ఓ దిక్కు నా గొంతెండుకవోంగ గూడ బిందెలు వట్టుకొని గుంతల కోసం తిరిగేది. ఈ గుంత కాపోతే ఆ గుంత. అది కాపోతే ఇంకోటి… ఇట్లా నీళ్ల కోసం నేను తిరుగని గుంతబాయి లేదు. ఎన్ని బాయిల్దిరిగితేం లాభం? ఎక్కడా సుక్క నీరు దొర్కకపోయేది. ఇట్లా మా తల్లిగారూరు ‘వడ్డేపల్లి’ల నీళ్ల కోసం నేన్ వడ్డ తిప్పలెన్నో…
ఓ రోజు ఇంట్ల సుక్క నీళ్లు లెవ్వని మాయమ్మ (నర్సమ్మ) కుండ చెయ్యిల వెట్టి ఊరబాయి కాడికి తోలింది. ఆడికివొయ్యేసరికి రైలుపెట్టె ఉన్నట్టే ఉంది పెద్ద లైను. ముందట రైల్ ఇంజిన్ ఎట్ల మొత్తుకుంటదో అట్లనే ఈ లైన్ల గూడ ముందటెవ్వలో లొల్లి వెట్టుకుంటున్నరు. ఆ లొల్లేందో సూద్దామని కుండ లైన్ల వెట్టి ముందటికి వొయ్న. ఇంతకీ ఆ దౌడం నీళ్ల కోసమనుకునేరు. కాదు, కాదు.. గంటె కోసం. అప్పటిదాన్క లైన్ల నిలవడ్డ ముందటామె ఇంటికాన్నుంచి గంటె తీస్కచ్చుడు మర్శిపోయిందట. ఎన్కామెను గంటె ఇయ్యిమంటే ఇయ్యనంటున్నది. దానికోసమే ఆ దౌడం. ముందటామె ‘నాకు నీళ్లొద్ద’ని తప్పుకొంటే నా వంతు జెల్దొస్తదని ఎన్కామె ఇకమతు. ఆ ఇకమతు బాగనే ఉంది గని.. మధ్యల్నే ఊటాగిపోతే నీళ్లు దొర్కక మొదటికే మోసమొస్తదని తతిమోళ్ల లొల్లి. ఇట్లా ఎవ్వల తిప్పల వాళ్లది. మొత్తంగా తప్పెవల్దని నన్నడిగితే మాత్రం శెప్పుడు నాతోని గాదు. ఎన్కట ఊరబాయి అని ఊరుకోటి ఉండేది. ఆ బాయిల ఊట ఊరినా కొద్దీ జనాలు గంటెతోని తోడ్కచ్చుకునేటోళ్లు నీళ్లు.
నలభై ఐదేండ్ల కిందట.. నా సిన్నతనాన్నే ‘లింగోటం’ పిలగానికిచ్చి నాకు పెండ్లిజేసిండు మా అయ్య ఎల్లయ్య. ఇక్కన్నన్న తప్పుతదనుకున్న నీళ్ల గోస. కానీ మా వడ్డేపల్లిల ఉన్నట్టే మా నల్గొండ జిల్లా మొత్తం నీళ్లకు గోసుంటదని లగ్గమైనంక నాకెర్కయింది. మూడేండ్లున్నడు గావొచ్చు.. ‘ఊరబాయి ఊరవుతలుంటది. నేనొక్కదాన్నే వోత, నువ్వద్దురా అయ్యా..’ అనంగ ఏడ్సుకుంటా ఎంబడివడ్డడు మా యాదిగాడు. వాన్ని సూడలేక ఎంబడి పట్కవోయ్న. నీళ్లున్న బిందె నెత్తిమీద, ఓ సంకల యాదిగాడు.. మెల్లగ నడ్సుకుంటా ఇంటిమొకానొస్తున్న. ఏడికెళ్లి అచ్చిందో తెల్వద్ ఆ కుక్క దినాల్గాను.. ఎన్కకెళ్లొచ్చి కాళ్ల పిక్కలందుకున్నది. ఓ దిక్కు యాదిగాడు, ఇంకో దిక్కు కుండ డబేల్మని కిందవడె. కుండలున్న నీళ్లు పిక్కలకు సిమ్మిచ్చి గొడితే ఒగ మంటగాదు. నా రౌతం నీళ్లళ్ల గల్సి కారుకుంటవోతున్నది. దాన్నిజూసి యాదిగాడు రాగం గట్టిగందుకున్నడు. మా యాదిగాన్ని సంకలేసుకున్నదే నయ్యమైంది. లేకుంటే ఆ కుక్కకినా వారెత్తు నా కొడుకునందుకుంటే ఏమవునో యాజ్జేసుకుంటనే పానమంతా ఇప్పటికీ సిత్తుబొత్తయితది.
ఇరువై ఏండ్ల కిందట.. ఇగ ఒక్కదానితోని అయితలేదని నా బిడ్డను గూడ నీళ్లకు తోల్కవోయ్న. గుంతల బాయిలన్ని తిర్గినం, ఎక్కడా సుక్క నీరు లేదు. ఆఖరికి ఊరబాయి కాడికి గూడ వోయ్నం అక్కడా నీళ్లు లెవ్వు. ఏంజేయాలో తెల్వక మంది సేన్లన్ల ఉండే బోరుబాయిలన్ని తిర్గినం. ఏ బోరుబాయి కాడికి వోయ్నా నీళ్ల జాడలేదు. ఒక్క బాయి దగ్గర మాత్రం కొన్ని నీళ్లువడ్తున్నయనే ముచ్చట ఎర్కయి అక్కడిగ్గూడ వోయ్నం. తీరా అక్కడికి వోయినంక సూత్తె బోరు సుట్టూ ముళ్ల కంపలు పర్శి ఉన్నయి. నీళ్లంటే అప్పుడు బంగారం లెక్కనే మరి ‘నా బిడ్డకు వశపడక కోపమొచ్చింది. ‘ఇన్ని నీళ్లు వట్కోనిస్తే మీ ముల్లేమన్న అర్గుతుందా? ఓ.. బోరు సుట్టూ ముళ్ల కంపలు వర్సుకున్నరు.. ఇయ్యాళ్ల రేపు బంగారం గూడ ఇట్ల దాసుకుంట లేర’ని బోరు బాయి ఓనర్తోని లొల్లి వెట్టుకు న్నది. ‘బాలవ్వా.. నీ బిడ్డకు బాగ మాటలొస్తు న్నయి. బిందెల కమాన నీళ్లు మంది ఎత్కవోతే మా పొలం ఎట్ల వారుతది. మీకు నీళ్లిచ్చి నా పొలాన్ని ఎండవెట్టుకోవాల్నా..?’ అని ఆ రైతు నాతోని లొల్లి వెట్టుకున్నడు. ఆఖరికి నీళ్లిచ్చే దాన్క నా బిడ్డ ఇడ్సిపెట్టలే. ఆ రైతుకు వశపడక ఇగ ముళ్ల కంపలు తీసిండు. అప్పుడు చెరో బిందె నీళ్లు తోడ్కొని ఇంటిమొకానొచ్చినం.
(2014, జూన్ 2): తెలంగాణొచ్చింది. ఇప్పుడు మా లింగోటం ఊరుకు ‘మిషన్ భగీరథ’ ప్లాంటొచ్చింది. నాగార్జునసాగర్ కిందున్న అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఈడికి సక్కగ కృష్ణా నీళ్లొస్తయి. ఇక్కన్నుంచే అవి ఫిల్టరయి ‘మిషన్ భగీరథ’ పైపుల నుంచి ఇంటింటికి చేర్తయి. ఎన్కట సుక్క నీళ్లు లేని లింగోటం నుంచే నాంపల్లి, మర్రిగూడ, నారాయణపురం, గట్టుప్పల్, చౌటుప్పల్, చింతపల్లి మండలాలకు నీళ్లిస్తున్నరు. కొత్తగ నల్లా నీళ్లచ్చినప్పుడు ఒగ సం బురం గాదు. నల్లా నీళ్లకు చెయ్యివెట్టి అపురూపంగ ఆడుకున్న.
మా ఊరబాయి కన్లకు కనవడకుండా మాయమైంది. నాడు బిందె వట్టుకొని గుం తల కాడికి వొయ్న, ఇప్పుడు ఏ గుంత కాడికి పోవుడు లేదు. ఇంటికాన్నే నీళ్లు రావట్టె. ఎగిలివారంగ ఆరు గొట్టంగ అలారం మోగినట్టు వినిపిస్తది… నల్లా నీళ్లొచ్చే ముందు గుడ్గుడ్మని సప్పుడు. ఓ మూడుగంటల సేపు ఆగకుంటా వోత్తది. బిందెల వడే నీళ్ల పొంగును సూసినప్పుడల్లా గంటెతోని తోడుకచ్చుకున్న బాధలు కండ్లళ్ల కనిపిస్తయి. నల్లా నుంచి తెల్లగొస్తున్న ఆ నీళ్లను జూసి మా ఊరోళ్లంతా నీళ్ల బాధ తీరిందని ఎంత మురుస్తున్నరో ఇప్పుడు.
గడ్డం సతీష్: 99590 59041