2025లో జపాన్ను దాటి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇటీవల ఐఎంఎఫ్ ప్రకటించింది. అయితే, ఈ అంచనా సగటు భారతీయుడి జీవన వాస్తవాలను కప్పిపుచ్చినప్పటికీ, దాన్ని విస్మరిస్తూ దేశంలోని ఓ వర్గం మీడియా సంబురాల్లో మునిగిపోయింది. భారత్ ఇప్పటికే జపాన్ను దాటేసిందని గతవారం నీతిఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యలనూ కొన్ని చానళ్లు ఈ సందర్భంగా ఉటంకించాయి. అయితే, నీతి ఆయోగ్ సభ్యుడు అర్వింద్ వీరమణి సహా పలువురు ఆర్థిక నిపుణులు ఈ వాదనను తోసిపుచ్చారు.
ఐఎంఎఫ్ అంచనా ప్రధాని మోదీ 2047 విజన్‌లో భాగమని పలు మీడియా సంస్థలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. అయితే, ఈ అంచనాపై అనుమానాలు వ్యక్తం చేసినవారిని కొన్ని చానళ్లు ఆపరేషన్ సిందూర్ తర్వాత కాల్పుల విరమణను ప్రశ్నించిన సంశయవాదులతో పోల్చాయి. ఈ సందర్భంగా ఒక వింత పోలిక కూడా తెరపైకి వచ్చింది. అదేమిటంటే.. ‘సంతోష సూచీలో భారత్ కంటే పాకిస్థాన్ మెరుగైన స్థానంలో ఉంది. ఎందుకంటే, ప్రతి విజయంపై అనుమానం వ్యక్తంచేసే, విమర్శించే వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. కానీ, దాయాది దేశ ప్రజలు అలా కాదు. యుద్ధంలో ఓడినా వారు సంతోషంగా ఉంటారు’.ఐఎంఎఫ్ అంచనాను ప్రధాని ఆర్థిక విధానాలకు ఆపాదిస్తూ.. ‘మోదీ ఆర్థిక విధానం భారత్‌ను ముందుకు తీసుకెళ్తున్నది’ అని పలు మీడియా సంస్థలు శీర్షికలు వెలువరించాయి. కొంతమంది టీవీ యాంకర్లు ‘ఇది గొప్ప విజయం’ అని జబ్బలు చరుచుకున్నారు. ‘భారతదేశం సూపర్ పవర్’గా అవతరించిందని కూడా కొన్ని చానళ్లు ప్రసారం చేశాయి. అదీ చాలదన్నట్టు ‘జపాన్ను భారత్ ఓడించింది’ అని మరికొందరు దుందుడుకు టీవీ యాంకర్లు తీర్మానించేశారు. భారత్ సూపర్ పవర్‌గా అవతరిస్తున్నదని చెప్పేందుకు ఇది సూచిక అని పలు హిందీ పత్రికలు రాసేశాయి.
అయితే, చాలా తక్కువ మీడియా సంస్థలు మాత్రమే ఐఎంఎఫ్ ఏం చెప్పిందనే వాస్తవాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాయి. సగటు భారతీయుడి కోణంలో తలసరి ఆదాయం, మానవాభివృద్ధి సూచీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవాలను ప్రజల ముందుంచాయి. ఉదాహరణకు భారత్ తలసరి జీడీపీ ఇప్పటికీ 2,500 డాలర్లలోపు మాత్రమే. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో ఇదే అత్యల్పం. మన దేశంలో శిశు మరణాల రేటు 24.5. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఐదు దేశాల్లో ఇదే అత్యధికం. భారత్‌లో 93.3 శాతం ప్రజలు మాత్రమే స్వచ్ఛమైన నీటిని పొందగలుగుతున్నారు (ఇది కూడా అత్యల్పమే). దేశంలోని 78 శాతం మందికి మాత్రమే సురక్షితమైన పారిశుద్ధ్య వసతి అందుబాటులో ఉంది. సంతోష సూచీలో భారత్ 118వ స్థానంలో ఉంది. ఈ విషయంలో ఇతర టాప్ ఆర్థిక వ్యవస్థలు గల దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉన్నది.
2010 నుంచి 2023 వరకు భారత ప్రధాన ఆర్థిక సూచికలు తలసరి జీడీపీ, మానవాభివృద్ధి సూచీ, శిశు మరణాల రేటు తదితర అంశాల్లో ఇతర దేశాలతో పోల్చి చూస్తే విశ్లేషణలు ఇలా ఉన్నాయి. అయితే, ఇందులో వియత్నాం, కామెరూన్, సూడాన్ దేశాల వివరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే, 2010లో ఈ దేశాల తలసరి జీడీపీ భారత్‌తో సమానంగా ఉన్నది.