు 2.2 మంది పిల్లలు. సగటు వార్షిక పెరుగుదల రేటు, సంతానోత్పత్తి రేటు దాదాపు సమానంగా ఉన్నందున, స్పల్ప పెరుగుదలను చొరబాట్లకు ఆపాదించడం సరికాదు.
పశ్చిమ బెంగాల్లో ముస్లింల దశాబ్దాల జనాభా వృద్ధిరేటును పరిశీలిస్తే, ఆ రాష్ట్రం చొరబాటుదారులతో నిండిపోయిందనే సిద్ధాంతం తప్పని నిరూపితమవుతుంది. 1991-2001 దశాబ్దిలో ఆ రాష్ట్ర ముస్లింల జనాభా వృద్ధిరేటు 1.64 కాగా, ఆ తర్వాతి దశాబ్దిలో అది స్వల్పంగా తగ్గి 1.61కి చేరుకున్నది. దేశానికి స్వాతంత్య్రానంతరం జరిగిన భారీ వలసల కారణంగా 1951-61 మధ్య దశాబ్దిలో బెంగాల్ జనాభా వృద్ధిరేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నది. క్రమంగా తగ్గుతూ 1971 నాటికి ఇది దేశ సగటుకు దరిదాపుల్లోకి వచ్చింది. 1981 తర్వాత బెంగాల్ జనాభా వృద్ధిరేటు క్రమంగా తగ్గుతూ, జాతీయ సగటు కంటే తక్కువైంది. 2011లో ఈ అంతరాన్ని స్పష్టంగా చూడవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ దశాబ్ది వృద్ధిరేటు 13.84 శాతమే. ఇది జాతీయ సగటు 17.7 శాతం కంటే చాలా తక్కువ. అయితే, గత జనగణనలో బెంగాల్లో దాదాపు 22 లక్షల మంది తమ స్వస్థలం బంగ్లాదేశ్ అని పేర్కొనగా, వారిలో అత్యధికులు హిందువులే. ఇక అసోం విషయానికి వస్తే, 1951లో ఆ రాష్ట్ర జనాభాలో ముస్లింల శాతం 24.86 శాతం. ఇది 2011 నాటికి 34.22 శాతానికి పెరిగింది. వార్షిక వృద్ధిరేటు 0.544 శాతం. 1991లో 23.01 శాతంగా ఉన్న అసోం జనాభా దశాబ్ది వృద్ధిరేటు, 2011లో 16.93 శాతానికి పడిపోయింది. ఒకవేళ భారీగా చొరబాట్లు జరిగి ఉంటే, ఈ స్థాయిలో వృద్ధిరేటులో తగ్గుదల కనిపించదు.
స్వాతంత్య్రానంతర దశాబ్దాల్లో బెంగాల్, అసోంల జనాభా వృద్ధిరేటు జాతీయ సగటు కంటే అధికంగా ఉన్నది. ఆ సమయంలో భారీగా వలసలు జరగడమే అందుకు కారణం. అసోంలో 1911-21, 1951-61 మధ్యకాలంలో అసాధారణ పెరుగుదల నమోదైంది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఎక్కువ ఆహార ధాన్యాలు పండించాలన్న బ్రిటిష్ పాలకుల పాలసీలో భాగంగా భూముల్లేని బెంగాలీ ముస్లింలను వ్యవసాయం చేసేందుకు అసోంకు తరలించారు. 1950లలో తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో జరిగిన మత కల్లోలాల కారణంగా అసోం, బెంగాల్‌కు చాలామంది వలస వచ్చారు. జనాభా లెక్కల్లో ఇది స్పష్టమైంది ప్రధాని ఆరోపణలు ఆధార రహితమైనవని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే వీటిని తెరపైకి తీసుకువస్తున్నారని ఈ గణాంకాలను బట్టి పలువురు విమర్శిస్తున్నారు.
ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్టు-2024’ ప్రకారం.. 2011లో 61 శాతంగా ఉన్న భారత శ్రామిక శక్తి (పని చేస్తున్న జనాభా) 2021 నాటికి 64 శాతానికి పెరిగింది. 2036 నాటికి ఇది 65 శాతానికి చేరుకుంటుందని అంచనా. అయితే, 2022లో పనిచేసే యువ జనాభా మాత్రం 37 శాతానికి పడిపోవడం గమనార్హం. ఆయుర్దాయం పెరగడం, సంతానోత్పత్తి రేటు తగ్గుదల కారణంగా దక్షిణాది రాష్ర్టాలు వృద్ధ జనాభా పెరుగుదల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఉత్తరభారత్ నుంచి దక్షిణాదికి భారీ వలసలకు ఇది దారితీసింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయబోయే జనాభా కమిషన్ ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలను కాకుండా, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషిచేయాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు.
(‘ది ఫెడరల్’ సౌజన్యంతో..)
– సమీర్ కె.పుర్కాయస్థ