సమాజ వైఖరి- రేపటి తరాన్ని చూస్తే చాలా భయం వేస్తున్నది. ఒక వెఱపు పుడుతున్నది… రోజు రోజుకూ ఎంత అనాగరికులమైపోతున్నామో కదా! అని సిగ్గేస్తున్నది. ఆటవిక సమాజంలో బతకడానికి అసహ్యమేస్తున్నది. దినదినగండం నూరేండ్ల ఆయుష్షు వలె ఉన్నది. అధికారంలో ఉన్నవారికి ఇలా అనిపించడంలేదంటే ఏమనుకోవాలి? అత్యాచారాలకు పాల్పడుతున్న ప్రముఖుల వంశోద్ధారకులకు నైతిక విలువలు అవసరంలేదా? లేక ప్రముఖుల పిల్లలు కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే నిర్లక్ష్యమా? ఇలాంటి ఘటనలు వెరసి సమాజానికి ఏం చెప్తున్నట్టు? వీరి వల్ల జీవితాలు నాశనమైన అనామకులైన ఆడపిల్లలకు ఎలాంటి న్యాయం చేకూర్చవచ్చు? ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలి? దోషులకు శిక్షలు పడకుండా అడ్డుకుంటున్న బడాబాబులది ఇష్టారాజ్యమైనప్పుడు బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రజల్లో ప్రశ్నలు మెదులుతున్నాయి.
నేటి సమాజంలో ‘ప్రముఖుల పిల్లలం’ అనే ముసుగులో కొంతమంది చేస్తున్న అరాచకాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఉన్నత కుటుంబాల్లో పుట్టి, సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన వారే అమానవీయ ఘటనలకు పాల్పడటం వెనుక బలమైన కారణాలు, భయంకరమైన పరిణామాలు కనబడుతున్నాయి. అరాచకానికి మూలం… నిర్లక్ష్యమా? అహమా? ఈ వికృత పోకడలకు ప్రధాన కారణం.. ‘మా నాన్నకు అధికారం ఉన్నది, మా వెనుక బలగం ఉన్నది, మేము ఏం చేసినా చెల్లుతుంది’ అనే అహంకారం వారిలో నైతిక విలువలను పతనం చేస్తున్నది. విలువలలేమి తనంతో సంపదను, అధికారాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు బాధ్యతను, క్రమశిక్షణను నేర్పడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అధికారాన్ని ఉపయోగించి, శిక్షను రద్దు చేసుకోవచ్చనే ధీమా, పోలీసులకు పట్టుబడినా వెంటనే బయటకు రావొచ్చనే ధైర్యం.. అధికారంలో ఉండి వ్యవస్థను శాసించగలమనే నమ్మకం.. వారిని నేరాల వైపు పురికొల్పుతున్నది.
బరితెగించిన బడాబాబుల పిల్లల చేతిలో అభాగ్యులైన ఆడపిల్లల జీవితాలు ఛిద్రమైనప్పుడు, న్యాయం అనేది ఒక అందని ద్రాక్షలా మారుతున్నది. నిందితులు అధికార పార్టీకి చెందినవారో, బడాబాబుల పిల్లలో అయినప్పుడు సాక్ష్యాల తారుమారు, పోలీసుల మీద ఒత్తిడి.. వ్యవస్థాగత అడ్డంకులు సర్వసాధారణం. న్యాయం జరగాలంటే బాధితులకు ఉచిత న్యాయసహాయం, సామాజిక మద్దతు, సాక్షుల రక్షణ అత్యవసరం. నిందితుల స్థాయిని చూడకుండా చట్టం తన పని తాను చేసుకుపోయే వాతావరణం, బాధితులకు భరోసా కల్పించాలి. కానీ ఒక ఘటన జరిగి మరిచిపోకముందే మరిన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అకృత్యాలు ఆగాలంటే కఠినమైన చట్టాలు ఉంటే మాత్రమే సరిపోదు, వాటిని సక్రమంగా అమలు చేయటం ముఖ్యం. ఏండ్ల తరబడి విచారణ జరిగితే నేరస్థులకు భయం ఉండదు. నెలల వ్యవధిలోనే శిక్ష పడాలి. నేరం చేసిన వాడు నేరస్థుడే తప్ప ‘ ప్రముఖుడి కొడుకు’గా పరిగణించకూడదు.
ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న దారుణమైన ఘటనలు సమాజానికి ఒక చేదు నిజాన్ని చెప్తున్నాయి. అదేంటంటే ‘మనం నిర్మిస్తున్న సమాజం విలువల మీద కాకుండా అధికారం మీద ఆధారపడి ఉన్నది! బాధితులకు న్యాయం జరగనప్పుడు, నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు సామాన్యుడికి చట్టం మీద నమ్మకం పోతుంది. ఇది అరాచకానికి దారి తీస్తుంది. అధికార గర్వంతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే బడాబాబుల వారసులు వంశోద్ధారకులు కాదు, వంశ నాశకులు. చట్టం దోషి వెనుక ఉన్న అధికారాన్ని కాకుండా, బాధితురాలి కండ్లలోని కన్నీటిని చూడాలి.
వ్యవస్థలు సక్రమంగా పనిచేయని చోట ప్రజాస్వామ్యం విఫలమవుతుంది. కాబట్టి, ఇలాంటి అన్యాయాల పట్ల ప్రతి ఒక్కరూ పోరాడాలి. న్యాయం ఆలస్యమవ్వడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే! గతంలో బాధితుల పక్షాన ప్రజలు భారీఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం వల్ల మాత్రమే వ్యవస్థలో కదలిక వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
జెస్సికాలాల్ హత్య కేసు (1999) – మను శర్మ ఈ కేసు భారత న్యాయ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైనది. ఒక కేంద్రమంత్రి కుమారుడైన మను శర్మ డ్రింక్ ఇవ్వలేదనే కారణంతో జెస్సికాలాల్ అనే యువతిని కాల్చి చంపాడు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో సాక్షులు వెనక్కి తగ్గడంతో 2006లో నిందితుడు నిర్దోషిగా విడుదలయ్యాడు. అప్పుడు ప్రజలు, మీడియా కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేశారు. దీనివల్ల కేసును మళ్లీ విచారించి, మనుశర్మకు జీవిత ఖైదు శిక్ష విధించారు. రికార్డు స్థాయిలో వేగంగా విచారణ జరగింది కనుక…. ప్రియదర్శిని మట్టూ కేసు (1996)- సంతోష్కుమార్సింగ్.. ఒక ఐపీఎస్ అధికారి కుమారుడు తనను వేధిస్తున్నాడని ప్రి యదర్శిని మట్టూ అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె దారుణ హత్యకు గురైంది. కింది కోర్టు నిందితుడిని వదిలేసినప్పటికీ, సామాజిక ఒత్తిడి, సీబీఐ పట్టుదల వల్ల ఢిల్లీ హైకోర్టు అతనికి మరణశిక్ష విధించింది (తర్వాత అది జీవిత ఖైదుగా మారింది). ఈ కేసు ద్వారా చట్ట వ్యవ స్థ మీద ప్రభావం పడే వ్యక్తుల పిల్లలు కూడా చట్టానికి అతీతులు కారు అనే సందేశం సమాజంలోకి వెళ్లింది.
నిర్భయ ఘటన (2012) తో చట్టాల్లో సమూల మార్పులు జరిగాయి. ఢిల్లీలో జరిగిన ఈ పాశవిక ఘటన దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. నిందితుల్లో ఒకరు మైనర్ (జువైనల్) కావడంతో తక్కువ శిక్షతో బయటపడటం పెద్ద వివాదానికి కారణమైంది. ప్రభుత్వం జస్టిస్ వర్మ కమిటీని నియమించింది. దీని ఫలితంగా 2013లో క్రిమినల్ లా (అమెండ్మెంట్) యాక్ట్ వచ్చింది. అత్యాచారానికి కఠిన శిక్షలు, వేధింపులు, యాసిడ్ దాడులపై కొత్త సెక్షన్లు చేర్చారు. అలాగే, 16-18 ఏండ్ల మధ్య ఉన్న వారు ఘోరమైన నేరాలకు పాల్పడితే వారిని పెద్ద’ గానే పరిగణించాలని జువైనల్ చట్టాన్ని సవరించారు. మరో కేస్ ఉన్నావ్ (2017), హాథ్రస్ (2020) ఘటనల్లో నిందితులుగా ఉన్నారు. ఇక్కడ నిందితులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారు. కుల్దీప్సింగ్ సెంగార్ – మాజీ ఎమ్మెల్యే.
