‘స్థిరాస్తి వెంచర్ల పరిశ్రమలు.. 10 లక్షల ఎకరాలకు పైనే!.., రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు.., సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల ఎకరాలు..’ ఇవీ… దశాబ్దాల పాటు గోసపడిన తెలంగాణ రైతుకు పెట్టుబడి సాయం అందించకుండా పలు పత్రికలకు సర్కారు వారు ఇస్తున్న లీకులు. ఇంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేయలేక ఆపసోపాలు పడ్డది. అనర్హులు.. విధి విధానాలు.. అంటూ ఏడాది కాలంగా నెట్టుకొస్తూ తెలంగాణ రైతులను రెండుసార్లు పెట్టుబడి సాయానికి దూరం చేసింది. ఇప్పటికీ పథకాన్ని అమలుచేయకుండా ప్రభుత్వం ఇస్తున్న లీకులను చూస్తుంటే అసలు పథకానికే ఎగనామం పెట్టేందుకు సాకులు వెతుకుతున్నట్టుగా తోస్తున్నది.
రాష్ట్రంలో ముంచుకొస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారికి రైతు భరోసాను అరకొరగా అమలుచేసే అవకాశం ఉన్నదని కొందరు చెప్తున్నారు. అంటే ఏతావాతా సర్కారు అసలు ఉద్దేశాన్ని చూస్తే మాత్రం రైతుబంధుకు రాం.. రాం.. దిశగానే పాలకులు మొగ్గు చూపుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఒక సంక్షేమ పథకంలో అనర్హులు ఉన్నారంటూ ఏడాది పాటు ఆ పథకం అమలునే నిలిపివేసిన చరిత్ర బహుశా దేశంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు!!
రాజీవ్ ఆరోగ్యశ్రీని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. ఏండ్ల తరబడి ఈ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కార్పొరేట్ ఆస్పత్రులకు ఇదో కామధేనువుగా మారిందంటూ ఆరోపణలే కాదు, అందుకు అనేక ఆధారాలూ బయటికొచ్చాయి. అయినా… కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకంలోని అవకతవకలను అరికట్టి… మరింత మెరుగ్గా అమలుచేసిందే తప్ప అందులో లోపాలున్నాయంటూ పథకాన్ని నిలిపివేయలేదు.
అంతెందుకు.. రేషన్ కార్డుల ద్వారా నిరుపేదలకు అందే ఉచిత బియ్యం పక్కదారి పట్టిన సందర్భాలు అనేకం. ఇప్పటికీ ఆ ఛాయలు ఉండనే ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఇటీవల ఏకంగా ఒక ఓడలో పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం సముద్రం దాటి విదేశాలకు తరలివెళ్తుండగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అడ్డుకున్నారు. ‘సీజ్ ది షిప్ (ఓడలోని బియ్యాన్ని సీజ్ చేయండి)’ అని అన్నారే గానీ ‘స్టాప్ ది స్కీం (ఉచిత బియ్యం పథకాన్ని ఆపేయండి)’ అని అనలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు. లోపాలను సరిదిద్దుకొని మరింత మెరుగ్గా రైతులకు మేలు చేయాల్సిన పాలకులు సాకులను వెతికి పథకాలకే ఎసరు పెట్టాలని చూస్తున్నరు.
అందుకే గత కొన్ని నెలలుగా తెలంగాణలో రైతు అంటే ఉత్త పుణ్యానికి ప్రభుత్వ ఖజానాను దోచుకున్నట్టుగా పనిగట్టుకొని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నరు. రైతుబంధు పేరిట వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమంటూ ప్రభుత్వ పెద్దలు మొదలు ఒక సెక్షన్‌కు చెందినవారు గుండెలు బాదుకుంటున్నరు. ఇక రోజూ పత్రికల్లోనైతే ఐదెకరాలు… పదెకరాలు… బలిసిన రైతు… బక్క రైతు… అని విభజించి కోతల కత్తిని మరింత బలంగా ఝళిపించాలని ఆత్రుత పడుతున్నరు. రైతుబంధు దుర్వినియోగం… పది లక్షల ఎకరాలు అని ఒకరు, కాదు, మూడు లక్షల ఎకరాలు అని ఇంకొకరు, కాదు కాదు రెండు లక్షల ఎకరాలని మరొకరు. 2018 నుంచి తెలంగాణ ప్రభుత్వ ఖజానాను మొత్తం రైతులే దిగమింగారనే రీతిలో ప్రచారం చేస్తున్నది. ఐరాస ప్రశంసించిన బృహత్తర పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నరు. ‘ఇప్పుడైతే ఎకరాకు ఐదు వేలే, మేమొస్తే ఎకరాకు రూ.7,500’ అన్న హామీకి నీళ్లొదిలి ఏడాదికిపైగా ఒక రైతు సంక్షేమ పథకాన్ని ఈ స్థాయిలో అంపశయ్యపై నిలిపిన ఘనత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ పరిస్థితులు.. ఆపై కేసీఆర్ హయాంలో ఉచిత కరెంటు, రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామీణ తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ఎలా మారిందనే వాస్తవాలు మన కండ్లముందే ఉన్నాయి.
