ఢిల్లీ ప్రజలు సగటున రోజుకు అరపెట్టె సిగరెట్లు తాగుతున్నారట. ఇదేదో పొగతాగే అలవాటుపై తీసిన లెక్క కానేకాదు. కాలుష్యం వల్ల మనుషులపై పడుతున్న ప్రభావాన్ని సిగరెట్లు కొలమానంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వేసిన అంచనా. అయితే కాలుష్యం అనేది కేవలం ఢిల్లీ సమస్య అనే అపోహ చాలావరకు వ్యాపించింది. ప్రస్తుతం చాప కింద నీరులా కాలుష్య భూతం దేశమంతటినీ కమ్మేస్తున్నది. మరీ ముఖ్యంగా మన రాజధాని నగరమైన హైదరాబాద్ కాలుష్యంలో అంగలు వేస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
జనవరి 1న నూతన సంవత్సర వేడుకల్లో కాల్చిన టపాసుల పొగ, చలికాలపు మంచుతో కలిసి స్మాగ్గా ఏర్పడి నగరంపై ముసుగు కప్పేసింది. పొడి ప్రాంతం మధ్యలో ఉండే హైదరాబాద్లో ధూళి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అందులో వాహనాల కాలుష్యం కూడా వచ్చి చేరితే గాలి నాణ్యత పడిపోతుంది. సూక్ష్మ ప్లాస్టిక్ కణాలూ వచ్చి చేరుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
హైదరాబాద్లో నమోదవుతున్న వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ)లు ’అబ్ దిల్లీ దూర్ నహీ’ అని హెచ్చరిస్తున్నాయి. ఏక్యూఐ బాగుంది (0-50), మధ్యస్తం (51-100) నుంచి బాగాలేదు (101-150) స్థాయికి పడిపోయి చాలాకాలమైంది. అప్పుడప్పుడు అనారోగ్యకరం (151-200) క్యాటగిరీలోకి వెళ్లివస్తుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మామూలుగా అయితే ఏక్యూఐ 100 దాటితే చిన్నపిల్లలు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవాళ్లు బయటకు వెళ్లరాదని, వెళ్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిపుణుల సూచన.
కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల డాటా ప్రకారం హైదరాబాద్లో గత నెల స్థాయి రెండేండ్ల క్రితం నాటి కంటే 64 శాతానికి పైగా పెరిగిపోయింది. అయితే వివిధ సంస్థలు ఉపయోగించే విధానాల ప్రామాణికతను బట్టి ఈ కొలతల్లో తేడాలు వస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య కూడా వ్యత్యాసాలు నమోదు అవుతున్నప్పటికీ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నదనే విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదు.
వాయు కాలుష్యానికి హైదరాబాద్, ఢిల్లీ అనే తేడాలుండవు. ప్రాంతాల సరిహద్దులనూ అది గుర్తించదు. అయినా కాలుష్యం అనగానే నగరాల గురించే ఆలోచిస్తారు. జాతీయ శుద్ధ వాయు కార్యక్రమంలోనూ ఈ నగర కేంద్రక విధానాన్నే అనుసరిస్తారు. ఢిల్లీలో కార్ల వాడకంపై, నిర్మాణ కార్యకలాపాలపై నియంత్రణలు విధించడం మనం గమనించవచ్చు. పంజాబ్ రైతులు వరి కొయ్యలు కాల్చితే వెలువడే కాలుష్యం గురించి కొందరు మాట్లాడుతారు. కానీ, ఢిల్లీ శివార్లలోని థర్మల్ కేం ద్రాల్లో వెలువడే పొగపై నియంత్రణలు లేకపోవడం విడ్డూరం.
కాలు ష్యం ఎక్కడ పుడుతున్నదీ, ఎటు పయనిస్తున్నదీ పరిశీలించి ఎక్కడికక్కడ బిగింపులు వేసే ఎయిర్షెడ్ మేనేజ్మెంట్ ద్వారానే కాలుష్యాన్ని పకడ్బందీగా అరికట్టగలం. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే సాధ్యం. పుష్కర కాలంగా ఢిల్లీ కాలుష్యం మధ్యలో కూర్చుని దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ఈ లక్ష్య సాధనకు ఓ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ దానికి ఎలాంటి కోరలు సమకూర్చలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో శరవేగంగా అనుసంధానం అవుతున్న ’విశ్వగురు’కు ఇది ఏమాత్రం శోభించదు. విశేషించి దేశ రాజధాని కాలుష్య కాసారంలా భుగభుగలాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు.