‘నా ఆశలన్నీ యువతపైనే ఉన్నాయి. ఆధునిక యువత నుంచే నా అనుచరులు వస్తారు. వారు సింహాల్లాగా పనిచేసి దేశంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు’ అని ఈ దేశ యువతను ఉద్ధేశించి స్వామి వివేకానందుడు చెప్పిన మాటలివి. ‘దేశంలోని కొందరు నిరుద్యోగులు సోషల్‌మీడియా, ఆర్టీఐ కార్యకర్తల ముసుగులో వ్యవస్థలపై దాడి చేస్తూ సమాజానికి బొద్దింకలు/పరాన్నజీవుల్లా మారుతున్నారు’ అని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలివి.
భారతీయ రాజకీయాలు ఎప్పుడూ సంచలనాలకు, ఆసక్తికరమైన మలుపులకు నిలయం. అయితే, ప్రస్తుత డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే విధానం పూర్తిగా మారిపోయింది. గతంలో తీవ్రమైన చర్చలు, సంపాదకీయాలు, వీధిపోరాటాల ద్వారా సాగిన రాజకీయ నిరసన నేడు సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్నది. మీమ్స్, పొలిటికల్ సెటైర్ల రూపంలో సాగుతున్నది. ఈ క్రమంలో జెన్-జీ యువత సృష్టించిన సరికొత్త వ్యంగ్యాస్త్రమే ‘కాక్రోచ్ జనతా పార్టీ’. ఇది నిజమైన రాజకీయ పార్టీ కాకపోయినా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లోపాలను, నాయకుల అవకాశవాదాన్ని ఎండగట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతను బొద్దింకలతో, పరాన్నజీవులతో పోల్చడం వల్లే జెన్‌జీ గొంతెత్తటం విశేషం.
సుమారు 147 కోట్ల ఈ దేశ జనాభాలో 65శాతానికి పైగా జనాభా 35ఏండ్ల లోపు ఉన్నవారే. అంటే ప్రపంచంలోనే అత్యధిక యువతను కలిగిన దేశమిది. ఈ దేశ భవిష్యత్తును పరాన్నజీవులతో పోల్చడం వెనుక అంతర్యమేమిటో కానీ దానికి పర్యవసానం మాత్రం ప్రస్తుతం చూస్తున్నదే. అపారమైన శక్తి కలిగిన ఈ దేశ యువతను అవమానిస్తుంటే..అభిజీత్ దీప్కే సామాజిక మాధ్యమాల వేదికగా కార్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు కు గత శనివారం శ్రీకారం చుట్టారు. ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లకంటే కూడా 1.6 కోట్ల ఫాలోవర్స్‌తో దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది.
భూమిపై అణుబాంబు దాడి జరిగినా, తీవ్రమైన విపత్తులు వచ్చినా తట్టుకుని జీవించగలిగే ఏకైక జీవి బొద్దింక. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా అది తన ఉనికిని కాపాడుకుంటుంది. డిజిటల్ క్రియేటర్లు ఈ వైజ్ఞానిక సత్యాన్ని భారతీయ రాజకీయ నాయకులకు అన్వయించారు. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ సిద్ధాంతం గెలిచినా.. కొందరు నాయకులు మాత్రం తమ పదవులను, ఉనికిని కాపాడుకోవటానికి రాత్రికి రాత్రే అధికార పార్టీలోకి మారిపోతుంటారు.