ఓ రెండు, రెండున్నర దశాబ్దాల కిందట తెలంగాణలో ఎండకాలం వచ్చిందంటే… ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు తెగ సంబురపడిపోయేవాళ్లు. కరువు మండలాల ప్రకటన.. ఆ ఎమ్మటే వచ్చే కరువు నిధుల కోసం వెయ్యి కండ్లతో ఎదురుచూసేవాళ్లు. అవి రాంగనే… తిలా పాపం… తలా పిడికెడు అన్నట్టు నేతలంతా ఎంపీడీవో కార్యాలయాల్లోనే కూర్చొని మారుమూల ప్రాంతాల్లో మట్టి రోడ్లు వేసేవాళ్లు. ఏండ్ల తరబడి చుక్క నీటికి నోచుకోని వర్రెల మధ్య చెక్‌డ్యాంలు సైతం కట్టేవారు. ఎంత చెట్టుకు అంత గాలి… బడా నేతల నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు కరువు నిధుల పంపిణీ అనేది న్యాయబద్ధంగా జరిగిపోయేది. ఆ తర్వాత గ్రామస్థాయి నేతలు కొత్త స్ప్లెండర్లు కొని తమ ఊర్లల్లోకి పోతే.. వలసలు పోగా మిగిలిన ఆ పది మంది ఆయన చుట్టూ గూమిగూడేవాళ్లు. చికెన్.. మటన్.. మందు.. రెండు, మూడు రోజుల మస్తు దావత్‌లు! ఆ ఊర్లో ఏదైనా బొడ్రాయి పండుగ జరగాలన్నా… చిన్న దేవుడి కార్యం జరుపాలన్నా ఆ స్ప్లెండర్ నాయకుడు కరుణిస్తేనే!! అందుకే సీనియర్ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ అన్నట్టు.. దేశంలో ఏ కొత్త మోడల్ కారు వచ్చినా ఉమ్మడి ఏపీలో అప్పట్లో దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న రాయలసీమ ప్రాంతంలోనే మొదటగా రయ్మంటుందట. అదీ కరువు నిధులకున్న మహత్తు. మరి.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కరువు నిధులు అనే పదమే వినపడటం లేదు. బహుశా 2014-15లో ఒకసారి కేసీఆర్ ప్రభుత్వం కరువు మండలాల జాబితా కేంద్రానికి పంపిందనుకుంట. ఆపై పంపలేదు. కారణం… కరువు మండలాల ప్రకటనకు అనుగుణంగా తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాలేదు.
అంటే గత పదేండ్లలో కరువు ఛాయలు అనేవి తెలంగాణ దరిదాపుల్లోకి రాలేదన్న మాట. ఏ జిల్లాలో ఎన్ని కరువు మండలాలు అని గతంలో చూసుకునేవాళ్లు. ఇప్పుడు ఏ జిల్లాలో ఎంత ధాన్యం పండిందంటూ పోటీపడే స్థాయికి తెలంగాణ రైతాంగం ఎదిగింది. అందుకే గత ఐదారేండ్లలో ఏ చిన్న గ్రామంలో చూసినా బొడ్రాయి పండుగ అంటే చాలు, ఏ నాయకుడి దయాదాక్షిణ్యం మీదనో కాకుండా! ప్రతి ఒక్క రైతు కుటుంబం పట్నంలోని తమ పిల్లల్ని పిలుచుకొని సొంతంగా యాటను కోసుకొని రెండు, మూడు రోజుల పాటు సంబురాలు చేసుకుంటున్నది.
పంట వేసేముందు రైతుబంధు… పంట చేతికి రాగానే వడ్ల పైసలు! రైతుల జేబులు బరువుగా మారి పల్లె గల్లాపెట్టె గలగలలాడింది. తెలంగాణ రైతు అంటే చెయ్యి పైకిపెట్టి ఒకరికి ఇచ్చెటోడేగానీ చేయి చాచి అడుక్కునేవాడు కాదన్నట్టుగా గ్రామీణ ప్రాంతాలు కళకళలాడాయి. రాజకీయాలు నేతలు ఎరుగు! నిజంగా ఒక తెలంగాణ రైతుగా ఆలోచిస్తే… బతుకనీక ఎక్కడికి పోవాలె అన్న ఆలోచన నుంచి పొట్ట, బట్టకు సావు లేకపోవడమే కాదు పిల్లలను ఎక్కడ సదివియ్యాలి? అన్న ఆలోచనదాకా వచ్చిండు. తెలంగాణ సమాజం మొత్తం సంతోషపడాల్సిన నిజమైన మార్పు అంటే ఇది.
