1969లో కొత్తగూడెం థర్మల్ పవర్‌ప్లాంటులో నాలుగో తరగతి ఉద్యోగ నియామకం ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి కట్టబెట్టడంతో పురుడు పోసుకున్నది తెలంగాణ తొలిదశ ఉద్యమం. 2000 సంవత్సరంలో రైతులకు పెంచిన కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిని నిర్ధాక్షిణ్యంగా గుర్రపు డెక్కలతో తొక్కించి, కాల్పులు జరుపడంతో ఫీనిక్స్ పక్షిలా పునర్జన్మ అందుకున్నది మలిదశ ఉద్యమం. నియామకాల వివక్షతో మొదలైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ రైతులు ప్రత్యేకించి తెలంగాణ వ్యవసాయదారుల పట్ల అప్పటి ప్రభుత్వం ప్రదర్శించిన అమానుషవైఖరితో ఆకాంక్ష తీవ్రతరమైంది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గత దశాబ్ద కాలంలో ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నది. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల వైఖరి మూలంగా అసంతృప్తి, అసహనానికి గురవుతున్నమాట వాస్తవం.
ఆంధ్రమూలాలు కలిగిన 1,152 మంది ఇంజినీర్లు, అధికారులను తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి రిలీవ్ చేయడం, వారిని ఆంధ్రప్రదేశ్ తమ సంస్థల్లో చేర్చుకోవడానికి నిరాకరించడంతో అక్కడి ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించడం విదితమే. కోర్టుల్లో కేసులను సమర్థవంతంగా ఎదుర్కోకపోవడం, ఆంధ్రకు సంబంధించిన విద్యుత్తురంగ యాజమాన్యాలతో సరైన రీతిలో విద్యుత్తు ఉద్యోగుల విభజన సమస్యను హ్యాండిల్ చేయకపోవడం ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించింది. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గొడవలు చివరకు సమస్యను పరిష్కరించడానికి జస్టిస్ ధర్మాధికారి నేతత్వంలో ఏకసభ్య కమిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించింది.
అయితే, జస్టిస్ ధర్మాధికారి తీసుకున్న నిర్ణయం తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల పాలిట శాపమైంది. రిలీవైన 1,152 మంది ఉద్యోగులకు అదనంగా మరో 500 మంది ఉద్యోగులను కమిషన్ తెలంగాణకు కేటాయించింది. అప్పటి యాజమాన్యాల మెతకవైఖరి, లోపాయికారి అవగాహనలతో తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లుగా జఠిలంగా తయారైంది. ఏండ్ల తరబడి ఆంధ్ర ఉద్యోగులకు ఎలాంటి పనీ కేటాయించకుండా కూర్చోబెట్టి వందల కోట్ల జీతభత్యాలు చెల్లించడం దీనికి అదనం. ఎప్పుడైతే ధర్మాధికారి తుది తీర్పు అనంతరం ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో చేరారో అప్పుడు తెలంగాణ ఉద్యోగుల సమస్యలు ద్విగుణీకృతమయ్యాయి. ఏడెనిమిదేండ్లపాటు హయ్య ర్ పోస్టుల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినవారు అకస్మాత్తుగా మళ్లీ కింది పోస్టుకు రివర్షన్ అ య్యారు. ‘పూలమ్మినచోట కట్టెలు అమ్ముకోవడం’ అన్నమాట. రివర్షన్ అయిన వారిలో కొద్దిమందికి మళ్లీ కొత్త తేదీలతో ప్రమోషన్లు ఇచ్చినప్పటికీ, చాలామంది ఇప్పటికీ రివర్షన్ అయి, కింది పోస్టుల్లో పనిచేస్తూ అవమానభారంతో కుంగిపోతున్నారు. అప్పట్లో ఒక ఉన్నతాధికారి విద్యుత్తు ఇంజినీర్ల విభజన విషయంలో నిబంధనలను అతిక్రమించి, పరిమితికి మించిన సంఖ్యలో ఆంధ్ర ఇంజినీర్లను తెలంగాణ విద్యుత్తు సంస్థల్లోకి తీసుకోవడమే ఈ సమస్యలన్నింటికీ ముఖ్యమని పలువురు ఇంజినీర్లు భావిస్తున్నారు. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన ఇంజినీర్లు మరింత నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు.
