హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఆ పార్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జూన 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో తన ప్రభ తగ్గిపోయిందని బీజేపీ గ్రహించింది. ఇండియా కూటమి పేరిట విపక్షాలు జతకట్టి గట్టిగా ప్రతిఘటిస్తుండటంతో తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
గత పదేండ్లలో కేంద్రంలో సొంతంగా మెజారిటీ సాధించడంలో కమలం పార్టీ మొదటిసారి విఫలమైంది. ఈ పరిణామం ఆ పార్టీ నేతల ను ఆలోచనలో పడవేసింది. బీజేపీతో పాటు దాని సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్లో రాజకీయ ప్రకంపనలు రేకెత్తిస్తూ ఆ పార్టీ ఇప్పుడు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగిం దో తెలుసుకోవడానికి, బీజేపీ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలనే విషయమై ఆ పార్టీ నేతలు మేధోమథనంలో మునిగిపోయారు. ఈ ఏడాది ఆగస్టు 11న ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసంలో మొదటి మేధోమథన సమావేశం జరిగింది. ఐదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డా, అరుణ్‌సింగ్, బీఎల్ సంతోష్, దత్తాత్రేయ హోసబలే తదితరులు పాల్గొన్నారు.
నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పుడు వారి ముందున్న తక్షణ కర్తవ్యం. వసుంధర రాజే, సంజయ్ జోషి, వినోద్ తావ్డే, ఓం మాథుర్, భూపేంద్ర యాదవ్ తదితరుల పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ చర్చలు కొత్త అధ్యక్షుడి అన్వేషణకే పరిమితం కాలేదు. అగాథంలో కూరుకుపోయిన బీజేపీని బయటపడేసేందుకు అవసరమైన మార్గాలను వెతికేందుకు కూడా. ఆర్ఎస్ఎస్-ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్-బీజేపీ మధ్య సంబంధాలు ఇప్పుడు ఊగిసలాటలో ఉన్నాయి. బీజేపీలో వ్యవహారశైలిని మార్చాలనే ప్రయత్నాలు జరుగుతుండటం మరో ప్రధాన సమస్య. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదని, సొంతంగానే విజయతీరాలకు చేరే శక్తిసామర్థ్యాలు పార్టీకి ఉన్నాయని గతంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా పేర్కొన్నారు. సహజంగానే సంఘ్‌కు ఈ వ్యాఖ్యలు నచ్చలేదు. దీంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన్‌సంఘ్ 1977లో జనతా పార్టీలో విలీనమైంది. ఆ తర్వాత కొన్నేండ్లకే ద్వంద్వ సభ్యత్వ వివాదం నేపథ్యంలో జనతా పార్టీ నుంచి జన్‌సంఘ్ బయటకు రావాల్సి వచ్చింది. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ని స్థాపించారు. అప్పటినుంచి జన్‌సంఘ్‌తో కలిసి పనిచేసినట్టే బీజేపీతోనూ పనిచేసిన ఆర్ఎస్ఎస్కు ఆ పార్టీలో భారీగా పలుకుబడి ఉన్నది. గత పదేండ్లలో బీజేపీ అధ్యక్షుల ఎంపికలో ప్రధాని మోదీకి పూర్తి స్వేచ్ఛ లభించిందని ఆర్ఎస్ఎస్కు బాగా తెలుసు. 2014లో అమిత్ షా, 2019లో జేపీ నడ్డాల నియామకం పూర్తిగా మోదీ ఇష్టానుసారమే జరిగింది. వారి ఎంపికలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏ మాత్రం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తమకు ప్రీతిపాత్రుడైన వ్యక్తినే కొత్త అధ్యక్షుడిగా నియమిస్తారని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది. అంతేకాదు, ఏండ్ల తరబడి రూపుదిద్దుకున్న బలీయమైన, అతిపెద్ద పార్టీగా కాకుండా మోదీ ప్రభతో, మోదీ నీడలో ఇప్పుడు బీజేపీ నడుస్తున్నదనే భావన ఆర్ఎస్ఎస్లో నెలకొన్నది. ఈ పరిణామం పార్టీలో సంఘ్ మాట చెల్లుబాటు కాకుండా పోవడానికి దారితీసింది.
గతంలో బీజేపీ అధ్యక్షుడి ఎంపికలోనే కాదు, విధానపరమైన నిర్ణయాల్లోనూ ఆర్ఎస్ఎస్కు పెద్దపీట వేసేవారు. 2005లో పాకిస్థాన్ పర్యటనలో మహమ్మద్ అలీ జిన్నాను అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ పొగడటాన్ని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. తక్షణమే ఆయనను అధ్యక్ష పీఠం నుంచి తప్పించి, ఆయన స్థానంలో రాజ్‌నాథ్‌సింగ్‌ను కూర్చోబెట్టింది.
ఆ తర్వాత నితిన్ గడ్కరీ అధ్యక్షుడు కావడంలోనూ ఆర్ఎస్ఎస్ కీలకపాత్ర పోషించింది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తన పదవీకాలాన్ని పూర్తిచేసుకోవడమే కాదు, ఆయనకు ఆరు నెలల పొడగింపు కూడా లభించిం ది. పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు ఆయ నే కొనసాగుతారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రచారక్ బీఎల్ సంతోష్ బీజేపీ జనరల్ సెక్రెటరీగా (సంస్థాగత) రెండు పర్యాయాల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఆయనను మరోసారి కొనసాగిస్తారా? లేక ప్రత్యామ్నాయాన్ని సంఘ్ చూస్తుందా? అనేది వేచిచూడాలి. ఆర్ఎస్ఎస్ నుంచి డిప్యుటేషన్‌పై బీజేపీలోకి వెళ్లేవారికి రెండు పర్యాయాలకు మించి అవకాశం ఇవ్వకూడదనేది అప్రకటిత నిబంధన. సంఘ్, బీజేపీ మధ్య సమన్వయం కోసం బీజేపీ జనరల్ సెక్రెటరీ (ఆర్గనైజేషన్) పదవి అనేది చాలా శక్తిమంతమైనది.
ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న, క్షేత్రస్థాయిలో ప్రజాదరణ ఉన్న నాయకుడిని నూతన అధ్యక్షుడిగా సంఘ్ మొదటగా నియమిస్తుంది. ఒకవేళ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్సింగ్ల సమ్మతి తప్పనిసరి అయితే, ఆ వ్యక్తి సంఘ్‌కు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. అటువంటి అధ్యక్షుడికే పార్టీని నడపడానికి అవసరమైన పూర్తి స్వేచ్ఛ, అధికారం ఉంటుంది. మోదీ నీడ నుంచి పార్టీని బయటపడేసే లక్ష్యంతో పార్టీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేలా నూతన అధ్యక్షుడు సూచనలు చేసే ఆస్కారం ఉంటుంది. ఈ తరుణంలో ప్రస్తుత రాజకీయ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా బీజేపీని సంసిద్ధం చేయడమే ఇప్పుడు సంఘ్ ముందున్న అతి ముఖ్యమైన లక్ష్యం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
– వెంకట్ పర్సా