తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దశాబ్దాల ముందు నుంచే ఈ ప్రాంత ప్రజలు అనేక అసమానతలు, అన్యాయాలు, అణచివేతలను ఎదుర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా అన్యాయానికి గురైంది. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ప్రాంత రైతులకు భూగర్భజలాలే ఆధారం. అందుకు అత్యంత ఆవశ్యకమైన విద్యుత్ నాణ్యత లేక, ఆధునిక సాగుపద్ధతులు చేపట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు రెండు మూడు గంటలకే పరిమితమైన విద్యుత్ సరఫరాతో బోరు బావులపై ఆధారపడిన రైతులు నష్టాలను భరించాల్సి వచ్చింది.
2000వ దశకం ఆరంభంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యుత్ చార్జీలను గణనీయంగా పెంచడం వల్ల అప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ రైతాంగానికి పెనుభారంగా మారింది. ఆ సమయంలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో కొందరు ఉద్యమకారులు, రైతులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకర పరిణామం.
ఈ నేపథ్యంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శాసనసభలో చేసిన ప్రసంగం చరిత్రాత్మకంగా నిలిచింది. ఆ ప్రసంగం ద్వారా ఆయన స్పష్టంగా లేవనెత్తిన అంశాలు పాలకులకు మింగుడు పడలేదు. తెలంగాణ ప్రాంతం పూర్తిగా బోరుబావులపై ఆధారపడిన వ్యవసాయ విధానం కలిగి ఉండగా, ఆంధ్రా ప్రాంతంలో కాలువల ద్వారా అందే ఉచిత నీటి ద్వారా సాగు జరుగుతోందని, ఇక్కడ పెరిగిన విద్యుత్ చార్జీలు తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా, అశనిపాతంలా మారబోతున్నాయని, ఇది తెలంగాణ రైతు వ్యతిరేక నిర్ణయమని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను కేవలం నిరసనకే పరిమితం చేయకుండా, తాను తెలుగుదేశం పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి తేది 27.4.2001 నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే కొత్త పార్టీని స్థాపించారు.
అక్కడనుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. పదమూడు సంవత్సరాల పాటు అలుపెరుగని ఉద్యమ స్ఫూర్తి నిటారుగా నిలబడింది. దీక్షలు, నిరసనలతో ఈ ప్రాంతం చైతన్యం పులుముకుంది.
ప్రజా సంఘాలను, న్యాయవాదులను, ఉద్యోగులను, విద్యార్థులను సమీకరించి వారితో కలసి ఉద్యమాలను నడిపి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతినిధిగా మారారు. ఈ పోరాటంలో సమాజంలోని అన్ని వర్గాల మద్దతు తోడవ్వడంతో చివరికి ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని ప్రకటించి ఆమరణ దీక్షకు దిగడంతో గత్యంతరం లేని పరిస్థితిలో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటనతో ముందుకు కదిలింది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐక్యత, ఆందోళనలు, నిరసనలు, తర్వాత అభివృద్ధి పథానికి సోపానాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణపై రాజకీయంగా, మతపరంగా, ఆర్థికపరంగా అనేక భయాలను ప్రజల్లో నాటడానికి ప్రయత్నించారు. 2013-14లో విభజన చర్చలు తీవ్రమవుతున్న సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో విద్యుత్తుపై చేసిన ప్రసంగం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ విడిపోతే అక్కడ విద్యుత్ కొరత తీవ్రమవుతుందని, చీకటి అలుముకుంటుందని, పెట్టుబడులు రావని, వ్యవసాయరంగం మరింత కుంటుపడుతుందని హెచ్చరించారు. ఆయన తన ప్రసంగంలో ‘తెలంగాణ చీకటిమయమవుతుంది’ అనే పదబంధాన్ని వాడారు. అది ప్రజల మనసుల్లో భయం కలిగించడానికి, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఉద్దేశించి చేసిన ప్రసంగం.
తెలంగాణ ఏర్పడిన 6 నెలల వ్యవధిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రజల ఆలోచనలో సానుకూల మార్పును ప్రతిబింబించాయి. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకొని ఘనవిజయం సాధించింది. ఇది తెలంగాణ రాష్ర్టాన్ని ప్రతిబంధకాల నుంచి అభివృద్ధి దిశగా తీసుకువెళ్లగలిగిన నాయకత్వానికి ప్రజలు వేసిన విశ్వాసపు ఆమోదముద్ర అని చెప్పవచ్చు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి కమ్మేస్తుందని హెచ్చరించినవారు, ఈ రాష్ట్రమే విద్యుత్ స్వయం సమృద్ధితో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందనే భవిష్య దృశ్యాన్ని ఊహించలేకపోయారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధిని సాధించిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలకు కల్పించిన భయాల్ని అధిగమించి ఆశావహమైన పథంలో దూసుకెళ్లింది. ఇది దార్శనిక నాయకత్వ ఫలితం. ప్రజల సహకారం, పాలకుడి సంకల్ప బలానికి నిలువెత్తు సాక్ష్యం.