దేశ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహలకు కూడా అందని రీతిలో కేసీఆర్ ప్రభుత్వం 11 సార్లు ఏకంగా సుమారు రూ.73 వేల కోట్లతో తెలంగాణ రైతులకు రైతుబంధు పేరుతో చేయూతనందించింది. ఏ సావుకారు దగ్గర చెయ్యి సాపకుండా… ఏ ఫర్టిలైజర్ దుకాణం యజమాని ముందు బాకీ కోసం మోకరిల్లకుండా, బ్యాంకులోకెల్లి రైతుబంధు పైసలు డ్రా చేసుకొని దర్జాగా విత్తనాలు, ఎరువులు కొనుక్కొని తలెత్తుకొని వ్యవసాయం చేసుకునేలా చేసింది. రైతుబంధు పథకంలో ఒక చోట లే అవుట్‌కు నిధులు రావచ్చు, ఇంకోచోట గుట్టలకు పైసలు పోవచ్చు. ఒకరిద్దరు అనర్హులు కాదు ముఖ్యం, వంద మంది బక్క రైతులు ప్రధానం అనే సూత్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం పాటించింది. దశాబ్దాల పాటు గోసపడిన తెలంగాణ రైతుకు ఉచితంగా కరెంటు ఇస్తున్నం, కడుపు నిండా తాగునీళ్లు ఇస్తున్నం, ఒక్క పెట్టుబడి సాయం అందిస్తే తన కాళ్ల మీద తాను నిలబడుతాడని ఆశించింది. కానీ గత ఏడాది కాలంగా ఏం జరుగుతున్నది? ఆ ఒకరిద్దరు అనర్హుల అంశాన్నే ప్రధాన ఎజెండాగా మార్చారు. వంద మంది రైతుల ప్రయోజనాలను గాలికొదిలారు. తెలంగాణ రైతుకు సాయం చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాలు… రౌండ్ టేబుళ్లు. అయ్యయ్యో! రైతుబంధు పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారంటూ ఓ సెక్షన్ మేధావివర్గం గళమెత్తితే… దానిని సరి చేసేందుకే మేధోమథనం చేస్తున్నాం! అందుకే రైతుబంధు ఉరఫ్ రైతు భరోసా ఆలస్యమైతుందంటూ కాంగ్రెస్ సర్కారు రెండు సీజన్ల పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టింది.
నిజంగా… తెలంగాణ రైతు కేసీఆర్ ప్రభుత్వంలో సర్కారు ఖజానాను మొత్తం కొల్లగొట్టారా?! తెలంగాణ గోస, ఉద్యమ చరిత్రపై ఇసుమంత అవగాహన లేని ఇతర ప్రాంత వ్యక్తులు ఎవరైనా… గత కొంతకాలంగా మీడియాలోని కథనాలు, ప్రభుత్వంలోని పెద్దల ప్రకటనలు చూస్తే నిజమే అనుకుంటరు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇన్ని లక్షల ఎకరాలు… అన్ని లక్షల ఎకరాలు… రైతుబంధు దుర్వినియోగమంటూ పత్రికలు రైతుల పెట్టుబడి సాయాన్ని హరాజ్ పాడుతుంటే రైతులు ఎన్ని లక్షల కోట్లు దిగమింగారోనని ఆశ్చర్యపోతారు. గత పదేండ్లలో బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు ఎగ్గొట్టి… మాఫీ చేయించుకున్న మొండి బకాయిల మొత్తం రూ.15 లక్షల కోట్ల పైమాటే. అదే బ్యాంకుల జాతీయీకరణ జరిగిన తర్వాత నేటిదాకా లెక్కిస్తే ఆ మొత్తం రూ.25 లక్షల కోట్లకు పైగా ఉన్నది. వెనుక ఏనుగు పోయినా సరే.. అన్నట్టు ఆ మొండి బకాయిల మాఫీ కంటే రైతుబంధులో అనర్హులకు పోయిందే ఎక్కువ అన్నట్టు చిత్రీకరిస్తుండటం విడ్డూరంగా ఉన్నది.
బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లోని బీచుల్లో జల్సా చేసుకుంటున్న విజయ్ మాల్యా వంటి వాళ్ల విలాసవంతమైన జీవితాన్ని సామాజిక మాధ్యమాల్లో ఆసక్తిగా చూసేవాళ్లు.. ఇక్కడ ఊర్లల్ల ఓ రైతు పొద్దంతా కాయకష్టం చేసి సాయంత్రం గింత మందు తాగితే అగో రైతుబంధు పైసలు వైన్ షాపులకే పోతున్నాయనే కుంటిసాకులు వెంట పడ్డారు. దీన్ని అడ్డం పెట్టుకొనే పాలకులు ఏరు దాటినంక తెప్ప తగలేసినట్టు రైతులకు పెట్టుబడి సాయం పథకానికి తూట్లు పొడుస్తున్నారు.
ఎవరి ఊహలకు కూడా అందని రైతుబంధు అనే గొప్ప పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన తర్వాత ఏకంగా భారత ప్రభుత్వమే అనుసరించడమంటే అది సాధారణ విషయం కాదు. నిజంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే పథకమైతే కేంద్రం ఎందుకు ఆచరిస్తుంది? ఆ సాయాన్ని మరింత పెంచేందుకు ఎందుకు సాహసిస్తుంది? కేంద్రమే కాదు, దేశంలోని కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ఇలా అనేక రాష్ర్టాలు సైతం రైతుబంధు పథకాన్ని తమ తమ రాష్ర్టాల్లో వివిధ పేర్లతో అమలుచేస్తున్నాయి. అంతెందుకు… దశాబ్దాల నుంచి సాగునీటి సౌకర్యం మెరుగ్గా ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా రైతుకు పెట్టుబడి సాయాన్ని కొనసాగిస్తున్నది. కానీ, దశాబ్దాల పాటు వ్యవసాయానికి దూరమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ రైతును ఆర్థికంగా భుజం తట్టేందుకు మన పాలకులకు చేతులు రావడం లేదు. కొండలు, గుట్టలు, వెంచర్లు అంటూ రైతులను మభ్యపెట్టేందుకు పావులు కదుపుతూనే ఉన్నారు. మీడియా, ఇంకొందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని తెర మీదకు రాకుండా అడ్డమైన వాదనలతో చర్చను పక్కదారి పట్టిస్తున్నారు.
ఇది ఇప్పటితో పోయేది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీ కంటే ఎకరానికి రూ.1500 తక్కువ చేసి ఈ నెల 26 నుంచి ఇస్తామంటున్న రైతు భరోసా అమలు ఎలా ఉంటుందనేది మున్ముందు చూడబోతున్నాం. ముందు చెప్పుకొన్నట్టు… ఇదేదో స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని తప్పించుకునేందుకు అనివార్యమైన అమలుగా కొందరు చెప్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి గతంలో అసెంబ్లీలో ఇచ్చిన నివేదికలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు అమలులో భాగంగా ఐదేండ్లలో సుమారు రూ.22 వేల కోట్లు సాగుకు యోగ్యం కాని భూములకు అందాయని చెప్పారు. లోతుగా పరిశీలిస్తే… వర్షాకాలంలో పత్తి, మొక్కజొన్న, వేరుశనగ లాంటి మెట్ట పంటల సాగు విస్తీర్ణం తెలంగాణలో భారీగా ఉంటుంది. యాసంగిలో ఈ విస్తీర్ణం కనిపించదు. ఈ క్రమంలో అంకెల్లో ఎకరాల ఆంక్షలతో పాటు సాగుయోగ్యం… అనే సాకుతో ఆయా సీజన్లో పంటలు వేసిన వాటికే పెట్టుబడి సాయం అనే మరో కత్తిని కూడా రైతుల మెడ మీద పెడతారనే సంకేతాలు లేకపోలేదు. ఇదే జరిగితే… ఐదేండ్ల పాటు తెలంగాణ రైతాంగానికి ఆర్థిక పరిపుష్టిని అందించిన అద్భుతమైన పథకానికి మరిన్ని తూట్లు పడి జల్లెడలా మారే ప్రమాదం ఉన్నది.
దశాబ్దాల పాటు వ్యవసాయానికి దూరమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ రైతును ఆర్థికంగా భుజం తట్టేందుకు మన పాలకులకు చేతులు రావడం లేదు. కొండలు, గుట్టలు, వెంచర్లు అంటూ రైతులను మభ్యపెట్టేందుకు పావులు కదుపుతూనే ఉన్నారు. మీడియా, ఇంకొందరు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని తెర మీదకు రాకుండా అడ్డమైన వాదనలతో చర్చను పక్కదారి పట్టిస్తున్నారు.