ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో పుంఖానుపుంఖాలుగా ప్రసంగిస్తున్నప్పటికీ, అందుకు భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభ తగ్గిపోతున్న సూచనలే అంతకంతకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ విషయంలో అంతర్జాతీయంగా భారత్ వాణిని వినిపించేందుకు, మన వైఖరిని తెలియజేసేందుకు ఆయన స్వరం సరిపోలేదు. ఒక్కరినే కాదు, అనేక సిద్ధాంతాలు, సమాజాలను భారత స్వరం ప్రతిబింబించాలని మోదీ చాలా ఆలస్యంగానైనా గుర్తించారు. అందుకే, అఖిలపక్షం ఎంపీల బృందంలో విభిన్న వర్గాలు హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, కాంగ్రెస్‌వారు, మార్క్సిస్టు, ద్రవిడవర్గాల ప్రతినిధులను ఎంపిక చేశారు. ఈ వాస్తవాన్ని మోదీ పరిగణనలోకి తీసుకోవడమే గత పదకొండేండ్లలో ఆయన ప్రభ తగ్గిందని చెప్పేందుకు తార్కాణం. మొన్నటివరకు ప్రతిపక్షాలను చిన్నచూపు చూసిన మోదీ ఇప్పుడు అఖిలపక్ష బృందాన్ని సాదరంగా స్వాగతించి, సత్కరించాల్సి వచ్చింది. అయితే, ఈ క్రమంలో మింగుడు పడని అంశం ఏమిటంటే.. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో భారత వ్యూహాత్మక దుర్బలత్వాలు ప్రపంచానికి బహిర్గతమయ్యాయి.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడాన్ని బహిరంగంగా స్వాగతించిన అతికొద్ది ప్రధాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, ట్రంప్ 2.0లో ఐదు నెలలు కూడా గడవకముందే ఇరుదేశాల మధ్య ఉన్న ఈ సద్భావన వాతావరణం సన్నగిల్లుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌నకు బలంగా మద్దతిచ్చిన పలువురు భారత సంతతివారు తాము తప్పు చేశామా? అని ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపొందినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆందోళన చెందాయి. వాణిజ్యపరంగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తవచ్చని కానీ, వ్యూహాత్మక చర్చల ద్వారా దాన్ని అధిగమించవచ్చని భారత్ కూడా భావించింది. రష్యా పట్ల ట్రంప్ ఆచరణాత్మక వైఖరి, ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి కోసం ప్రయత్నించడం, గ్లోబల్ పవర్‌గా ఎదుగుతున్న భారత్ పట్ల ఆయన సానుకూల దృక్పథంతో ఉండటాన్ని చాలామంది భారతీయులు ప్రశంసించారు. ట్రంప్ హయాంలో ఇండియా-అమెరికా బంధం మరింత బలపడాలని కూడా ఆకాంక్షించారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు రాసిన వ్యాసంలో బార్డ్ కాలేజిలో విదేశాంగ విధానం విభాగం ప్రొఫెసర్ వాల్టర్ రస్సెల్ మీడ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, అందుకు విరుద్ధంగా ట్రంప్ 2.0లో దౌత్యపరంగా అసంతృప్తిని రేకెత్తించిన వరుస చర్యలతో భారతదేశం దిగ్భ్రాంతికి గురైంది. ట్రంప్ రెండవ విడత పాలన ప్రారంభంలో భారతీయ పౌరుల బహిష్కరణలను మీడ్ ఎత్తిచూపారు. ట్రంప్ పాలన మొదటి పర్యాయంలో దాదాపు 6 వేల మంది భారతీయులను అమెరికా నుంచి బహిష్కరించారు. కానీ, ఈసారి అక్రమ వలసదారుల పేరిట బహిష్కరణకు గురైనవారిని సంకెళ్లు వేసి మరీ సైనిక విమానంలో స్వదేశానికి తరలించారని వాల్టర్ గుర్తుచేశారు. దీనిపై భారత్‌లో రాజకీయ దుమారం చెలరేగింది.