శాంతిభద్రతల పరంగా కేసీఆర్ తీసుకున్న స్థిరమైన, నియంత్రిత విధానాలు రాష్ర్టాభివృద్ధ్దికి వెన్నెముకగా నిలిచాయి. శాంతియుత వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ మంచి పేరు సంపాదించుకున్నది. దీంతో ప్రగతి పరుగులు పెట్టింది…
రాష్ట్ర విభజన అనంతరం కూడా రాజకీయంగా కుట్రలతో చీకటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలుపొందిన చంద్రబాబునాయుడు తన కుటిలనీతితో, తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయించుకోవడంతో పాటు యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి 13 పైసల ఖర్చుతో 600 మెగావాట్ల విద్యుత్తును అందించే సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వం కేసీఆర్‌ను సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్‌కు ఏకపక్షంగా ధారాదత్తం చేయడం తెలంగాణ ప్రజల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇదంతా రాజకీయ ప్రతీకార ధోరణితో తీసుకున్న చర్య.
అయితే ఈ కష్టకాలాన్ని తన దార్శనికతతో సమర్థవంతంగా ఎదుర్కొనగలిగిన నాయకత్వానికి కేసీఆర్ ప్రతీకగా నిలిచారు. రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణకు ప్రత్యేక విద్యుత్ ప్రణాళికలను కేసీఆర్ సిద్ధం చేసుకున్నారు. నూతన విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల వైపు దృష్టి సారించడం వంటి చర్యలతో తక్కువ సమయంలోనే విద్యుత్‌లో తెలంగాణ స్వయంసమృద్ధిని సాధించేలా అన్ని ప్రయత్నాలు చేస్తూనే, అప్పుడున్న తక్షణ విద్యుత్ సమస్యను అధిగమించడానికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకోవడమే కాకుండా యుద్ధప్రాతిపదికన సరఫరా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రైవేటు రంగంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ అతితక్కువ కాలంలోనే నాణ్యమైన, కోతలు లేని విద్యుత్‌ను అన్ని వర్గాల వినియోగదారులకు అందజేయడంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్‌ను వ్యవసాయానికి అందించడం ద్వారా కేసీఆర్ సమర్థతకు ప్రతీకగా నిలిచారు.
తెలంగాణ ఏర్పడితే తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడి చీకటిమయం అవుతుందని, శాంతిభద్రతలు క్షీణిస్తాయని, మతకలహాలు భగ్గుమంటాయని, నక్సలైట్ ప్రభావం పెరుగుతుందని, పెట్టుబడిదారులు రారని, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందనే భయాల్ని అప్పటి ఏకీకృత రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి. అయితే వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో పెట్టుబడులు పెరిగాయి. ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందింది. శాంతి భద్రతలు మెరుగయ్యాయి. అనేక కంపెనీలు హైదరాబాద్‌నే తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుని పరుగులు తీసింది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గాథలో విద్యుత్ రంగానిది కీలకమైన పాత్ర. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యుత్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు.
ఈ ప్రయాణం ఒక్క నాయకుని సంకల్పబలంతో, ప్రజల విశ్వాసంతో, ఉద్యమ స్థాయిలో సాగిన నిరంతర కృషితో సాధ్యమైంది. విద్యుత్ సమస్య ఒక ప్రాంతీయ ఉద్యమానికి, చివరికి రాష్ట్ర స్థాపనకు మౌలిక ప్రేరణ కావడం రాజకీయ చరిత్రలో అరుదైన ఘటన. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో దేశానికే ఆదర్శంగా మారడంలో ఆ ఉద్యమం వేసిన పునాది పాత్ర మరువలేనిది.
సారాంశంగా చెప్పాలంటే, ఒక విద్యుత్ ధర పెంపుతో ప్రారంభమైన అసంతృప్తి, ఒక రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన చారిత్రక పరిణామ క్రమం ఇది. ఈ క్రమంలో ప్రజాసంకల్పానికి, నాయకత్వ పటిమకు, ఉద్యమ శక్తికి ఈ ఉదంతం ఒక మార్గదర్శకం.
ముఖ్యంగా, కేసీఆర్ స్థితప్రజ్ఞతతో ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా మాత్రమే కాక, పరిపాలనలో నైపుణ్యాన్ని చూపిన పరిపూర్ణ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యం లో దేశం మొత్తానికీ ఆదర్శంగా మారిన తెలంగాణ రాష్ర్టాన్ని చూసి ఇప్పుడు ప్రపంచమే ఇటువైపు చూస్తోంది. ఇదే నిజమైన ప్రజాస్వామ్యానికి, అభివృద్ధికి, పరిణత నాయకత్వానికి నిదర్శనం.
కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ రంగం అనేది ఓ మౌలిక అవసరంగా మాత్రమే కాకుండా, అభివృద్ధికి జీవనాడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో తిరుగులేని ఆదర్శంగా నిలిచింది. విద్యుత్ సమస్యను అధిగమించి, అన్ని రంగాల్లో అభివృద్ధికి వేదికగా చేసిన ఈ విధానం పరిపాలనలో ప్రగతిశీలతకు ప్రతీక. ఇదే అసలు నాయకత్వం దీర్ఘదృష్టి, దృఢసంకల్పం, అంకితభావం, పట్టుదల, ధైర్యం కలిగిన నాయకత్వం అంతటా ఆదర్శంగా నిలుస్తుంది.
వ్యాసకర్త: పూర్వ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి, హైదరాబాద్
– తన్నీరు శ్రీరంగారావు