Krishna Water | ఇటీవలి కాలంలో కృష్ణా జలాల పంపిణీపై ‘2015, జూన్‌లో జరిగిన ఒప్పందం చేసుకోవడం ద్వారా కృష్ణా జలాల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు శాశ్వతంగా నష్టం కలుగజేసింది. తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి 512 టీఎంసీల నీటిని ఆంధ్రాకు అప్పజెప్పింది’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకులు దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకు వారు 2015, జూన్ 18, 19 తేదీల్లో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశపు మినిట్స్‌ను సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఆ మినిట్స్‌లో రాసుకున్న అంశాలను పూర్తిగా చదవకుండానే, చదివినా కుట్రపూరితంగా, ఉద్దేశపూరితంగానే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారనుకోవాలి. వారు చూపిస్తున్న సమావేశపు మినిట్సే ఆ అబద్ధాలకు సాక్ష్యం.
ఆ మినిట్స్‌ను దగ్గరుండి రాయించింది నాటి కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటి సలహాదారులుగా పనిచేసిన దివంగత ఆర్.విద్యాసాగర్‌రావు. తెలంగాణ సాధన ఉద్యమంలో నీళ్లల్లో నిప్పులు రగిలించినవాడు ఆర్.విద్యాసాగర్‌రావు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాలను, వివక్షను ప్రజలకు పూసగుచ్చినట్టు తన ఉపన్యాసాల్లో వివరించాడు. పత్రికల్లో వందలాది వ్యాసాలను రాసి నీటి సంగతులు ప్రజలకు తెలియపరిచాడు. ఆ వ్యాసాలను ‘నీళ్లు-నిజాలు’ పేరుతో రెండు సంకలనాలుగా ప్రచురించి ప్రజలను చైతన్య పరిచాడు. అలాంటి నిబద్ధ, నిష్కళంక ఉద్యమకారుడు కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం చేస్తాడని ఊహించడానికే కంపరంగా ఉన్నది.
కృష్ణా జలాల పునః పంపిణీ కోసం 2002 నుంచే పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఒప్పుకుంటారా? ఆ సమావేశానికి ఢిల్లీ వెళ్లే ముందు ఆనాటి సీఎం కేసీఆర్‌తో సమీక్షా సమావేశం జరిగింది. అందులో రాష్ట్ర వైఖరిని చర్చించాం. అప్పటికే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకా రం కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటైంది. 2015-16 వాటర్ ఇయర్‌కు నీటి పంపిణీ చేయవలసిన బాధ్యత కృష్ణా బోర్డుదే. అదే విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2014, మే 15న గజిట్ నోటిఫికేషన్ జారీచేసి బ్రిజేష్ కుమార్ (కెడబ్ల్యూడీటీ-2) ట్రిబ్యునల్‌కు రెండేండ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించింది. 2014, జూన్ నుంచే ట్రిబ్యునల్ విచారణను ప్రారంభించింది. ట్రిబ్యునల్ ముందు హాజరు కావాలని తెలంగాణ సహా 4 రాష్ర్టాలకు 2014, జూన్ 20న నోటీసులూ జారీ చేసింది. దీంతో రెండేండ్లలో తీర్పును వెలువరించే అవకాశం ఉన్నదనే ఆశాభావం అందరిలో కలిగింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జలయజ్ఞం కింద ప్రారంభించిన కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇంకా నీటిని వినియోగించుకునే దశకు రాలేదు. అనేక సమస్యల కారణంగా అవి పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. తెలంగాణ ఏర్పాటు కాగానే కరువుకు, వలసలకు, రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిన మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యాన్నిచ్చింది. భూ సేకరణ చేసింది. అటవీ సంబంధిత, రైల్వే, రోడ్డు క్రాసింగ్ సమస్యలను పరిష్కరించింది. 2015 నాటికి ఆ ప్రాజెక్టుల పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయి.
