దేశ ఆర్థిక వ్యవస్థ కొన్నేండ్లుగా మందగమనంలో సాగుతున్నది. అంచనాలను సైతం అందుకోలేక తంటాలు పడుతున్నది. ఈ నత్తనడక ప్రభావం ఎక్కువగా పడేది దేశంలోని మధ్య తరగతి పైనే. అయినప్పటికీ మన మధ్యతరగతి దీనిని నిదానంగా భరిస్తున్నదే తప్ప బహిరంగంగా ఎన్నడూ దీనిపై నోరెత్తింది లేదు. ఎందుకిలా? దేశంలోని మిగతా వర్గాలతో పోలిస్తే ఈ విషయంలో ఎక్కువ ప్రభావితమయ్యేది వారే అయినప్పటికీ ఎందుకని సర్దుకుపోతున్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 6.4 శాతం మాత్రమే నమోదవుతుందని జాతీయ గణాంక కార్యాలయం జనవరి 7న అంచనా వేసింది. ఈసారి వృద్ధిరేటు 6.5 శాతం నుంచి 7 శాతం వరకు ఉం టుందని ఇంతకుముందు వేసిన అంచనాలను దేశం అందుకోవడం కష్టమేనని అభిప్రాయపడింది. గత నాలుగేండ్లతో పోలిస్తే ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. ఈ మందగమనం ఎక్కువగా తయారీ రంగంలోనే కనిపిస్తున్నది. ఫలితంగా ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు క ల్పించాలన్న ప్రయత్నాలకు గండిపడుతున్నది. అయితే, ఈ ఆర్థిక మందగమనం కొంతకాలం పాటు కొనసాగుతుందా? లేదంటే తాత్కాలికమా? అన్న విషయాన్ని పక్కనపెడితే విదేశీ పెట్టుబడుల్లో మందగమనమే ఇందుకు కారణమని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యూబీఎస్ భావిస్తున్నది. అయితే, ఇప్పటివరకు భారత్ చూ సిన అధిక వృద్ధిరేటు కొవి డ్-19 తర్వాత ఆర్థి క వ్యవస్థ పుంజుకోవడం మాత్రమేనని ప్రము ఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెచ్ఎస్బీసీ ఇండి యా ఎకనమిస్ట్ చీఫ్ ప్రం జుల్ భండారీ వాదిస్తున్నారు. భవిష్యత్తులో మనం చూడబోయే వృద్ధి సంఖ్యలు 6.5కు దగ్గరగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డా రు. 1990ల ప్రారం భం నుంచి భారత వృద్ధిరేటు పెరుగుతూ వస్తున్నదని, కాబట్టి ఈ మందగమనంపై ఆందోళన అవసరం లేదన్నది ఆమె వాదన.
ఆర్థిక మందగమనం వల్ల బాధితులుగా మారేది ఎక్కువగా మధ్యతరగతి ప్రజలే. కరోనా మహమ్మారికి ముందు భారత్లో 9.9 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు ఉన్నట్టు అమెరికన్ థింక్ట్యాంక్ ‘ప్యూ’ రీసెర్చ్ సెంటర్ నివేదిక వెల్లడించింది. అయితే, మహమ్మారి ఈ సంఖ్యను మూడోవంతుకు తగ్గించింది. ఈ విషయంలో చైనాతో పోల్చుకున్నప్పుడు మనకంటే జనాభా కొంత తక్కువే అయినప్పటికీ మధ్యతరగతి మాత్రం ఐదు రెట్లు ఎక్కువ. అయినప్పటికీ, మహమ్మారి తర్వాత ఈ సంఖ్యలో కొద్దిగా కూడా మార్పు కనిపించలేదు. మహమ్మారి తర్వాత మనదేశంలోని మధ్యతరగతిలో కొందరు తిరిగి పుంజుకున్నప్పటికీ, ఉద్యోగాల కొరత, అధిక ద్రవ్యోల్బణం వంటి నిరంతర సమస్యలు వేధించాయి. అయితే, జనాభా సంఖ్యతో పోల్చుకున్నప్పుడు ఇవి సమస్యలుగా కనిపించకపోవచ్చు.
మధ్యతరగతి కష్టాలు 2014 వరకు ఆర్థిక వ్యవస్థ దృష్టిని ఆకర్షించాయి. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హయాంలో రూపాయి విలువ దారుణంగా పతనమైంది. అప్పట్లో దీనిపై జోకులు కూడా పేలాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే పాలనలో రూపాయి విలువ మరింత అధ్వానమైంది. అయితే, దేశంలోని మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు ప్రభుత్వంలోని ఓ పార్టీకి విధేయులుగా ఉండటం, దానికి నమ్మకమైన ఓటు బ్యాంకుగా పనిచేస్తుండటంతో ఈ వాస్తవం మరుగున పడింది. ఆర్థిక వృద్ధి మందగమనంలో సాగుతున్నప్పటికీ వారిలో ఆగ్రహం కనిపించకపోవడానికి దీనిని కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. తాము ఇబ్బందులు పడుతున్నప్పటికీ పార్టీపై అభిమానం వారిని బయటపడనివ్వకుండా అడ్డుకుంటున్నది. భారతదేశ నిర్బంధ రాజకీయ వాతావరణం నుంచే ఇది ఉద్భవించింది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఏకీకృతం చేయకుండా అడ్డుకుంటుంది. కాబట్టే ప్రజల్లో అమితమైన అసంతృప్తి ఉన్నప్పటికీ అది రాజకీయ రూపాన్ని సంతరించుకోవడం లేదు.
ఈ మొత్తానికి కారణమైన కేంద్ర ప్రభుత్వంపై దాడిని పక్కనపెట్టేసి నిశ్శబ్దంగా మారిపోయిన మీడియా పాత్ర కూడా ఇందులో కీలకమేనన్నది నిపుణుల మాట. న్యాయవ్యవస్థ, ఇతర సంస్థలు కూడా ఈ నిశ్శబ్దానికి దోహదం చేశాయి. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. 2014 వరకు అవినీతిపై న్యాయ వ్యవస్థ కూడా పోరాడింది. ఆ తర్వాత అది కూడా మెతకవైఖరి అనుసరించిందన్న విమర్శలున్నాయి. మధ్యతరగతి వర్గంలా కాకుండా, దేశంలోని పేదలు తమ భౌతిక ప్రయోజనాల కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, వారికి ఆర్థిక సమస్యను జాతీయ చర్చనీయాంశంగా మార్చే శక్తి లేదు. కాబట్టి మధ్యతరగతి ప్రజలు జోక్యం చేసుకునే వరకు భారతదేశ ఆర్థిక మందగమనంపై ఎలాంటి ఆగ్రహావేశాలు ఉత్పన్నం కావన్నది నిజం.