బాధితుల కుటుంబాలపై దాడులు జరిగినా, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కేసులను రాష్ట్రం దాటించి ఢిల్లీలో విచారణ జరిపించింది. నిందితుడికి జీవిత ఖైదు పడటంతో పాటు, ఆ రాజకీయ పార్టీ అతన్ని బహిష్కరించాల్సి వచ్చింది. జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగినా, ఏ పోలీస్ స్టేషన్లోనైనా కేసు నమోదు చేయవచ్చు. పరిధి పేరుతో పోలీసులు తప్పించుకోలేరు.
ప్రత్యేకంగా మహిళలపై జరిగే నేరాల కోసం వీటిని ఏర్పాటు చేశారు. పోక్సో చట్టం మైనర్లపై జరిగే లైంగిక వేధింపులకు కఠిన శిక్షలు అమలులోకి వచ్చాయి. బడాబాబులు కేసులను అణచివేయాలని చూసినా విషయాన్ని సోషల్ మీడియా ప్రజల్లోకి తీసుకెళ్తువ్యవస్థపై ఒత్తిడి పెంచటం సాధ్యమవుతున్నది. చట్టాలు ఎన్ని ఉన్నా, అమలు చేసే చోట అధికార గర్వం అడ్డుపడుతూనే ఉన్నది. దీనికి ప్రధాన పరిష్కారం. సత్వర న్యాయం అనేది కేవలం బాధితులకు ఊరట మాత్రమే కాదు, నేరస్థులకు ఒక బలమైన హెచ్చరిక. మన దేశంలో న్యాయం ఆలస్యమవ్వడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే మాట ఎప్పుడూ వినిపిస్తున్నది. ఈ పరిస్థితి మారి, వేగంగా న్యాయం జరగాలంటే ఈ సమూల మార్పులు రావాలి. పోలీస్, దర్యాప్తు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి. న్యాయం ఆలస్యం కావడానికి మొదటి కారణం దర్యాప్తులో జాప్యం. పోలీసులకు బందోబస్తు పనులు, విచారణ పనులు వేర్వేరుగా ఉండాలి. దర్యాప్తు చేసే అధికారులకు ప్రత్యేక శిక్షణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి. నేరం జరిగిన నిర్ణీత కాలంలోనే పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయడం తప్పనిసరి.
పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసేలా ఉండాలి! వారిపై రాజకీయ ఒత్తిడులుండకూడదు. న్యాయవ్యవస్థలో మౌలిక మార్పులు చేయాలి. కేసులు ఏళ్ల తరబడి సాగకూడదు. వాయిదాల సంస్కృతికి స్వస్తి చెప్పాలి. చిన్న కారణాలతో లాయర్లు వాయిదాలను కోరకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి. బాధితులు, సాక్షుల రక్షణ లేక బడా బాబులు సాక్షులను బెదిరించడం వల్ల కేసులు వీగిపోతుంటాయి. సత్వర న్యాయం అనేది కేవలం కోర్టుల బాధ్యత మాత్రమే కాదు, సమాజం కూడా బాధితుల పక్షాన నిలబడాలి. నిర్భయ ఘటనలో జరిగినట్లుగా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు వ్యవస్థలు వేగంగా స్పందిస్తాయి. చట్టం ముందు అందరూ సమానులే అనే భావన వస్తేనే సామాన్యుడికి భరోసా కలుగుతుంది.
– రంగరాజు పద్మజ
99897 58144