ఇటీవలి కాలంలో విద్యుత్తు ఉద్యోగుల విభజనలో భాగంగా దశాబ్దాల తరబడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసి తెలంగాణకు కేటాయించిన ఆంధ్ర ఇంజినీర్లను కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో నియమించడాన్ని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. కీలకమైన ట్రాన్స్‌కో, జెన్కో, సదరన్ డిస్కం, రెడ్కో, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ వంటి కీలకమైన శాఖల్లోని ఉన్నత పదవుల్లో ఆంధ్ర ఇంజినీర్లను నియమించడం తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర అలజడికి కారణమవుతున్నది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోమాటలు చెప్పినప్పటికీ డైరెక్టర్ల స్థానంలో సుదీర్ఘకాలం (ఏడాదికి పైగా) నియామకాలు చేపట్టకపోవడం, వారి స్థానాల్లో ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో చొరబడిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం అసంతృప్తికి కారణమైంది. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వివాదాస్పద నియామకంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళనకు బీజం పడింది. మహిళకే కేటాయించాలని అనుకున్నప్పుడు తెలంగాణ నుంచి సమర్థవంతమైన మహిళా ఇంజినీర్లు ఎంతోమంది ఉండగా ఆంధ్ర ఇంజినీర్‌కు కేటాయించడం మింగుడుపడని విషయం.
ఉత్పత్తిరంగం జెన్కోలో కీలకమైన డైరెక్టర్ పోస్టుల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన అధికారులను నియమించడాన్ని సమాజం జీర్ణించుకోలేకపోతున్నది. ఏపీలోని రాయలసీమకు చెందిన తెలంగాణ విద్యుత్తు సంస్థల్లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తిని జెన్కో కీలకమైన డైరెక్టర్ పోస్టులో నియమించడం వివాదాస్పద నిర్ణయంగా పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని జెన్కోలో పనిచేస్తున్న కింది స్థాయి ఇంజినీర్‌ను డిప్యుటేషన్ పేరిట హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీజీయస్పీడీసీయల్కు బదిలీ చేస్తూ ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ఇవ్వడం ఇటీవల మొదలైన ఆంధ్ర ఆధిపత్యానికి పరాకాష్ఠగా పలువురు పేర్కొంటున్నారు. భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రెండేండ్లుగా ట్రిబ్యునల్‌లో కేటాయింపుల మార్పు గురించి పోరాటం చేస్తుండగా ఒక దిగువ ఇంజినీర్ స్థాయి అధికారిని తెలంగాణ సంస్థలోకి డంప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం పెల్లుబుకుతున్నది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రవివక్షకు, అణచివేతకు గురైన తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం విషాదం. ఎన్నో ఆశల పల్లకిల మధ్య అధికారం చేపట్టిన ప్రభుత్వం తెలంగాణ విద్యుత్తు రంగంలో రెండున్నరేండ్ల కాలంలో ఉద్యోగుల విషయాల్లో తీసుకొ న్న పలు నిర్ణయాలు తెలంగాణ ఆత్మగౌరవానికి అ పసవ్యదిశలో ఉండటమే కాకుండా భవిష్యత్తులో భారంగా పరిణమించే అవకాశం ఉన్నది.
ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ పాలసీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన నేపథ్యంలో తెలంగాణ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వివాదాస్పద నియామకంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళనకు బీజం పడింది. మహిళకే కేటాయించాలని అనుకున్నప్పుడు తెలంగాణ నుంచి సమర్థవంతమైన మహిళా ఇంజినీర్లు ఎంతోమంది ఉండగా ఆంధ్ర ఇంజినీర్‌కు కేటాయించడం మింగుడుపడని విషయం.