సిద్ధాంతాలు, విలువలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ అధికారంలో కొనసాగే అవకాశవాద, ఫిరాయింపు నాయకులను బొద్దింకలతో పోలుస్తూ సృష్టించిన పేరే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. తమకంటూ ఓ మ్యానిఫెస్టో కూడా ప్రకటించడం విశేషం. మన దేశ యువతరం ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఆలోచనాత్మకంగా ఉన్నాయనేదానికి సాక్ష్యమే వారు ప్రకటించిన మ్యానిఫెస్టోలోని పలు అంశాలు. వాస్తవానికి ఇది రాజకీయ పార్టీ కాకపోయినా ఆ స్థాయిలో ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎంతో గొప్పవిషయమే కదా. వాటిలో ప్రధానంగా… ఎన్నికల ముందు ఒక పార్టీలో ఉండి, గెలిచిన తర్వాత మరో పార్టీలోకి దూకే (జంపింగ్) పార్టీపిరాయింపులను సహించబోమని నాయకుల ప్రవర్తనను తీవ్రంగా హేళన చేస్తున్నది. ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జీలు పదవీవిరమణ చేసిన అనంతరం ఎలాంటి రాజ్యసభ పదవి ఇవ్వబోమని హామీ ఇచ్చింది. కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిన ఇలాంటి పనులను గుర్తు చేసింది.
గత తరాల వారు రాజకీయాలపై అసంతృప్తి ఉంటే నిరాశ పడటమో, లేదా ఓటింగ్ కు దూరంగా ఉండటమో చేసేవారు. కానీ నేటి జెన్-జీ యువత తమ నిరసనను చాలా సృజనాత్మకంగా వ్యక్తపరుస్తున్నది. సమాజంలో పెరుగుతున్న అవినీతిని, రాజకీయ అస్థిరతను చూసి కుంగిపోకుండా, నవ్వుకుంటూనే ఆలోచింపజేసేలా చేయడం వీరి ప్రత్యేకత. అది ప్రస్తుత కాలపు రాజకీయ నైతిక విలువల పతనానికి అద్దం పట్టే ఒక సామాజిక నిదర్శనం. యువత రాజకీయాలను ఎంత నిశితంగా గమనిస్తున్న దో నాయకుల అబద్ధాలను ఎంత సులభంగా పట్టుకుంటున్నదో చెప్పటానికి ఇదొక చకని ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించటానికి, విమర్శించటానికి ఇటువంటి ఆరోగ్యకరమైన, హాస్యాస్పదమైన వ్యంగ్యం ఎంతైనా అవసరం.
ఇదిలా ఉండగా దేశంలో నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్న పాలకులు మాత్రం ఈ జెన్‌జీ ఉద్యమంపై ముక్కున వేలేసుకోవటం విస్మయం కలిగిస్తున్నది. యువతను నేరుగా ఎదుర్కోలేక ఆ పార్టీ ఆకౌంట్‌ను డిలీట్ చేయించే పనిలో కేంద్ర సర్కార్ ఉన్నది. నీట్ పరీక్షా పత్రం లీకేజీపై కూడా సీజేపీ తన నిరసనను తెలియజేయటం విశేషం. సీజేపీతో పాటు నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) ఏర్పాటై నేర చరిత్రలేని నాయకులు పార్లమెంట్లో ఉండాలని, చిన్నపాటి వర్షానికే నదులను తలపించే రోడ్లు ఉండొద్దనేది తమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు అది పేర్కొన్నది. సోషల్‌మీడియాలో మీమ్స్ చేసుకుంటూ టైంపాస్ చేసేవాళ్లంటూ ఎగతాళి చేసిన వారంతా నేడు వాళ్ల పోరాటానికి సలాం చేయాల్సిందే. ప్రభుత్వాలను ప్రశ్నించే వారంతా సోషల్ మీడియా పార్టీలతో జత కడుతున్నారు. పాలకులు అసమర్థులుగా ఉన్నప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. రేపటి భవిష్యత్తు వాళ్లది. పేదరికంలేని దేశంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దటంలో ఈ సీజేపీ, ఎన్‌పీఎఫ్‌లు తప్పనిసరి. దేశం కోసం పాటుపడేవారంతా ప్రశ్నించటం నేర్చుకున్నప్పుడే దొంగలెవరో దొరలెవరో తెలుస్తుంది. ఏదేమైనా యువత రాజకీయాలు మాట్లాడటం ఒక శుభ పరిణామమనే చెప్పాలి.
– రాజు పిల్లనగోయిన