2025 మే 27న ఓ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విదేశాంగ శాఖ అకస్మాత్తుగా నిలిపివేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఐఫోన్ల ఉత్పత్తిని చైనా నుంచి భారతదేశానికి తరలించాలనే యాపిల్ కంపెనీ ప్రణాళికలపై ట్రంప్ బహిరంగ విమర్శలను కూడా మీడ్ ఉదహరించారు. భారత్ ప్రాముఖ్యతను అమెరికా తగ్గించివేస్తున్నదనే భావనను ఇది మరింతగా పెంచింది. పహల్గాంలో ఉగ్రవాద దాడి, అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలపై ట్రంప్ సర్కార్ ప్రతిస్పందన భారత్‌లో అసంతృప్తిని రేకెత్తించింది. ‘రాడికల్ జిహాదిస్ట్ ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రధాన మద్దతుదారు. ఉగ్రవాదులకు ఆ దేశం నిధులు కూడా సమకూరుస్తున్నది. ఉద్రిక్తతల విషయంలో రెండు వైపులా శాంతించాలనే ప్రకటనల కంటే అమెరికా నుంచి భారతీయులు ఎక్కువ ఆశించారు’ అని ప్రొఫెసర్ వాల్టర్ తన వ్యాసంలో రాశారు. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ పదేపదే పేర్కొనడం, క్రెడిట్ కోసం పాకులాడటం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇంకా చెప్పాలంటే, ఇది భారత ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టివేసింది.
భారత్‌ను అమెరికా చూసే కోణం విషయంలో భారతీయుల్లో అసంతృప్తి ఉన్నది. పాక్ రెండవ లేదా మూడవ శ్రేణి శక్తిగా ఉన్నది. ఆర్థిక, రాజకీయ వైఫల్యాలతో ఆ దేశం ప్రపంచ వేదికపై చర్చనీయాంశమవుతున్నది. కానీ, భారత్ భిన్నపథంలో ఉన్నది. ఈ విజయాన్ని గుర్తించాలని భారతీయులు కోరుకుంటున్నారు. ముఖ్యమైన ప్రపంచ శక్తిని ట్రంప్ దూరం చేసుకోవడం మంచిది కాదని, అనవసరంగా కాళ్లల్లో కట్టెలు పెట్టడం వల్ల ‘అమెరికా గ్రేట్ ఎగైన్’గా మారదని వాల్టర్ అన్నారు.
మరోవైపు ఒక్కరోజు వ్యవధిలోనే అమెరికా చేతుల్లో భారత దౌత్యానికి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. అమెరికా ఆర్మీ డే సందర్భంగా వాషింగ్టన్ డీసీలో నిర్వహించే కార్యక్రమానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఆహ్వానించడం అందులో ఒకటి. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మునీర్‌ను ఆహ్వానించడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికాకు పాకిస్థాన్ ‘గొప్ప భాగస్వామి’, ఉగ్రవాదంపై పాక్ అద్భుతంగా పోరాడుతున్నదని కితాబిస్తూ, దాయాదికి అమెరికా ఆర్మీ సెంట్రల్ కమాండ్ అధిపతి మైఖేల్ కురిల్లా క్లీన్చిట్ ఇచ్చేశారు. ఇది భారత దౌత్యానికి తగిలిన మరో ఎదురుదెబ్బ. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతున్నదని మోదీ ప్రభుత్వం పదేపదే చెప్తున్నది. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను అమెరికా అతిథిగా ఆహ్వానించడం ఆందోళనకరం. భారత్‌తో అమెరికా సంబంధాలు కలిగి ఉన్నంత మాత్రాన ఇస్లామాబాద్‌తో సత్సంబంధాలు కలిగి ఉండొద్దా? అని కురిల్లా ఈ సందర్భంగా ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం అమెరికాను సందర్శించిన కొన్ని రోజులకే కురిల్లా ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు బంగ్లాదేశ్‌లో ఒక పెద్ద భౌగోళిక రాజకీయ మార్పు జరుగుతున్నది. ‘గ్రేట్ గేమ్’గా పిలుస్తున్న దీని ప్రధాన వ్యూహకర్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని తెలుస్తున్నది. బంగ్లాదేశ్‌తో ఉన్న 271 కిలోమీటర్ల సరిహద్దు సహా మయన్మార్‌లోని రఖైన్ రాష్ర్టాన్ని అరకాన్ సైన్యం నియంత్రిస్తున్నదని రక్షణ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ చెప్తున్నారు. మయన్మార్‌లో ప్రతిపాదిత మానవతా కారిడార్ రోహింగ్యాలకు సహాయం చేయడానికి మాత్రమే కాదని, అమెరికా నేతృత్వంలో భౌగోళిక, రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చని నిపుణులు వాదిస్తున్నారు. వాస్తవానికి ఇది రోహింగ్యాలను వ్యతిరేకించే తిరుగుబాటు సంస్థ అరకాన్ ఆర్మీ నియంత్రణలోకి వస్తుందనేది నిపుణుల వాదన. ఈ కారిడార్ అసలైన లక్ష్యం తిరుగుబాటుదారులకు సైనిక సహాయం అందించడమేనని తెలుస్తున్నది. అమెరికా నాయకత్వంలో మయన్మార్ సైన్యానికి వ్యతిరేకంగా