పైన వివరించిన కారణాల రీత్యా 2015 జూన్ 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో సాగునీటి సలహాదారుగా తెలంగాణ బృందానికి నాయకత్వం వహించి, కృష్ణా జలాల నీటి పంపిణీపై ఒక ఏడాది కోసం తాత్కాలిక వెసులుబాటు (Working Arrangement) ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మినిట్స్‌లో తెలంగాణ ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా ఆర్.విద్యాసాగర్ రావు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి పేజీలో రెండుసార్లు, చివరి పేజీలో రెండు సార్లు ఒక ఏడాది కోసమే ఈ ఒప్పందం అని, ఈ ఒప్పందం ట్రిబ్యునల్, కోర్టులు, ఇతర చట్టబద్ధ సంస్థల ముందు రాష్ర్టాల నీటి హక్కులపై ఏ రకమైన ప్రభావాన్ని చూపజాలదని నొక్కిచెప్పారు.
మొదటి పేజిలోని 5వ పేరాలో It was agreed in the meeting that the figures of share of the two states as mentioned list of projects dated 18.10.2013 (appended herewith as Annexure) may be followed as the working arrangement for the current year only without prejudice to the rights of the two states about their entitlements which have been raised or to be raised before appropriate fora. ఈ విధంగా రాశారు. అదే పేజీలోని 6వ పేరాలో The representatives of both the States agreed that they may utilize their share of water wherever they decide subject to availability of water at that place and without affecting the rights of other State. ఈ విధంగా నమోదై ఉన్నది.
అదే పేజీలోని 7వ పేరాలో Thereafter, project related issues were discussed and following working arrangements for the water year 2015-2016 only were agreed as a temporary measure. ఈ విధంగా నమోదై ఉన్నది. వీటికి అదనంగా చివరలో మరొకసారి ఇవే మాటలను విద్యాసాగర్ రావు నమోదు చేయించారు. చివరి పేజీలోని 17, 18వ పేరాలలో వాక్యాలు ఈ విధంగా నమోదు అయినాయి. 17వ పేరాలో : It was agreed that for current year the quantity of water available after allocation of 811 TMC would be shared proportionately. Similarly, the deficit below 811 TMC would also be shared accordingly. అని, 18వ పేరాలో : The entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the States before any forum. అని మినిట్స్లోని ఈ వాక్యాలను చదివి కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు ధారాదత్తం చేసిందని ఎవరైనా భావిస్తే వారి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని శంకించవలసి వస్తుంది. లేదంటే కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాత్రమే దుష్ప్రచారం చేస్తున్నారనుకోవాలి.
2018 నాటికి పైన పేర్కొన్న మహబూబ్‌నగర్ ప్రాజెక్టులు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక శ్రద్ధ వల్ల పూర్తయి పాక్షికంగా నీటిని వినియోగించుకునే దశకు చేరుకున్నాయి. ఆర్డీఎస్ కాలువకు కింద ఉన్న 58 వేల ఎకరాల స్థిరీకరణకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కూడా 11 నెలల్లో పూర్తి చేయించింది. కాబట్టి, ఒక ఏడాది కోసం చేసుకున్న ఒప్పందాన్ని వదిలేసి ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు కృష్ణా జలాల్లో 50 శాతం నీటిని వినియోగించుకోవడానికి అనుమతినివ్వాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, కృష్ణా యాజమాన్య బోర్డుకు నిరంతరం నివేదిస్తూనే ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. 2018, ఫిబ్రవరి 15న రాసిన లేఖతో మొదలైన 50 శాతం నీటి పోరాటం 2023 దాకా కొనసాగింది.
ఏటా జరిగే కృష్ణా బోర్డు సమావేశాల్లో మన ప్రతినిధులు ఈ అంశంపై గట్టిగా వాదించారు. అయితే బోర్డు చైర్మన్ తన విచక్షణాధికారాలను వినియోగించి 34(తె): 66 (ఆం) నిష్పత్తిని కొనసాగించేవారు. చైర్మన్ ఈ విచక్షణాధికారాన్ని ప్రశ్నిస్తూ అనేకసార్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు రాశారు. కేంద్రం ఈ విషయంలో తీసుకున్న చర్యలు శూన్యం. 2021లో జరిగిన కృష్ణా బోర్డు 14వ సమావేశంలో, 2022లో జరిగిన 16వ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్ కృష్ణా బేసిన్ ప్యారామీటర్లను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ కృష్ణా జలాల్లో 70.80 శాతం వాటా పొందడానికి అర్హత ఉన్నదని గట్టిగా వాదించారు. కృష్ణా బేసిన్లో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు (ఎస్ఎల్బీసీ)కి 40 టీఎంసీలు, కల్వకుర్తి ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25 టీఎంసీలు మొత్తం 105 టీఎంసీలు వినియోగం కోసం అవసరమని, ఈ నీటిని వాడుకోవడానికి అనుమతించాలని పట్టుబట్టారు.
ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా 811 టీఎంసీలలో 405.5 టీఎంసీలను తెలంగాణ వాడుకుంటుందని బోర్డు చైర్మన్‌కు నివేదించారు. 2023లో జరిగిన బోర్డు 17వ సమావేశంలో కూడా 50 శాతం నీటి వాటా కోసం గట్టిగా వాదించడమే కాదు, బోర్డు చైర్మన్ తన విచక్షణాధికారంతో నీటి పంపిణీ నిష్పత్తిని నిర్ధారించడాన్ని తెలంగా ణ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ రకంగా 50 శాతం తాత్కాలిక నీటి వాటా కోసం పోరాటం కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగింది.
అదే సమయంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల పరిష్కార చట్టం-1956, సెక్షన్ 3 ప్రకారం.. కృష్ణా ట్రిబ్యునల్ వేయమని కేంద్రాన్ని నిరంతరం కోరింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు కేంద్ర జల వనరుల మంత్రులకు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా లేఖలు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నెల రోజులకే సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని కృష్ణా ట్రిబ్యునల్‌కు నివేదించాలని కోరింది. 2016లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ అంశంపై కేసీఆర్ గట్టిగా వాదించారు. ట్రిబ్యునల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆనాటి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు. ఆమె ఈ అంశంలో చిత్తశుద్ధితోనే వ్యవహరించారు. కానీ, ఆమె ప్రయత్నాలను కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం లేఖ రాసి ఒకటిన్నరేండ్లు గడిచినా కేంద్రంలో చలనం రాలేదు. న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంలో కేసు ఉన్నప్పటికీ కేంద్రంతో ఈ అంశంపై నిరంతరం సంప్రదింపులు జరిపింది.
విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం… బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతుండగా మళ్లీ ఈ సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయమని ఎందుకు కోరుతున్నారని మేధావులకు సహా చాలామందికి అర్థం కాలేదు. సెక్షన్ 3 కిందనే విచారణ జరగాలని కేసీఆర్ ప్రభుత్వం కోరుకోవడానికి కారణం ఉన్నది. విభజన చట్టం సెక్షన్ 89లో కృష్ణా జలాల పునః పంపిణీ ప్రస్తావన లేదు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయమని మాత్రమే అందులో ప్రస్తావించింది.
ఇది చట్టం రూపొందించినప్పుడు జరిగిన తప్పిదం. అందులోనే సెక్షన్ 3 కింద పునఃపంపిణీ అంశాన్ని చేర్చి ఉంటే ఈపాటికి తెలంగాణ న్యాయమైన వాటా పొంది ఉండేది. చట్టం రూపకర్తలు ఆంధ్రా అనుకూల చట్టాన్ని తయారుచేశా రు. విభజన చట్టంలో ఇలాంటి అనేక తప్పిదాలు జరిగిన సంగతి ఉద్యమకారులు గుర్తించి సవరణ చేయమని కోరారు. మీకు చట్టం ఆమోదం కావాలో, సవరణలు కావాలో తేల్చుకోండని కేం ద్ర ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సవరణలకు పట్టుబట్టకుండా తప్పులతో నే చట్టం ఆమోదానికి సమ్మతించవలసి వచ్చింది.
సెక్షన్ 89 కింద విచారణ వల్ల తెలంగాణకు న్యాయం జరగదన్న స్పృహ కేసీఆర్‌కు ఉన్నది. ట్రిబ్యునల్ కూడా సెక్షన్ 89 కింద తమకు కృష్ణా జలాల పునః పంపిణీకి అవకాశం లేదని, పునః పంపిణీ అనే అంశం తమ విచారణ పరిధిలో లేదని రెండుసార్లు రాత పూర్వకంగా తమ తీర్పుల్లో పేర్కొన్నది. ఇవే అభిప్రాయాలను విచారణ సందర్భంగా అనేకసార్లు వెల్లడించింది. కాబట్టే సెక్షన్ 3 కింద జరిగే విచారణ ద్వారానే రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ న్యాయబద్ధంగా జరుగుతుందని భావించి నిరంతరం పోరాడారు.
