రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యనందిస్తూ, వారి బంగారు భవితకు బాటలు వేస్తున్న గురుకుల విద్యాసంస్థలు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత విస్తృత సంఖ్యలో గురుకులాలు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్‌తో సమానంగా పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు విద్యనందిస్తున్నాయి. ఉన్నత విద్యకు, ఉపాధి సాధనకు కావలసిన తర్ఫీదును ఇచ్చే శిక్షణ కేంద్రాలు గానూ గురుకులాలు రూపుదిద్దుకున్నాయి. వేలమంది నిరుపేద విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతూ దేశానికే తలమానికంగా తెలంగాణ గురుకులాలు నిలుస్తున్నాయి. ఇది నాణేనికి ఒక పార్శ్వం. మరోవైపు ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’ అన్న చందంగానే తయారైంది గురుకులాల పరిస్థితి.
Gurukula Schools | గురుకుల విద్యార్థులు, బోధన ఉద్యోగులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. గడిచిన 10 నెలలుగా అసలు గురుకులాల్లో ఏం జరుగుతున్నదో తెలియని దుస్థితి నెలకొన్నది. పాలన మొత్తం గాడి తప్పిపోయింది. ఇప్పటివరకు సాధించిన ప్రాభవం క్రమంగా మసకబారుతున్నది. ముందుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిద్దాం.
గురుకుల విద్యాలయాలు అత్యధికంగా అద్దె భవనాల్లో, అరకొర వసతుల నడుమ కొనసాగుతున్నాయనే క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండానే అన్ని గురుకులాలకు ఒకేరకమైన పని వేళలను నిర్ణయించింది. తెరిపి లేకుండా కొనసాగే ఈ టైంటేబుల్ వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చాలీచాలని మరుగుదొడ్లు, బాత్రూమ్లలో కేవలం అరగంటలో స్కూల్, జూనియర్ కాలేజీకి చెందిన 640 మంది, డిగ్రీ కాలేజీలో చదివే 840 మంది విద్యార్థులు ఎలా కాలకృత్యాలను తీర్చుకోగలరు? ఎలా తయారవగలరు? అనేది టైంటేబుల్‌ను రూపొందించిన పెద్దలే చెప్పాలి.ఇక భవనాల అద్దెలను 8 నెలలుగా చెల్లించకపోవడంతో యాజమాన్యాలు వసతులు కల్పించడం మానేశాయి.
గురుకుల ఉపాధ్యాయులు బోధనేతర పనుల భారంతో ఒత్తిడికి లోనవడమే కాదు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఇబ్బందవుతున్నది. ఇంతచేసినా ఒకటో తారీఖున జీతం అందుతుందా అంటే అదీ లేదు. ఏ సొసైటీలో ఎప్పుడు పడుతుందో తెలియని దుస్థితి. ఇవీ గాక ప్రమోషన్లు, బదిలీలకు ఒక్కో సొసైటీలో ఒక్కో నిబంధన. ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. అదేవిధంగా వివిధ జాతీయస్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి, అనేక ఉత్తమ ర్యాంకులు సాధించిపెడుతూ పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెడుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఇంతకు పూర్వం ఇస్తున్న నగదు ప్రోత్సాహకాలను ఆపేయడం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. పేరుకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తప్ప గురుకులంలో పనిచేస్తున్న సిబ్బందికి సర్వీస్, పే ప్రొటెక్షన్ లేదు. హెల్త్ కార్డు సౌకర్యం వర్తించదు. స్టేట్ సబార్డినేట్ రూల్స్ అమలుకావు. కానీ, గురుకులంలో ఎవరి తప్పిదం వల్ల ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మాత్రం చిన్న చిన్న కారణాలతో సిబ్బందిని బలి చేయడం పరిపాటిగా మారిపోయింది.
పరిష్కారమంటూ లేని సమస్య ఉండదు. అలాగే గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరించలేనంత పెద్దవేమీ కాదు. సంకల్పముంటే చాలు. అందుకు ముందుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పాఠశాల విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలోని గురుకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి. కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడంతోపాటు, కామన్ సర్వీస్ రూల్స్‌ను రూపొందించాలి. గురుకులాలకు ప్రభుత్వం గ్రీన్ చానల్ ద్వారా తక్షణం నిధులను విడుదల చేయాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలను 010 పద్దు ద్వారా ప్రతి నెలా మొదటి తేదీన విడుదల చేయాలి. గురుకుల ఉపాధ్యాయులకు పనికి తగిన వేతనాలు చెల్లించాలి.
అవసరమైతే ప్రోత్సాహకాలను అందించాలి. ఈ నిర్ణయాలు చాలు ప్రస్తుతం గురుకులాల్లో నెలకొన్న అనేక సంక్షోభ పరిస్థితులను సరిదిద్దడానికి. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రస్తుత ప్రభుత్వానికి ఈ సంగతి విన్నవిస్తున్నా ఇప్పటివరకు సానుకూల స్పందన లేదు. అందుకు భిన్నంగా ప్రభుత్వ విధానపర నిర్ణయాలు గోరుచుట్టు మీద రోకటి పోటులా పరిణమించాయి. వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తేవడం కోసం గురుకుల విద్యా జేఏసీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా కృషి చేశాం. ప్రజాభవన్‌ను ఆశ్రయించాం. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆశాజనకమైన ప్రకటనలు వెలువడిన దాఖలాల్లేవు.
ఈ నేపథ్యంలోనే దశలవారీ ఆందోళన చేపట్టి సమస్యను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించాం. అందులో భాగంగానే సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాం. సెప్టెంబర్ 23, 24 తేదీలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వివిధ ముఖ్య కార్యదర్శులకు, అన్ని గురుకుల సంస్థల కార్యదర్శులకు మెమోరాండాలు సమర్పించాం. టైంటేబుల్ మార్పుతో సహా ఇతర ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలన్న నేపథ్యంలో సెప్టెంబర్ 28న అన్ని గురుకుల విద్యాలయాల ప్రాంగణాల్లో చాక్‌డౌన్, పెన్‌డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాం.
గురుకుల సమస్యలపైన ప్రస్తుత ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని కోరుతున్నాం. గురుకుల ఉపాధ్యాయులతో చర్చలు జరిపి గురుకుల విద్యార్థులు, ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో నిరవధిక పోరాటాలను చేపడుతామని తెలియజేస్తున్నాం.
– గురుకుల విద్యా జేఏసీ