మొదట విదేశాంగ కార్యదర్శిగా, ప్రస్తుతం విదేశాంగశాఖ మంత్రి గా ఉన్న ఎస్.జైశంకర్ సాయంతో భారత విదేశాంగ విధానాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ జరిపిన తీవ్ర ప్రయత్నాలు విఫలమయ్యాయి. అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మోదీ ట్రంప్‌తో వ్యక్తిగత స్నేహాన్ని పంచుకున్న భావన కలిగించారు. అయితే, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదం ట్రంప్ విజయానికి దోహదపడలేకపోయింది. కానీ, 2025లో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచినప్పటికీ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం రాలేదు. మోదీకి ఆహ్వానం తెప్పించేందుకు మంత్రి జైశంకర్‌ను అమెరికాకు పంపారు. అయినా, అనుకున్నట్టు జరుగకపోగా, మోదీ స్థానంలో జైశంకర్కే ఆహ్వానం అందింది.
అంతేకాకుండా, ట్రంప్ తన ప్రసంగంలో భారత దిగుమతులపై మరింత టారిఫ్ విధించనున్నట్టు, గ్రీన్‌కార్డును శాశ్వత నివాస హక్కుగా పరిగణించబోమని స్పష్టంగా చెప్పేశారు. దీంతో ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గించేందుకు, ముఖ్యంగా టెస్లా కార్లపై సుంకాలను భారీగా తగ్గించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం భారతీయ ఆటోమొబైల్ కంపెనీలైన మహీంద్రా, టాటా, మారుతి వంటివాటిపై ప్రభావం చూపనున్నది. మన దేశం అమెరికాతో వాణిజ్య మిగులును కలిగి ఉన్నది. కొత్త ఒప్పందాల కారణంగా అది కాస్తా లోటుగా మారొచ్చు.
ట్రంప్‌ను శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా మోదీ అమెరికా పర్యటనకు ముందు ఆర్థికమంత్రి నిర్మల హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 50 శాతం, టెస్లా కార్లపై 85 శాతం తగ్గించారు. ఈ ఏడాది నుంచి భారత దేశానికి ‘మిలటరీ సేల్స్’ (రక్షణ ఉత్పత్తులు)ను అనేక బిలియన్ డాలర్లకు పెంచనున్నట్టు ట్రంప్ చెప్పారు. దీన్ని కూడా అశుభసూచకంగానే భావించాలి. ఈ ఒప్పందాల పర్యవసానాలు భారత ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాగే, ఎఫ్-16 విమానాల నిర్వహణ కోసం పాకిస్థాన్‌కు 397 మిలియన్ డాలర్లు కేటాయించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. మోదీ దౌత్య సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నది. భారత భద్రతకు ప్రమాదం కలిగించే పాకిస్థాన్‌కు సహాయం చేయాలనే అమెరికా నిర్ణయంపై నిరసన తెలియజేసే ధైర్యం కూడా మోదీకి లేకుండాపోయింది.
ఏప్రిల్ 2 నుంచి పరస్పర టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఇది భారత జీడీపీ వృద్ధి రేటును 0.5 శాతం నుంచి 0.6 శాతం వరకు దెబ్బతీయవచ్చు. అంతేకాకుండా, అమెరికా నుంచి ఎఫ్-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తే, భారతదేశంలోని స్వదేశీ తయారీ తేజస్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉన్నది. రష్యా భారత్‌లోనే ఎస్‌యూ-57 యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉండగా.. మోదీ మాత్రం అమెరికా వైపు మొగ్గు చూపడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమనే చెప్పాలి. అమెరికా నుంచి మక్కజొన్న, సోయాబీన్ల దిగుమతులను పెంచేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటే, భారతీయ రైతులు తట్టుకోలేరు. దిగుమతి సుంకాలను తగ్గిస్తే, భారత వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుంది. అమెరికా కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారతదేశం 100 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నది. ఇది అన్యాయం. ఏప్రిల్ 2 నుంచి భారత్ మాకు ఎంత పన్ను వేస్తే, మేమూ అంతే పన్ను వేస్తాం’ అని తీవ్రంగా హెచ్చరించారు.
ట్రంప్ ముందు మోదీ పూర్తిగా తలొంచినట్టు కనిపించారు. దీంతో ‘భారత్ ఫస్ట్’, ‘జాతీయ ప్రయోజనాలు ఫస్ట్’ అనే నినాదాలు నిస్సారంగా మారిపోయాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2005లో ఇండియా-అమెరికా డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ కుదిరింది. దీనిద్వారా సీ-130 జే, సీ-17 గ్లోబ్ మాస్టర్ వంటి రక్షణ కొనుగోళ్లను భారత్ సాధించింది. అలాగే, 2008లో జరిగిన ఇండో-అమెరికా సివిల్ న్యూక్లియర్ ఒప్పందం అణుశక్తి రంగంలో భారత దేశానికి పెద్ద మైలురాయి అయింది. కానీ, మోదీ ప్రభుత్వం అమెరికా వాణిజ్య ఒత్తిళ్లకు లొంగిపోవడంతో, దేశ భద్రతా ప్రయోజనాలు, ఆర్థిక భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మోదీ, ఆరెస్సెస్ థింక్ ట్యాంక్ కలిసి ప్రభుత్వానికి కొత్త వ్యూహాన్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది. అర్థవంతమైన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న విదేశాంగ విధానాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– వెంకట్ పర్సా