2020, అక్టోబర్‌లో జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ ఈ అంశంపై పదే పదే పట్టుబడితే నాటి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ ట్రిబ్యునల్ వేయడానికి అంగీకరించారు. అయితే, అందుకు మెలికలు పెట్టారు. ఒకటి, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో వేసిన కేసును వాపస్ తీసుకోవాలి. రెండు, సెక్షన్ 3 రిఫరెన్సెస్ కొత్త ట్రిబ్యునల్‌కు నివేదించాలా, లేదా సెక్షన్ 89 కింద విచారణ జరుపుతున్న ప్రస్తుత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించాలా అన్న అంశంపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయం తీసుకుంటామని, ఆ తర్వాతే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇవన్నీ మినిట్స్‌లో నమోదయ్యాయి. కేంద్ర మంత్రి హామీని పురస్కరించుకొని సుప్రీంలో కేసు వాపస్ తీసుకొమ్మని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
సుప్రీంకోర్టు 2021 అక్టోబర్‌లో కేసు వాపస్ తీసుకోవడానికి తెలంగాణ రాష్ర్టాన్ని అనుమతించింది. ఇది జరిగి రెండేండ్లు గడిచిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023, అక్టోబర్‌లో సెక్షన్ 3 కింద అదనపు రెఫరెన్సెస్ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. దీంతో కృష్ణా ట్రిబ్యునల్ కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన పదేండ్ల పోరాటం ఫలించింది. కేంద్రం చేసిన ఈ రిఫరెన్సెస్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో కేసు వేసింది. ఈ కేసు విచారణ ఇంకా జరుగుతున్నది. అయితే, ఏపీ కోరిన స్టేను మాత్రం మంజూరు చేయకపోవడం తెలంగాణకు ఒక ఊరట. ఇటీవల ట్రిబ్యునల్ కూడా సెక్షన్ 3 కిందనే తొలుత విచారణ చేస్తామని ప్రకటించడం మరొక ఊరట.
ఇక్కడ ప్రజలు, మేధావులు, బుద్ధిజీవులు రాజకీయాలకతీతంగా ఆలోచించవలసిన అంశం ఏమంటే… కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిరంతర కృషి, పోరాట ఫలితమే సెక్షన్ 3 రిఫరెన్స్‌లు. ఇది విస్మరించరాని సత్యం. కేసీఆర్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు ఉంచిన డిమాండ్ 575 టీఎంసీలను సాధించడం ఎట్లా? అన్నదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు, తెలంగాణ సమాజం ముందున్న అసలైన సవాలు. ఇందులో రాజకీయాలకు తావులేదు. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం.
కనీసం ఈ అంశంలోనైనా రాజకీయ విమర్శలు మాని ఏకోన్ముఖంగా ముందుకుసాగడమే మనందరి లక్ష్యం కావాలి. ఈ రోజు అధికారంలో ఉండే మనుషులు, పార్టీలు రేపు అధికారంలో ఉండకపోవచ్చు. కానీ, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కొనసాగే నిరంతర వ్యవస్థ. ఈ అవగాహనతో, ఈ కీలక సమయంలో గత కేసీఆర్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు మాని కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అందరినీ కలుపుకుపోవాలి. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించడానికి ప్రతీ ఒక్కరూ సిద్ధంగానే ఉంటారు. ట్రిబ్యునల్‌లో న్యాయమైన వాటా సాధించడమే లక్ష్యంగా ఏకోన్ముఖ కృషి తెలంగాణ సమాజం తరపున జరగాలి.
నాటి కేసీఆర్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల పరిష్కార చట్టం-1956, సెక్షన్ 3 ప్రకారం.. కృష్ణా ట్రిబ్యునల్ వేయమని కేంద్రాన్ని నిరంతరం కోరింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు కేంద్ర జల వనరుల మంత్రులకు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా లేఖలు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నెల రోజులకే సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని కృష్ణా ట్రిబ్యునల్‌కు నివేదించాలని కోరింది.
-శ్రీధర్‌రావు దేశ్‌పాండే
విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్