ప్రాక్సీ యుద్ధానికి ఆజ్యం పోయడానికి ఈ కారిడార్‌ను ఉపయోగించవచ్చనే ఆందోళనలు తలెత్తుతున్నాయి. మయన్మార్‌లోని వివిధ తిరుగుబాటు గ్రూపులకు అమెరికా ఇప్పటికే దాదాపు 400 మిలియన్ డాలర్ల సాయం చేసినట్టు సమాచారం. ఈ సహాయంలో కొంత భాగం, బహుశా ఆయుధాలతో సహా మణిపూర్‌లోకి కూడా వచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అమెరికా చేతిలో పావుగా మారిన బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేత యూనుస్ భారత్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. భారత్‌కు నష్టం చేకూర్చే ఈ మానవతా కారిడార్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంతేకాదు, ఈశాన్య రాష్ర్టాలతో పాటు బంగ్లాదేశ్‌కు కలిపి ఒక ప్రత్యేక అభివృద్ధి దృక్పథం అవసరమని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా ఇలా ఎందుకు చేస్తున్నదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ సమాధానమిచ్చారు. ప్రపంచ ఆధిపత్యాన్ని సవాలు చేసేంతగా ఏ దేశం ఎదిగినా అమెరికా దాన్ని అణగదొక్కాలని చూస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా భారత్ గ్లోబల్ పవర్‌గా ఎదిగితే, దాన్ని బలహీనపరచడానికి అమెరికా ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. గతంలో రష్యాతో అమెరికా వ్యవహరించినట్టుగా, ఇప్పుడు చైనాతో వ్యవహరిస్తున్నట్టుగా భారత్‌తోనూ అమెరికా వ్యవహరిస్తుందని ఆయన చెప్పడం గమనార్హం. గ్లోబల్ పవర్‌గా ఎదుగుతున్న శక్తులకు భావజాలం గురించి కాదు, ఆధిపత్యం గురించి అమెరికా సవాలు విసురుతుందని ఓ ఇంటర్వ్యూలో శాక్స్ స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని చాలా కాలంగా శాక్స్ విమర్శిస్తున్నారు. భారతదేశం తన ఆర్థిక పురోగతిని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులోనూ ఇదే పునరావృతమయ్యే అవకాశం ఉందని శాక్స్ కుండబద్దలు కొట్టారు. 10-15 ఏండ్లలో అమెరికాను అధిగమించి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని, ఈ శతాబ్దం చివరికి అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉందని శాక్స్ గతంలో అంచనా వేశారు.
‘భారతదేశం ఎదిగినప్పుడు అమెరికా బలహీనపడుతుంది. అందుకే రష్యా, చైనాలాగా భారత్‌ను కూడా అమెరికా దెబ్బతీయాలని చూస్తున్నదని శాక్స్ అన్నారు. భారతదేశ ఆర్థిక పురోగతి అద్భుతమని ప్రశంసిస్తూనే, చైనాతో అమెరికా చేసే భౌగోళిక, రాజకీయ పోరులో భారత్ పావుగా మారకుండా జాగ్రత్తపడాలని శాక్స్ సూచించారు. చైనాను ఓడించేందుకు అమెరికా భారత్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నదని, అమెరికా చేతుల్లో పావుగా మారవద్దని భారత్‌కు హితవు పలికారు.
అమెరికా నేతృత్వంలోని క్వాడ్ వంటి కూటముల్లో భారతదేశం భాగస్వామి కావడాన్ని శాక్స్ విమర్శించారు. అటువంటి గ్రూపులు ప్రధానంగా అమెరికా ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తాయని, దీర్ఘకాలిక స్వయంప్రతిపత్తి విషయంలో భారత్ రాజీ పడేలా చేస్తాయని ఆయన వాదించారు. చైనా, రష్యా సహా అన్ని ప్రపంచ శక్తులతో సమతుల్య సంబంధాలను కొనసాగించాలని, వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలని శాక్స్ భారత్‌కు సూచించారు. సంక్లిష్ట సమయాల్లో మిత్రదేశాలను విడిచిపెట్టే అగ్రరాజ్యం బుద్ధిని, గత రికార్డును ఉటంకిస్తూ అమెరికాతో స్నేహం చాలా ప్రమాదకరమని శాక్స్ హెచ్చరించారు. అయితే, భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా ఉచ్చు పన్నుతున్నా మోదీ సర్కారు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. కశ్మీర్ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని, సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడటంపై ఇప్పటికే ప్రతిపక్షం మండిపడుతున్నది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిస్థితులపై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయినా మోదీ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఉగ్రదాడి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నది.