లజ్జా గౌరి.. సంతాన లక్ష్మి, ఆది దేవతగా పేర్కొనే ఈ మాతను క్రీస్తు పూర్వం నుంచే కొలుస్తున్నట్టు చరిత్ర చెపుతోంది. అంతెందుకు, హరప్పా, మొహెంజదారో నాగరికతల్లోనూ లజ్జా గౌరి మాత ఆరాధన ఉన్నట్టు లభ్యమైన ఆధారాలను బట్టి స్పష్టమవుతున్నది. స్త్రీ సంతానోత్పత్తిని తెలిపే ఈ దేవతను ఇప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆరాధిస్తూనే ఉన్నారు.
ఆది దేవతగా శక్తి స్వరూపిణి అమ్మవారిని పూజిస్తుంటారు హిందువులు. తెలంగాణలో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. క్రీస్తు పూర్వం నుంచి ఈ మాతను కొలుస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ అమ్మవారు పూర్తి నగ్నరూపంలో దర్శనమిస్తుంది. శక్తి పీఠంగా అలంపూర్ జోగులాంబ గురించి తెలిసిన చాలామందికి ఆ సమీపంలోనే ఉన్న లజ్జా గౌరిదేవి గురించి మాత్రం తెలియదు. లజ్జాగౌరి దేవిని ప్రత్యేకంగా సంతానం కోసం ఆరాధిస్తారు. చెప్పుకోలేని వ్యాధులతో బాధపడే స్త్రీలు ఈ అమ్మవారిని పూజిస్తే, వాటి నుంచి విముక్తి పొందుతారని అంటారు. పద్మం వంటి ముఖం కలిగిన లజ్జాగౌరి విగ్రహాలు కుండ మాదిరిగా గుండ్రటి కడుపుతో, చెవులకు అందమైన కమ్మలతో, మెడకు హారాలతో ఉంటాయి. యోని భాగం కనిపించే విధంగా ఉంటుంది. ఐదు అడుగుల లోపు విగ్రహాలు తెలంగాణతోపాటు దేశంలోని పలు ప్రాంతాలలో బయటపడ్డాయి.
సంతానం కలగాలని స్త్రీ దేవతలను కొలిచే ఆచారం ప్రాచీనకాలం నుంచి ఉన్నది. బుద్ధుడి తల్లిదండ్రులు లజ్జాగౌరి మాతను పూజించిన తర్వాతే బుద్ధుడు జన్మించాడని ఒక వృత్తాంతం ఉంది. ఏ.కె.గోయల్ మరో ముగ్గురు రాసిన ‘తెలంగాణ ల్యాండ్ అండ్ పీపుల్ వాల్యూం-1’లో దీనిని పేర్కొన్నారు. బాదామి చాళుక్యుల కాలంలో లజ్జాగౌరిని ఎక్కువగా పూజించినట్టు కర్ణాటకలోని ఐహోల్, మహాకూట, నాగనాథకొల్ల, హులిగెమ్మనకొల్ల, సిద్ధనకొల్లలలో బయటపడ్డ విగ్రహాలనుబట్టి తెలుస్తోంది. నాగనాథకొల్లలో 7వ శతాబ్దపు లజ్జాగౌరి మాత నగ్న విగ్రహం ఉంది. చాళుక్యరాజు కృతవర్మ భార్య మగ సంతానం కోసం ఈ మాతను ప్రత్యేకంగా పూజించింది.
ఒడిశా ప్రజలు రాజా లేదా రాజాపర్వ అనే పేరుతో పండుగ జరుపుకొంటారు. ఇక్కడ తల్లి దేవత వసుమతి అంటే భూమి. రాజా అనే పదం రజస్వల నుంచి ఉద్భవించింది, ఇది రుతుక్రమాన్ని సూచిస్తుంది. మొదటి మూడు రోజులు రుతుస్రావం అవుతుందని నమ్ముతారు. ఈ సమయంలో ఇక్కడ అన్ని వ్యవసాయ కార్యకలాపాలు నిలిపివేస్తారు. అంబుబాచి మేళా అనేది అస్సామీ ప్రజలకు ఒక ముఖ్యమైన పండుగ. ఇక్కడ దేవత కామాఖ్య నాలుగు రోజులపాటు బహిష్టుకు పూర్వచక్రంలో ఉంటుంది. ఆ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. వ్యవసాయ కార్యకలాపాలు ఆపేస్తారు. దేవత రక్తంతో తడిసినట్టుగా భావించే గుడ్డ ముక్కలను గుడిలో భక్తులకు పంపిణీ చేస్తారు. వాళ్లు తమ ఇళ్లలో వాటిని రక్షిత తాయెత్తులుగా భద్రపర్చుకుంటారు.
తెలంగాణ రాష్ర్టానికొస్తే, ఆలంపూర్లో లభ్యమైన అమ్మ తల్లి విగ్రహం (దీనినే లజ్జా గౌరి అంటున్నాం) అత్యంత పురాతనమైనది. చేర్యాల దగ్గర , హుజూరాబాద్, కొలనుపాక, కోహెడ, బెజ్జంకి, తంగళ్లపల్లిలలో కూడా విగ్రహాలున్నాయి. హన్మకొండలోని రాజరాజ నరేంద్ర భాష నిలయం మలుపులో కూడా ఒక లజ్జాగౌరి విగ్రహం 2010 వరకూ ఉండేది. దీనిని ఎక్కడికి తరలించారో తెలియదు.
(వ్యాసకర్త: జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ, హైదరాబాద్)
కన్నెకంటి వెంకట రమణ