ప్రభుత్వ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయి. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను, పార్లమెంటరీ చర్చలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నది నిజం. ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా తొలుత పెద్ద నోట్లను రద్దుచేశారు. దీనివల్ల ఏ లక్ష్యమూ నెరవేరకపోగా, సన్న, చిన్న వ్యాపారులు, రైతులు, కూలీలు దారుణంగా నష్టపోయారు. దేశ ఆర్థికవ్యవస్థ కుంగిపోయింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాయి. దేశ ఆహార భద్రతకు ప్రమాదమని, రైతులు, వ్యవసాయ నిపుణులు, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా పార్లమెంటులో చర్చకు పెట్టకుండానే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. వందలమంది అన్నదాతలు చనిపోయాక కానీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు.
ఆర్థిక అసమానతలకు, సంపద కేంద్రీకరణకు, కార్పొరేట్ల గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని నిపుణులు నెత్తీనోరు బాదుకున్నా ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు, లీజులకు కేంద్రం గేట్లు తెరిచింది. దేశ ఆర్థిక వ్యవస్థకే పెను ప్రమాదమని ప్రపంచబ్యాంకు, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) హెచ్చరిస్తున్నా బ్యాంకుల ప్రైవేటీకరణకు పూనుకొన్నది. స్టేట్‌బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లను మాత్రం (ప్రస్తుతానికి) ఉంచి మిగిలిన ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ కార్పొరేట్లకు అప్పగించబోతున్నది. ఇది దేశానికి దురదృష్టకరం. ఆర్థిక సంక్షోభాల బారిన దేశం పడకుండా బ్యాంకులు ఎన్నోసార్లు కాపాడాయి.
1990 నాటి ఆసియా సంక్షోభం, 1990-2000 నాటి లాటిన్ అమెరికా, జపాన్ సంక్షోభాల నుంచి ఆయా దేశాలను కాపాడింది బ్యాంకులే. ప్రపంచబ్యాంకు నివేదిక 2013 ప్రకారం 2007-08 నాటి ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంలో భారతదేశం, చైనా ప్రభుత్వ బ్యాంకులు గణనీయమైన కృషి చేశాయి. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా వ్యవసాయంతోపాటు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు గణనీయంగా నిధులు అందించాయి. నాడు ప్రభుత్వ బ్యాంకులన్నీ 100 శాతం లక్ష్యాలను నెరవేర్చడం వాటి ఘన విజయమే. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడిన ప్రభుత్వ బ్యాంకులను ఆదర్శంగా తీసుకుని అమెరికా సహా పలు దేశాలు తమ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను గణనీయంగా పెంచుకున్నాయి.
1947 నుంచి 1969 వరకు అప్పటి ప్రైవేటు బ్యాంకులు అన్నదాతలకు అందించిన రుణం కేవలం రూ.100 కోట్లు. బ్యాంకుల జాతీయీకరణ తర్వాత 1969 నుంచి 2020 వరకు వ్యవసాయానికి బ్యాంకులు అందించిన రుణం రూ. 15 లక్షల కోట్లు. నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రైవేటు బ్యాంకులు సేవలు అందిస్తే, బస్సు కూడా తిరగని మారుమూల పల్లెల్లోనూ ప్రభుత్వ బ్యాంకులు శాఖలు తెరిచి రైతులు, వ్యాపారులకు రుణాలు అందిస్తూ గ్రామీణుల ప్రగతికి బాటలు వేస్తున్నాయి. అంతెందుకు, ప్రభుత్వం గర్వంగా చెప్పుకొనే జనధన్ ఖాతాల్లో 97 శాతం ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్నవే.
