భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం దేశ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ‘ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, వైద్యు ల సలహా మేరకు’ వైదొలుగుతున్నట్టు ఆయ న తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే, ఈ వాదనను ఎవరూ విశ్వసించడం లేదు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నా యి. ‘దేవుడు మరోలా తలిస్తే తప్ప 2027 ఆగస్టు వరకు పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తా’నని ఆయనే స్వయంగా 12 రోజుల క్రితమే చెప్పడం అందులో ప్రధానమైంది. ఆయనకు గుండె సంబంధిత సమస్యలకు చికిత్స జరిగిన మాట వాస్తవమే.
కానీ, అది జరిగి చాలా రోజులైంది. దీంతో రాజీనామాకు గల కారణాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి పెద్ద కుదుపు ఏదీ రాకపోవడం, ధన్‌ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎవరికి తోచినట్టుగా వారు పరిపరి విధాలా తమ ఊహాశక్తికి పని చెప్తున్నారు. ఇటు రాజకీయ విశ్లేషకులూ విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన మరుసటి రోజే రాజీనామా చేయడం సాధారణ పరిస్థితుల్లో జరిగింది ఎంతమాత్రం కాదనేది అత్యధికుల నిర్ధారణ.
రాజస్థాన్‌కు చెందిన ధన్‌ఖడ్.. బెంగాల్ గవర్నర్‌గా అక్కడి దీదీ ప్రభుత్వంతో అనుసరించిన ఘర్షణ వైఖరి కారణంగా వార్తలకెక్కారు. తర్వాత ఎం.వెంకయ్యనాయుడు స్థానంలో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టా రు. అయితే, భారతదేశ చరిత్రలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం సమర్పించిన మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ చరిత్ర సృష్టించారు. ఆ తీర్మానం వీగిపోయిందనేది వేరే విషయం. ఇక తన పదవీకాలం ఇంకా (ప్రస్తుత సందర్భంలో రెండేండ్లు) మిగిలి ఉండగానే రాజీనామా చేసిన తొలి ఉపరాష్ట్రపతిగా నూ ధన్‌ఖడ్ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. గతంలోనూ ఉపరాష్ట్రపతులు వీవీ గి రి, ఆర్.వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, బి.షెకావత్ రాజీనామాలు చేసినప్పటికీ వారు రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకో లేక రాష్ట్రపతిగా ఎన్నికైన కారణంగానో వైదొలిగారు. కానీ, ధన్‌ఖడ్ విషయంలో అలాంటిదేమీ జరగలేదు.
ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రధాని మోదీ స్పందన విస్మయం కలిగిస్తున్నది. ఇదొక సామాన్యమైన విషయం అన్నట్టుగా ‘మీకు ఆయురారోగ్యాలు కలగాల’ని ఆకాంక్షించ డం ఒకెత్తయితే, ‘ఉపరాష్ట్రపతి సహా అనేక పదవులు దేశం ఆయనకు ఇచ్చింద’ని పేర్కొనడం మరొకెత్తు. కాగా, రాజ్యసభ చైర్మన్ హోదాలో ధన్‌ఖడ్ నిర్వహించిన సభావ్యవహారాల సలహా సంఘం సమావేశానికి సభా నాయకుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు గైర్హాజరు కావడం అనుమానాలకు దారితీసింది. దీనిపై కినుక వహించి ధన్‌ఖడ్ తప్పుకొని ఉండవచ్చంటున్నారు. ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా జస్టి స్ వర్మ అభిశంసన తీర్మానాన్ని, అదీ విపక్షా ల చొరవతో చేపట్టడం కేంద్రాన్ని ఇరకాటం లో పడేసిన మాట వాస్తవం. ఇటీవల ఆయన అనేక విషయాల్లో ప్రభుత్వ ఆలోచనలతో ప్రమేయం లేకుండా స్వతంత్రించి వ్యవహరిస్తున్నారనడానికి ఇదొక సూచన మాత్రమే.
పైగా పలు సందర్భాల్లో ప్రభుత్వ తీరు గురించి ఆయన నేరుగా మాట్లాడిన దాఖలాలున్నాయి. రైతుల ఆందోళన విషయమై ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. న్యాయవ్యవస్థపై ధన్‌ఖడ్ చేసిన విమర్శలూ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. ‘ఆరెస్సెస్ న్యాయవాది’గా పేరుపొందిన ధన్ఖ డ్ ఆ సంస్థ మూల సిద్ధాంతాల పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి కాకపోవడం, ప్రభుత్వం తో అంతకంతకూ ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం కారణంగా బీజేపీ ఆయనను వదిలించుకోవడం వైపే మొగ్గు చూపిందని చెప్పవచ్చు. ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలుగుతున్న వ్యక్తిని తగిన గౌరవంతో వీడ్కో లు సభను పెట్టడం, సన్మానించడం వంటివేవీ లేకుండానే సాగనంపడం ధన్‌ఖడ్‌కు మోదీ బృందానికి మధ్య ఏర్పడిన అగాధానికి అద్దం పడుతున్నది.