మార్పు అనే నినాదంతో రెండేండ్ల క్రితం అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నది. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో పేదల భూములను ప్రభుత్వం లాక్కుంటున్నది. ఎదురుతిరిగిన రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నది. వారి జీవనాన్ని విధ్వంసం చేస్తున్నది. అస్మదీయులకే అనేక ప్రాజెక్టులు కట్టబెడుతున్నది. సర్కార్ భూదోపిడీకి అంతేలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో లక్షల కోట్ల రూపాయల రుణం తీసుకొని ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా నిర్మించే ప్రయత్నం జరుగలేదు. ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఈ విషయంలో ‘కాగ్’ అనేకమార్లు అక్షింతలు వేసినా చీమ కుట్టినట్టు కూడా లేదు. రెవెన్యూ రాబడుల్లో భారీ పతనంతో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకపోయింది. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రవేశపెట్టి, అమలు చేసిన ఎన్నో పథకాలను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసింది.
మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం విధ్వంసానికి తెరతీసింది. మూసీ నది రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి నగరంలో దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నది. గండిపేట నుంచి నగరం చివరిదాకా ఈ పరివాహక ప్రాంతం ఉంటుంది. ఈ నదికి ఇరువైపులా ప్రజలు ఇండ్లు, అపార్టుమెంట్లు కట్టుకొని నివసిస్తున్నారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కింద ఆ నివాసాలన్నింటినీ కూల్చివేస్తామని, అక్కడ నివసిస్తున్నవారు ఖాళీ చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బఫర్ జోన్ ఇష్టం వచ్చినట్లు మారుతున్నది. 30 మీటర్ల నుండి నేడు ఒక కిలోమీటర్ వరకు బఫర్ జోన్ అని పరిగణిస్తున్నారు. అంటే నదికి ఇరువైపులా కిలోమీటర్ పరిధిలో ఉన్న నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేసి మూసీ నదికి సోయగాలు, సొబగులు దిద్దుతారట.
ఈ ప్రాజెక్టు గురించి ఫిబ్రవరి 12వ తేదీ నాడు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రామసభ ఏర్పాటు చేయగా అక్కడి వాసులంతా ఆ ప్రాజెక్టును వ్యతిరేకించి సంతకాలు చేశారు. మళ్లీ రెవెన్యూ అధికారులు ఎడ్జార్మెంట్ సర్వే పేరుతో ఆ ప్రాం తాన్ని బాధితుల వద్దకు వెళ్లగా వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ‘మా శవాల మీద నుంచి బుల్డోజర్లు పోవాల్సిందే, మేము ఇండ్లను ఖాళీ చేసేది లేదు’ అంటూ అక్కడి ప్రాంతవాసులు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. వాళ్ల జీవితాలు రోడ్లపాలవుతున్న పరిస్థితి.
మూసీ పునరుద్ధరణ 2017లోనే మొదలైంది. ఆ నీరు రకరకాల వ్యర్థ పదార్థాలు, పారిశ్రామిక రసాయనాలు, గృహాల్లో వాడిన డ్రైనేజీ నీరు, ఇంకా ఇతర కారణాలతో కలుషితమవుతున్నదని గ్రహించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్టీపీపీలను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కిలోమీటర్ మేర బఫర్ జోన్ పరిధి నిర్ణయిస్తే సాలార్జంగ్ మ్యూజియం, సిటీ కాలేజ్ లాంటి హెరిటేజ్ నిర్మాణాలకు కూడా ముప్పు వాటిల్లనున్నది. బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం అనుమానాస్పదమే.
ఇండ్లు, వాటితో వారికున్న సంబంధాలు, ఉద్వేగభరితమైన జీవితం ఇప్పుడు మూసీ నదిలో కొట్టుకుపోనున్నాయి. ‘మూసీ నిద్ర’ అంటూ హడావుడి చేసిన తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు నేడు మౌనం వహించడం వెనుక మర్మమేమిటి?
ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించడానికి 10 ఎకరాల 34 గుంటల స్థలంలో ఎత్తైన గాంధీ విగ్రహాన్ని గాంధీ సరోవర్ పేరిట ఐదు వేల కోట్లతో నిర్మించబోతున్నట్టు సీఎం ప్రకటించారు. ఇప్పటికే లంగర్‌హౌస్ బాపూఘాట్లో గాంధీ విగ్రహం ఉన్నది. దానికొక చారిత్రక నేపథ్యం ఉన్నది. గాంధీ సామాన్య జీవితం గడిపి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. కానీ బాపూజీ ఆశయాలు, ఆదర్శాలకు భిన్నంగా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. ఇదంతా ఎవరి మెప్పు కోసం? మహాత్మా గాంధీ మనుమడు తుషార్ గాంధీ కూడా ప్రభుత్వ చర్యను సమర్ధించడం లేదు. విగ్రహానికి ఖర్చు పెట్టే ఐదు వేల కోట్లతో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టవచ్చు.
ప్రభుత్వ అసంబద్ధ చర్యలు చూస్తుంటే.. మూసీ నది చుట్టూ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపినట్టుగా విశదమవుతున్నది. కంచ గచ్చిబౌలి, లగచర్ల, ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీ, మూసీ అయినా అస్మదీయులకు విలువైన భూములు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నమే కానీ, మూసీ నది ప్రక్షాళనపై శ్రద్ధ కాదు, గాంధీపై గౌరవం అంతకన్నా కాదు. సామాన్యుడిని రోడ్డుపాలు చేసే సుందరీకరణ, సరోవర్ అని చెప్పి ప్రజలను ఏమార్చుతున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన శాస్తి చేయవలసిన తరుణం ఆసన్నమైంది. ఆరు గ్యారెంటీలను గాలికొదిలి, 420 ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, ప్రాథమ్యాలను పక్కనపెట్టి, అనవసరమైన ప్రాజెక్టులను చేపట్టడం ప్రజలను వంచించడమే.
ప్రజా పాలన అంటే ప్రజలను పీడించడమా? లేదా వారిపై కక్ష తీర్చుకోవడమా? ‘హే రామ్’ అనేది మహాత్ముడి చివరి మాట. కానీ నేడు నిర్వాసితులైన ప్రజలు ‘హే రామ్..మమ్మల్ని కాపాడు మహాత్మా.. మమ్మల్ని ఆదుకో’ అని దీనంగా అర్థిస్తున్నా రు. కానీ వారి మాటలు ఈ చెవిటి ప్రభుత్వానికి వినిపించకపోవడం బాధాకరం.
-శ్రీ శ్రీకుమార్