ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడోసారి ఫైనల్ పోరులో నిలిచిన టీం ఇండియా పుష్కర విరామం తర్వాత మళ్లీ టైటిల్‌ను సగర్వంగా ఒడిసిపట్టుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేసిన రోహిత్‌సేన ముచ్చటగా మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం దుబాయ్‌లో టైటిల్ ఫెవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది.
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మెగాటోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ ఆదిలోనే తమ ప్రస్థానాన్ని ముగించగా, పాక్‌లో అడుగుపెట్టకుండా పరాయిగడ్డపై భారత్ విజయ దుందుభి మోగించింది. ‘రోకో’ ద్వయంగా భావించే రోహిత్‌శర్మ-విరాట్‌కోహ్లీ కెరీర్‌కు చాంపియన్స్ ట్రోఫీతో తెరపడుతుందన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో కివీస్‌కు చెక్‌పెడుతూ భారత్ తమ కలల కప్‌ను సొంతం చేసుకున్నది. సరిగ్గా 12 ఏండ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై ధోనీ నాయకత్వంలో చాంపియన్స్ టైటిల్ గెలిచిన టీం ఇండియా ఇన్నేండ్లకు తమ కలను సాకారం చేసుకున్నది.
భారత జట్టు పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించడంతో ఒకానొక దశలో టోర్నీ జరుగుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే, పలు చర్చల అనంతరం హైబ్రిడ్ విధానంలో టోర్నీ నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. బంగ్లాదేశ్‌తో గెలుపు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ‘మెన్ ఇన్ బ్లూ’.. కివీస్‌తో ఫైనల్ పోరు వరకు అదే పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా తుది జట్టును ఎంచుకుంటూ ప్రత్యర్థిపై వరుస విజయాలతో దుమ్మురేపింది.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పనిపడుతూ మరో మ్యాచ్ ఉండగానే సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్నది. పాక్ అంటేనే పూనకం వచ్చినట్లు ఆడే విరాట్ కోహ్లీ మరోమారు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. లక్ష్య ఛేదనలో సహచరులు విఫలమైనా.. పాక్ బౌలర్లను అసహాయులను చేస్తూ కోహ్లీ సూపర్ సెంచరీతో కదంతొక్కిన తీరు అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ ప్రదర్శనను మరిపిస్తూ కోహ్లీ దుబాయ్‌లో చెలరేగాడు. పాక్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఇక ఐసీసీ టోర్నీల్లో తమకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్ రెక్కలు విరుస్తూ లీగ్ దశను భారత్ అజేయంగా ముగించింది. స్పిన్ చతుష్టయం వరుణ్, కుల్దీప్, జడేజా, అక్షర్ రాణింపుతో కివీస్‌పై భారీ విజయం సాధించింది. కీలకమైన సెమీస్‌లో ఆస్ట్రేలియా భరతం పట్టిన టీం ఇండియా.. అదే స్ఫూర్తితో ముందుకు సాగింది. ఒకే వేదికపై ఆడుతూ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న మాజీ క్రికెటర్ల విమర్శలకు చెక్ పెడుతూ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన కివీస్‌తో పోరులోనూ జయకేతనం ఎగురవేసింది. కివీస్ బ్యాటర్లకు కళ్లెం వేసిన భారత స్పిన్నర్లు పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.
లక్ష్యఛేదనలో హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ అదిరిపోయే ఆరంభంతో కివీస్‌పై మెండైన ఆధిపత్యం ప్రదర్శించాడు. తిరిగి పుంజుకున్న కివీస్ వరుసగా వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధించే ప్రయత్నం చేసినా అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్ రాణింపుతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. స్పిన్ బౌలింగ్‌కు తోడు మెరుపు ఫీల్డింగ్‌తో పైచేయి సాధించేందుకు కివీస్ అన్ని శక్తులు మోహరించినా టీం ఇండియాను సమర్థంగా అడ్డుకోలేకపోయారు. మొత్తంగా దుబాయ్ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన భారత్.. ఏడాది తిరిగే లోపే మరో ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకుని ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. చాంపియన్స్ ట్రోఫీ విజయంతో కోట్లాది మంది భారతీయుల మనసు ఉప్పొంగిన వేళ దేశంలో పండుగ వాతావరణం నెలకొనడం ముదావహం.