బెంగళూరులోని ఎంజీ రోడ్డులో లేదా ఢిల్లీలోని రింగ్ రోడ్డులో మీరెప్పుడైనా ట్రాఫిక్‌జామ్‌లో ఇరుక్కున్నారా? ఒకవేళ ఇరుక్కుపోయి ఉంటే.. ఆ ప్రాంతాల్లో ఎందుకు ట్రాఫిక్‌జామ్ అయిందో మీకు తెలుసా? ఆ మార్గా ల్లో ఎక్కువ కార్లు తిరుగుతుండటమే అందుకు కారణం. ప్రతిఒక్కరూ సొంత వాహనంలో వెళ్తే ఇలాగే ట్రాఫిక్‌జామ్ అవుతుంది కదా! 15 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యానికి గంట సేపు ప్రయాణించాల్సి వస్తుంది.
Traffic Jam | ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ప్రయాణించే కారుకు ఎంత జాగ అవసరమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అదే జాగలో పట్టే బస్సు లేదా రైలు బోగిలో ఎంతోమంది ప్రయాణించవచ్చు. సొంత కార్లున్న ప్రతిఒక్కరూ వాటికి బదులు బస్సులను ఆశ్రయించినట్టు ఒక్కసారి ఊహించుకోండి. మన రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగుతుంది కదా. ఆ బస్సులు ఎలక్ట్రికలో, హైబ్రిడో లేదా ఇతర హరిత ఇంధనంతో నడిచేవి అయితే, కాలుష్యం కూడా చాలా త్వరగా తగ్గిపోతుంది.
మన దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలు ఆర్థిక కార్యకలాపాలకే కాదు, అర్బనైజేషన్‌కు కూడా ప్రసిద్ధి. అధిక జనాభా, ట్రాఫిక్‌జామ్, అర్బనైజేషన్ వల్ల కలిగే ఇబ్బందులకు ఈ నగరాలు ప్రతీతి. వీటిని అధిగమించేందుకు వివిధ ప్రతిపాదనలు, కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ నగరాలు ఎప్పుడూ రద్దీగానే కనిపిస్తాయి. ప్రజా రవాణాను మెరుగుపరచడం, మెట్రో సేవలను మరింతగా విస్తరించడం లాంటి చర్యల ద్వారా కార్ల రద్దీని కొంతమేరకు తగ్గించవచ్చు. వాటికితోడు క్యాబ్‌లు, ఆటో రిక్షాలు ఉండనే ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది సొంత వాహనాల్లో వెళ్లేందుకే ఇష్టపడతారు.
రద్దీ ప్రదేశాల్లో కార్లకు అనుమతి నిరాకరించడం, పార్కింగ్ రుసుములను పెంచడం లాంటి చర్యల ద్వారా కార్ల వాడకాన్ని, తద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించవచ్చు. కానీ, ప్రభుత్వాలు అలా చేయడం లేదు. అందుకు విరుద్ధంగా కార్ల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే, మన దేశంలో జరిగే కార్ల కొనుగోళ్లలో ఈ మూడు నగరాల వాటా చాలా ఎక్కువ. సుమారు 30-35 శాతం కార్లు ఈ నగరాల్లోనే అమ్ముడవుతున్నట్టు ఒక అంచనా. కార్ల వల్ల ట్రాఫిక్, కాలుష్యం లాంటి సమస్యలు ఉన్నప్పటికీ, అవి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.
ఒకవేళ ప్రజా రవాణా మెరుగైతే యథావిధిగా కార్ల కొనుగోళ్లు తగ్గిపోతాయి. ప్రజలు కొత్త కార్లను చాలా తక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తారు. ఇప్పటికే కార్లున్న వారు వాటిని మితంగా వాడతారు. అయితే, ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చాలా పెద్దది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా సుమారు 7 శాతం. అంతేకాదు, లక్షల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తున్నది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ఒక్క కార్లకు సంబంధించినది మాత్రమే కాదు. తయారీదారులు, డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లు, అనుబంధ పరిశ్రమలు ఇలా అనేకం అందులో భాగం. ఒక్కసారిగా కార్ల కొనుగోళ్లు పడిపోతే.. ఈ మొత్తం చైన్ సిస్టమ్ దెబ్బతింటుంది. పెట్టుబడులు తగ్గిపోతాయి. అది లేఆఫ్‌లకు దారితీస్తుంది. చివరికి పరిశ్రమలు మూతబడతాయి. ఆటోమొబైల్ రంగం ప్రత్యక్షంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అంతేకాదు, దానిపై ఆధారపడి పరోక్షంగా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వీరంతా రోడ్డున పడతారు. అంతకుమించి ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యం నీరుగారిపోతుంది.
పన్నులు, డ్యూటీలు, ఇతరత్రా రూపంలో ఆటోమొబైల్ రంగం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వస్తున్నది. వాహనాలపై జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీల రూపంలో ఈ ఆదాయం ప్రభుత్వాలకు సమకూరుతున్నది. ఒక్కసారిగా కార్ల కొనుగోళ్లు పడిపోతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పడిపోతుంది. అది మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రభావం చూపుతుంది. అందుకే బస్సు, మెట్రో లాంటి ప్రజా రవాణాను ప్రభుత్వాలు కొంతమేరకే అభివృద్ధి చేస్తాయే తప్ప, మనం కార్లు కొనడం మానేసేంత గొప్పగా మెరుగుపరచవు.
(‘కార్టాక్’ సౌజన్యంతో..)
– బేబిచెన్ మ్యాథ్యూ