న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: రామ్జెట్ టెక్నాలజీని భారత్ విజయవంతంగా పరీక్షించింది. తద్వారా దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు వేసింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధికి కీలకమైన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (ఎస్ఎఫ్డీఆర్) సాంకేతికతను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. తద్వారా ఈ సాంకేతికత కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో మంగళవారం ఉదయం 10.45 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
రామ్జెట్ అనేది ఒక రకమైన గాలిని పీల్చుకునే జెట్ ఇంజిన్. ఇది సంప్రదాయ జెట్ ఇంజిన్ల వంటి భ్రమణ భాగాలపై ఆధారపడదు. క్షిపణి ముందుకు వచ్చే వేగాన్ని ఉపయోగించి లోపలికి వచ్చే గాలిని ఇది కుదిస్తుంది. తద్వారా ఎక్కువ వ్యవధితో పాటు అధిగ వేగాన్ని సాధించడం దీని ప్రత్యేకత. ఈ పరీక్ష విజయవంతమైందని, పరీక్షల్లో భాగంగా నాజిల్ లెస్ బూస్టర్, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ మోటర్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి వ్యవస్థలను పరీక్షించామని, అవి సంతృప్తికరంగా పనిచేశాయని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.