దేశంలో ఎక్కడైనా నక్సలైట్లకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయంటే ముందుగా తెలుగు గుండె కలవరపెడుతుంది. పోలీసులు వేటాడే ప్రాంతాలు ఆంధ్ర-ఒడిశా బార్డర్, దండకారణ్యం, అబూజ్మడ్ పేరేదైనా ఆ అడవుల్లో తూటాలకు రాలిపోయే ప్రాణాల్లో తెలుగువారివే ఎక్కువ. ఇంకా విడమరిచి చెప్పాలంటే అవి తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాలకు చెందిన బిడ్డలవే. 1970ల్లో ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మొదలైన నక్సలైట్ల ఉద్యమం ఉత్తర తెలంగాణకు పాకి రెండు, మూడు దశాబ్దాల పాటు తన ఉనికిని చాటుకున్నది.
1978లో జగిత్యాల, సిరిసిల్ల కల్లోలిత ప్రాంతాల ప్రకటన, కేంద్ర బలగాల మోహరింపు వల్ల ఆత్మరక్షణలో పడిన నక్సలైట్లు నల్లమల అడవుల్లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. 2004లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వారిని చర్చలకు పిలిచినా, అవి మధ్యలోనే ఆగిపోయాయి. అదే అదనుగా ప్రభుత్వం నల్లమలలో వారి గుట్టును పసిగట్టగలిగింది. వై.ఎస్. కాలంలో ఎందరో నక్సలైట్లు చనిపోగా మిగిలినవారు సరిహద్దు రాష్ర్టాల్లోని అడవుల్లో తలదాచుకుంటున్నారు. ఛత్తీస్గడ్, ఝార్ఖండ్‌లోని గిరిజనులను తమ దళాల్లో చేర్చుకుంటూ వారి హక్కుల రక్షణ కోసం వీలైన పోరాటాన్ని నడుపుతున్నారు. తొలినాళ్లతో పోల్చితే అసలు నక్సలిజం మూలకు పడిందనే చెప్పాలి.
2014లో కేంద్రంలో ఎన్డీయే పాలన మొదలైన నాటినుంచి దేశంలో నక్సలైట్ అనే ప్రాణి ఊపిరి తీసుకోవద్దని బీజేపీ నిర్ణయించుకున్నది. ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాల వేట మొదలైంది. అయితే, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న అడవిపై నక్సలైట్లకు పూర్తి పట్టు ఉండటం వల్ల పోలీసుల శ్రమకు తగ్గ ఫలితం ఉండేది కాదు. గత ఏడాది నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ఓ స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టారు. పోలీసు దళాల పెంపు, అధిక నిధుల కేటాయింపు, ఆధునిక ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థ ఉపయోగం వల్ల అడవిలో దాక్కున్నవారికి ఊపిరి సలపలేని పరిస్థితి ఏర్పడింది. చిట్టడివిలో, చీకట్లో ఉన్నా డ్రోన్ల సాయంతో కనుగొని మావోయిస్టులను ఏరివేస్తున్నారు.
దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేస్తానని అమిత్ షా అనగానే విప్లవవాదులు ఆ మాటను ఎద్దేవా చేస్తూ ప్రకటనలు ఇచ్చారు. కమ్యూనిజాన్ని నామ రూపాల్లేకుండా చేస్తామని చరిత్రలో ఎందరో అన్నారు. అన్నవారే పోయారు తప్ప కమ్యూనిజం ఇంకా బతికే ఉన్నదని ఉదాహరణలు ఇచ్చారు.
గత ఏడాది పోలీసు తూటాలకు 233 మంది మావోయిస్టులు బలయ్యారు. వారిలో ఏడుగురు కీలక నేతలున్నారు. ఈ మృతుల్లో పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్ ప్రాంతాలకు చెందినవారే ఎక్కువ.
జనవరిలో గరియాబంద్ ఎన్కౌంటర్లో 14 మంది తీవ్రవాదులు చనిపోయారు. వారిలో ముగ్గురు ముఖ్యనేతలున్నారు.
ఈ నెల 9న ఇంద్రావతి నేషనల్ పార్క్ వద్ద జరిగిన కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2025లో 40 రోజుల్లో 86 మంది హతులయ్యారు. ఒక్కో ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో విప్లవకారులు చనిపోవడంతో భద్రతాదళాలు భారీ విజయాలను సాధిస్తున్నాయంటూ అమిత్ షా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ధీమాగా మార్చి, 2026 నాటికీ దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చుతామని అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుతం అడవిలో నేతల లక్ష్యంగా భద్రతాదళాల కదలిక సా గుతున్నది. అలా వారు టార్గెట్ చేసిన నేతల్లో తెలుగువారే అధికం. అందులో 23 మంది నాయకులు తెలంగాణకు చెందినవారే. కేంద్ర బలగాల జోరు చూస్తుంటే వీరిని చేరుకోవడం అసాధ్యం కాదనిపిస్తున్నది. ఏ క్షణం ఏ అగ్రనేత మరణవార్త వినవస్తుందో అనేలా పరిస్థితులున్నాయి. దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేస్తానని అమిత్ షా అనగానే విప్లవవాదులు ఆ మాటను ఎద్దేవా చేస్తూ ప్రకటనలు ఇచ్చారు. కమ్యూనిజాన్ని నామ రూపాల్లేకుండా చేస్తామని చరిత్రలో ఎందరో అన్నారు. అన్నవారే పోయారు తప్ప కమ్యూనిజం ఇంకా బతికే ఉన్నదని ఉదాహరణలు ఇచ్చారు. భావోద్వేగంతో కొందరు ‘ఒక వీరుడు మరణిస్తే వేన వేలు ప్రభవింతురు’ అన్న కవితాపంక్తులను ఉటంకించారు. వారన్నట్టు కమ్యూనిజం ఓ సిద్ధాంతం. దాన్ని ఆచరించేవారు పెరగవచ్చు, తగ్గవచ్చు కానీ సిద్ధాంతానికి చావు లేదు.
