తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను ఏవో కారణాలు చూపి తీసేయ ప్రయత్నించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇందుకుగాను ప్రభుత్వం చెప్పే కారణాలు సముచితం కాదు. కాకతీయ రాజుల పాలన గురించి తెలంగాణలోని మెజారిటీ ప్రజలకు సదభిప్రాయమే ఉన్నది. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులకు ఉన్న ప్రాశస్త్యం తెలిసిందే. గొలుసు కట్టు చెరువుల వల్ల వాన నీటిని వృథా కాకుండా నిల్వ చేసి తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవడానికి కాకతీయులు కృషిచేశారు. ఆ చెరువులను కుతుబ్‌షాహీ రాజులు, నిజాం రాజులు కూడా జాగ్రత్తగా కాపాడారు. ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ చెరువుల గొలుసు కట్టు తెగిపోయింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చెరువులను బాగుచేసింది. ఇలాంటి చరిత ఉన్న కాకతీయుల తోరణంలో రాచరిక పోకడలు కూడా లేవు. తెలంగాణ ముఖద్వారంగా అది ప్రశస్తి పొందింది. అలాంటి చిహ్నాన్ని తీసేయాలని చూడటం సరైంది కాదు. హైదరాబాద్ అనగానే భారతీయులు, విదేశీయులు మొదటగా చార్మినార్ గుర్తుకువస్తుంది. ఇది రాచరిక చిహ్నం కాదు. హైదరాబాద్ నగరంలో ప్లేగు వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోతే ఆ మహమ్మారి చేసిన విపత్తుకు స్మృతి చిహ్నంగా చార్మినార్ కట్టించాడు కుతుబ్‌షాహీ రాజు కులీ కుతుబ్ షా! 400 ఏండ్లుగా అది తెలంగాణకు, హైదారాబాద్‌కు గుర్తుగా ఉన్నది. దాన్ని రాష్ట్ర చిహ్నంలో కేసీఆర్ పెట్టాడు కాబట్టి, ఇప్పుడు తొలగించాలని చూడటం సరైంది కాదు.
– సింగిడి తెలంగాణ రచయితల సంఘం