అమెరికా సంయుక్త రాష్ర్టాలు. ఏకైక అగ్రరాజ్యం పేరు ఇది. అనేక జాతుల సమాహారంగా ఇది విలసిల్లుతున్నది. ‘వలసొచ్చిన వారి దేశం’గా దీనికి మరో పేరున్నది. జర్మనీ నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన ఒక కుటుంబ వారసుడు డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా రెండోసారి జనవరి 20న ప్రమాణం చేయడంతో ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్యంగా, ఉదారవాద రాజ్యంగా అమెరికాకు ఉన్న పేరు మరింతగా బలహీనపడటానికి బలమైన బీజం పడింది. అమెరికా గడ్డపై పుట్టిన వారందరికీ పౌరసత్వం ఇచ్చే (రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన) చట్టాన్ని ట్రంప్ రద్దు చేయడం అమెరికా ఒక దేశంగా అవతరణకు దారితీసిన ప్రజాతంత్ర మానవతా మూల సూత్రాలకు విరుద్ధం.
డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా కిందటేడాది నవంబర్ మొదటి వారంలో ఎన్నికైనప్పటి నుంచీ ప్రపంచ ప్రజల్లో ముఖ్యంగా భారతీయుల్లో ఏర్పడిన భయాందోళనలు నిజమైనవేనని తేలిపోయింది. అమెరికా వచ్చి స్థిరపడేవారిలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న భారతీయులకు ట్రంప్ ఆదేశాలు శరాఘాతంగా మారుతున్నాయి. ప్యారిస్ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, బ్రిక్స్ దేశాల సరుకులపై నూరు శాతం సుంకాల ప్రతిపాదన సహా మొదటిరోజే 26 ఆదేశాలు ట్రంప్ జారీచేసి భయోత్పాతం సృష్టించారు. మొత్తం 42 అధ్యక్ష ‘ఆదేశాల’తో ఇతర దేశాల ప్రజలను బెంబేలెత్తించారు. పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ గతంలో ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేసి కొత్త ‘ఇనుప తెర’ పాలనకు తెరతీశారు. దాదాపు వందేండ్ల క్రితం ట్రంప్ పూర్వీకుల దేశం జర్మనీలో అవతరించిన నియంత అడాల్ఫ్ హిట్లర్ పోకడల దిశగా నేడు అమెరికా పయనిస్తున్నదా?
అనే అనుమానం ఆయన తాజా నిర్ణయాలను బట్టి కలుగుతున్నది. 18వ శతాబ్దం చివరలో మానవాళికి స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువను చాటిచెప్పిన ఫ్రెంచ్ విప్లవానికి స్ఫూర్తినిచ్చిన స్వాతంత్య్ర సమరం సాగిన అమెరికాలోనే ఇలాంటివి జరుగుతున్నాయా? ఇంతటి అమానవీయ నిర్ణయాలకు, చర్యలకు అవకాశాల ‘స్వర్గం’ అమెరికా ఎలా వేదిక అవుతున్నది? అసలు ట్రంప్ నిర్ణయాలు, ఆదేశాలు న్యాయ పరీక్షకు నిలుస్తాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మానవాళి ఆలోచనల రూపురేఖలు మారడానికి దోహదం చేసిన 19వ శతాబ్దపు రాజనీతి తత్వవేత్త కారల్ మార్క్స్ అమెరికా భవితవ్యం గురించి వేసిన అంచనా తప్పేమో అనే సంశయం కలుగుతున్నది. ‘ఎలాంటి చారిత్రక మోతబరువు లేని అమెరికా ఎప్పటికీ మెరుగైన రాజ్యంగా మనగలుగుతుంది. ఐరోపా దేశాలకు అలాంటి అవకాశం లేదు’ అంటూ ఆయన ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
అమెరికా మొదటి నుంచీ ఐరోపా దేశాలకు చెందిన శ్వేత జాతీయుల రాకను ఎక్కువ ఆహ్వానించింది. అమెరికాలో కొన్నేండ్లు నివసించాక శ్వేత జాతేతరులకు పౌరసత్వం పొందే అవకాశం 20వ శతాబ్దం ప్రథమార్థంలో మాత్రమే అనేక న్యాయ పోరాటాల ద్వారా వచ్చింది. భారత సంతతికి చెందిన తొలి వ్యక్తి భగత్‌సింగ్ థిండ్కు సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 1935లో అమెరికా కాంగ్రెస్ శాసనం ద్వారా పౌరసత్వం లభించింది. అయితే, డాక్టర్లు, ఇంజినీర్ల వంటి నిపుణుల అవసరం పెరగడంతో 1965లో ప్రెసిడెంట్ లిండన్ జాన్సన్ పాలనలో ఇతర దేశాల వారి రాకకు అడ్డంకులుగా ఉన్న నిబంధనలను అమెరికా సర్కారు తొలగించింది. అప్పటి నుంచి భారతీయ వైద్యులు, ఉన్నత ప్రతిభాపాటవాలున్న నిపుణులు అమెరికా వెళ్లి స్థిరపడటం వేగం పుంజుకున్నది.
1990ల చివరలో బాగా ఊపందుకున్న ఐటీ విప్లవంతో విదేశీ కంప్యూటర్ సైన్స్ నిపుణులకు అమెరికాలో డిమాండ్ పెరిగింది. దీంతో భారతీయులు పెద్ద సంఖ్యలో అగ్రరాజ్యం పోయి అక్కడ శాశ్వత నివాసం ఉండటానికి హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డ్ చివరికి పౌరసత్వం ఉపయోగపడుతున్నాయి. విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో నాలుగింట మూడొంతులు భారతీయ ప్రొఫెషనల్స్‌కే దక్కడం ఆనవాయితీగా మారింది. అలాగే అమెరికాలోని వందల విశ్వవిద్యాలయాల్లో చదువుకొనే అంతర్జాతీయ విద్యార్థుల్లో సైతం సింహభాగం భారతీయులే కావడంతో అట్లాంటిక్ మహా సముద్రం ఆవల ఉన్న ఈ విశాల దేశం భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి రెండో గమ్యస్థానంగా అవతరించింది. ఎక్కువ మంది హెచ్-1బీ వీసా కింద వెళ్లిన భారతీయులు, ఇతర దేశాల ఉద్యోగుల దంపతులకు గ్రీన్‌కార్డ్ పౌరసత్వం రావడానికి ముందు అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్‌గా పుట్టుకతో (జన్మతః) వచ్చేది. ఇప్పుడు ఈ వెసులుబాటును ట్రంప్ రద్దు చేయడం అమానవీయ చర్యగా పరిగణిస్తున్నారు.
అమెరికా సంపద సృష్టిలో జనాభాలో ఒకటిన్నర శాతం భారతీయుల కృషి ఉన్నది. 1960ల్లో అమెరికా వీసా విధానాలు సరళతరం కావడం నుంచీ ఇప్పటివరకూ ఇండియా నుంచి అమెరికాకు విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్నిరకాల జనం వలసలు పెరగడంతో దాదాపు 35 కోట్లున్న అమెరికా జనాభాలో వారి శాతం 1.47 శాతానికి (దాదాపు 50 లక్షల మంది) పెరిగింది. అమెరికాలో అభివృద్ధి చెందిన రాష్ర్టాల్లో ఒకటైన జార్జియా నగరం అట్లాంటాలోని ప్రతి ఐదుగురు డాక్టర్లలో ఒకరు భారతీయుడు ఉన్నాడంటే భారతీయుల వలసలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.