అయితే, ఇప్పుడు మరణిస్తున్నవారికి జోహార్లు అంటే సరిపోతుందా? వారి శవాల ముందు ‘అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం’ అని పిడికిలి బిగించి నినదిస్తే ఉద్యమం బతుకుతుందా? పోలీసులకు చిక్కకుండా నానా కష్టాలు పడుతూ తప్పించుకు తిరుగుతున్నవారు అలా చావడం అవసరమా? ఆ చావు అమరత్వమే అయినా అది నిష్ఫల త్యాగమే కదా! వారికి మనలా బతికే అవకాశమే లేదా! వాళ్లు దేశంపై దాడి చేస్తున్న విదేశీ శక్తులు కారు, ఈ దేశ పౌరులు. వాళ్లు దోపిడీ దొంగలు కారు, దేశ సంపదను అందరూ సమానంగా అనుభవించాలని కోరుకుంటున్న ఉద్యమకారులు. ఒక ఆశయానికి కట్టుబడి యుద్ధం చేస్తున్నవారు ఓటమి అంచున ఉన్నారు. మీరు బతకాలనుకుంటున్నారా, లేక ఇలాగే ఎదురు కాల్పుల్లో చనిపోవాలనుకుంటున్నారా.. అనే ఒక్క అవకాశాన్ని వారికివ్వడం కుదరదా! అబూజ్మడ్ ఏరియాలో కొన్ని బేస్ క్యాంపులు ఏర్పాటుచేసి ‘లొంగిపోండి.. లేదంటే చంపే స్తాం!’ అని స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఆ హామీని ఎంతవరకు నిజాయితీగా అమలుచేస్తున్నారో తెలియదు. ఇప్పుడు అమిత్ షా ‘ఎన్కౌంటర్ స్కోరెంత’ అన్నట్టుగా ఉన్నారు. బలగాలు కూడా అదే జోష్‌లో ఉన్నాయి.
ప్రభుత్వాలు ఎందరిని చంపినా ఎవరో ఒకరు మళ్లీ విప్లవం అంటూ పుట్టుకొస్తూనే ఉంటారు. అలాగని ఇప్పుడు అడవిలో ప్రాణాలు కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నవారిని వదిలేయలేం. వారిలో లొంగిపోయేందుకు ఇష్టపడేవారికి ఓ అవకాశం ఇవ్వాలి. చస్తే అమరత్వం కన్నా బతికే జీవితమే గొప్పది. అడవిలో మిగిలిన మావోయిస్టులకు, వేట సాగిస్తున్న ప్రభుత్వానికి మధ్య ఓ మధ్యవర్తిత్వం కావాలి. ఇలాంటి పనులు పౌరహక్కుల నేతలు, ప్రజాస్వామ్యవాదులు గతంలో చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ చొరవ తీసుకోవాలి.
కొంతకాలం రెండువైపులా కాల్పులు ఆపేసి అన్నల్లో ఎంతమంది జనజీవన స్రవంతిని కోరుకుంటున్నారు, వారికి ఎలాంటి క్షమాభిక్ష పెడతారని సంప్రదింపులు ప్రభుత్వం హామీపై జరగాలి. మావోయిస్టుల్లో ఎక్కువమంది తెలంగాణకు చెందినవారే ఉన్నందున ఇక్కడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ బాధ్యత తీసుకోవాలి. పిట్టల్లా రాలిపోతున్న వారి పేర్లు, ఊర్లు, వివరాలు పత్రికల్లో వస్తున్నాయి. వారి ఊర్లలో అంతిమయాత్రల వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అదేదీ తమకు సంబంధం లేనట్టు పూర్తిగా పట్టనట్టుంది.
గత ఏడాది అక్టోబర్ 7న ఢిల్లీలో హోం శాఖ ఆధ్వర్యంలో నక్సల్స్ ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం జరిగింది. అందులో తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. నక్సల్స్ నిర్మూలనలో ఆచరించవలసిన వ్యూహాలు, అందులో రాష్ర్టాల పాత్ర, సహకారం గురించి ఆ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తున్నది. అప్పటికి కొన్ని రోజుల ముందు దంతెవాడలో ముప్ఫై మంది మావోయిస్టులు చనిపోయారు. అడవిలో ఉన్న తెలంగాణ వాసులు పోలీసు తూటాలకు బలికాకుండా కాపాడేందుకు ప్రభుత్వం కృషిచేయాలి. మేధావుల సూచనలు తీసుకొని వారిని రక్షించే పని ప్రభుత్వాలకే సాధ్యమవుతుంది.
– బద్రి నర్సన్ 94401 28169