ప్రపంచంలోని టాప్‌టెన్ కుబేరుల్లో ఐదుగురు భారతీయులే ఉన్నారు. కానీ వాళ్లలో ఒక్కరి డిపాజిట్లు కూడా ప్రభుత్వ బ్యాంకుల్లో లేవన్నది నిజం. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న రూ.45 లక్షల కోట్ల డిపాజిట్లన్నీ సామాన్య ప్రజలవే. అలాంటి సామాన్యుల డిపాజిట్లకు భద్రత కల్పించే ఎఫ్ఆర్డీఐ చట్టాన్ని సడలించి ఆ సొమ్మును కూడా కార్పొరేట్ల రుణమాఫీకి తరలించేందుకు కేంద్రం యత్నించింది. అయితే, పెల్లుబికిన ప్రజా వ్యతిరేకతతో ఆ తర్వాత వెనుకడుగు వేసింది. రిజర్వు బ్యాంక్ ఏర్పడిన తర్వాతి నుంచి 1969 వరకు 1500కుపైగా ప్రైవేటు బ్యాంకులు మూతపడ్డాయి.
ఇటీవలి కాలంలో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ వంటి బ్యాంకులు చేతులెత్తేశాయి. దీంతో డిపాజిటర్లు దారుణంగా నష్టపోయారు. అదే సమయంలో ప్రభుత్వ బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయి. 2009-10 నుంచి 2019-20 మధ్య ప్రభుత్వ బ్యాంకులు రూ. 14,53,341 కోట్లు ఆర్జించాయి. ఇలా లాభాల్లో ఉన్న బ్యాంకులను ప్రైవేటీకరిస్తే కార్పొరేట్లకే లాభం తప్ప దేశానికి ఒరిగేదేమీ ఉండదు. ప్రభుత్వ బ్యాంకుల్లోని మొండి బకాయిలన్నీ కార్పొరేట్ సంస్థలవే కావడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల సిఫారసుతో రుణాలు పొంది బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టింది ఇవే.
ఇలాంటి ఎగవేతదారులకే కేంద్రం రూ. 7.89 లక్షల కోట్లు మాఫీ చేసింది. నిజానికి పెద్ద బ్యాంకులతోనే దేశానికి అసలు ముప్పు పొంచి ఉన్నది. చిన్న చిన్న బ్యాంకులను విలీనం చేసి పెద్ద బ్యాంకులను చేయాలనుకుంటున్న కేంద్రం ఈ విషయమై ఆలోచించాలి. దీనివల్ల వేలమంది ఉద్యోగాలు కోల్పోతారు. దీనివల్ల మరో ముప్పు ఏంటంటే.. ఎంతపెద్ద బ్యాంకు కుప్పకూలితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత భారీగా నష్టపోతుందని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007-08లో అమెరికా, యూరప్ దేశాల్లోని అతిపెద్ద బ్యాంకులు కుప్పకూలడం వల్లే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైనట్టు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అప్పట్లో చెప్పారు.
పారిశ్రామికవేత్తలకు బ్యాంకు లు పెట్టుకునేందుకు లైసెన్సులు ఇస్తామని ఆర్బీఐ-ఐడబ్ల్యూజీ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కమిటీలోని 9/10 మంది వ్యతిరేకించినా కేంద్రం పట్టించుకోలేదు. బ్యాంకింగ్ రంగం పారిశ్రామికవేత్తల వశమైతే అది దేశానికే పెను ప్రమాదమన్న వాస్తవాన్ని గుర్తించాలి. అప్పట్లో ఇలాంటి చర్చే అమెరికాలోనూ జరిగినా ఆ తర్వాత వాస్తవాన్ని గుర్తించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
1930 నుంచి 30 ఏండ్లపాటు విజయవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వ బ్యాంకును 1968లో అమెరికా ప్రైవేటీకరించింది. ఈ బ్యాంకుతోపాటు మరో ప్రైవేటు బ్యాంకు కుప్పకూలడం వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ అప్పట్లో అంతగా కుదేలైంది. ఈ రెండు బ్యాంకుల నిర్వాకం వల్ల 5.4 ట్రిలియన్ డాలర్లను అమెరికన్లు కోల్పోయారు. ఈ బ్యాంకులను తిరిగి గాడినపెట్టేందుకు రెండుసార్లు బెయిలవుట్ ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక తిరిగి వాటిని జాతీయం చేసింది. కాబట్టి ఇవన్నీ చూసైనా ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలి.
-పాతూరి వెంకటేశ్వరరావు,98490 81889