పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ ఈ మధ్య కొన్ని సంచలన ప్రకటనలు చేసి వార్తలకెక్కారు. అందులో ప్రపంచ శాంతికి ప్రమాదకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన రెండుసార్లు అమెరికాలో పర్యటించారు. రెండుసార్లూ అగ్రరాజ్యం ఆయనకు ఎర్రతివాచీ పరచి ఘనంగా రాచమర్యాదలు చేయడం గమనార్హం. ఏకంగా వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్ ఆయనకు విందు ఇవ్వడం తెలిసిందే. మొదటి విడత పర్యటనలో ‘యుద్ధాన్ని ఆపడంలో సహకరించినందుకు’ అమెరికా అధ్యక్షుడికి మునీర్ ‘కృతజ్ఞతలు’ చెప్పారు. మొన్న రెండో విడత పర్యటనలో ఆయన వ్యాఖ్యలు మరింత అభ్యంతరకరంగానూ, ప్రమాదకరంగానూ ఉన్నాయి. భారత్‌తో యుద్ధమే జరిగితే పాక్ తట్టుకొని నిలబడటం కష్టమంటూనే, సగం ప్రపంచాన్ని తమతో తీసుకెళ్తామని చెప్పారు. అంతేకాకుండా రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్ చమురుశుద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించడం జనరల్ మునీర్ ఉన్మాద ప్రేలాపనలకు పరాకాష్ఠ. తమ అమ్ములపొదిలో అణ్వస్ర్తాలు ఉన్నాయన్న మేకపోతు గాంభీర్యం, ఉన్మాదంతో కూడిన నిరాశ, నిస్పృహలు ఆయనతో అలా మాట్లాడించి ఉండవచ్చు.
మునీర్‌ను ‘సూటు వేసుకున్న ఒసామా బిన్ లాడెన్’ అని అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి ఒకరు అభివర్ణించడం గమనార్హం. నిజానికి నాడు లాడెన్‌ను వాడుకున్నది అమెరికాయే అన్న సంగతి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. సోవియట్ యూనియన్ను దెబ్బతీసేందుకు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, యుద్ధాలను ఉసిగొల్పి, దేశాల మధ్య చిచ్చుపెట్టింది. అప్పుడు సైనిక నియంత జనరల్ జియావుల్ హక్‌ను మచ్చిక చేసుకోగా, ఇప్పటి వ్యూహాత్మక అవసరాల కోసం ‘జిహాదీ జనరల్’గా పిలువబడుతున్న మునీర్‌ను పావులా వాడుకుంటున్నది. ఇన్నాళ్లుగా ఇండియాను ‘మేరా దోస్త్’ అని చెప్తూ వచ్చిన ట్రంప్ తన అసలు దోస్తు ఎవరో చెప్పకనే చెప్పారు. టారిఫ్‌ల విషయంలో ఆ సంగతి మరింత తేటతెల్లమైంది. పాకిస్థాన్‌ను నెమలి ఈకతో దువ్వి భారత్‌పైకి దుడ్డుకర్రను విసిరిన వైనం తెలిసిందే.
అమెరికాకు రోజురోజుకూ దగ్గరవుతున్న జనరల్ మునీర్ సైన్యాధిపతి హోదాలో కాకుండా దేశాధ్యక్షుని తరహాలో వ్యవహరిస్తున్నారు. ఆర్భాటంగా చేస్తున్న అమెరికా పర్యటనలు, కశ్మీర్, అణ్వస్ర్తాల గురించిన ప్రేలాపనలు అందుకు నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆయన అసాధారణమైన రీతిలో ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందారు. పాక్‌కు సుదీర్ఘకాలం సైనికపాలనలో మగ్గిన చరిత్ర ఉండటం తెలిసిందే. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, మునీర్‌ల ఫొటోలతో ఇస్లామాబాద్‌లో ఇటీవల హోర్డింగులు వెలిశాయి. పాక్ ఎప్పటికీ మారబోదని ఇది సూచిస్తున్నది. తీవ్రమైన మతనిష్ఠ, యుద్ధోన్మాదం, భారత్‌పై వ్యతిరేకతల కలయిక అయిన ఈ సైనికాధికారి అణ్వస్ర్తాల గురించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే పిచ్చోడి చేతిలో రాయి సామెత గుర్తుకువస్తున్నది. పాకిస్థాన్ చేతిలో అణ్వాయుధాలుండటం ప్రపంచానికి ఎంతవరకు సురక్షితం? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మునీర్ తీరును ఎండగట్టి పాక్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ దౌత్యపరమైన కృషిని ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.